TS Liquor Shops: కేసీఆర్ ఎత్తు వేస్తే.. ఎవరైనా చిత్తవ్వాల్సిందే.. తెలంగాణ మద్యం పాలసీ విషయంలో గులాబీ బాస్ ప్లాన్ మామూలుగా వర్కవుట్ కాలేదు. ఎన్నికల వేళ ఖజానా నింపుకునేందుకు వేసిన ప్లాన్‌తో సర్కార్‌కు కాసుల పంట పండింది. నాలుగు నెలల ముందే మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి.. కేవలం దరఖాస్తుల ద్వారానే వేల కోట్లు సమీకరించకున్నాడు కేసీఆర్. దీంతో కేసీఆర్‌కు ఫుల్ల మద్యం కిక్కు రాగా, ఖజానా కాసులతో గలగలలాడుతోంది.
నాలుగు నెలల ముందే..
డిసెంబర్‌లో మద్యం దుకాణాల గడువు ముుస్తుంది. సాధారణం నవంబర్‌లో తదుపరి దుకాణాలు ఎవరికి కేటాయించాలన్నది డిసైడ్ చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికల తాయిలాలు పంచడానికి డబ్బులు అవసరం అయ్యాయి. వెంటనే దరఖాస్తులు తీసుకుంది. ఒక్కో దరఖాస్తు ఫీజు రెండు లక్షలుగా ఖరారు చేసింది. ఇది దుకాణం వచ్చినా రాకపోయినా తిరిగి ఇవ్వరు. ఇలాంటి దరఖాస్తుల ఆదాయం రెండున్నర వేల కోట్లు వచ్చింది. దుకాణాల వేలం కూడా వేస్తారు. వేలంలో పాడుకున్న వారు కొంత మొత్తం ముందే చెల్లించాల్సి ఉంటుంది. దాని ద్వారా మరిన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది.
ఆదాయార్జనే లక్ష్యంగా..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ ఆదాయార్జనకు ప్రత్యేక మార్గాలు అందుకున్నారు. ఓ వైపు భూముల అమ్మకం చురుగ్గా సాగుతోంది. మరో వైపు లిక్కర్ ఆదాయం జోరుగా వస్తోంది. మరో వైపు ఔటర్ లాంటి భారీ ప్రాజెక్టులను లీజుకిచ్చేసి వేల కోట్లు ఖజానాకు వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక అనుమతించిన మేరకు అప్పులు.. కార్పొరేషన్ల ద్వారా ఇతర అప్పులు సేకరించి.. పథకాలను ప్రారంభిస్తున్నారు. చెప్పిన వాటికి తగినట్లుగా నిధుల మంజూరు చేస్తున్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలేవీ చిన్న చిన్నవి కాదు. రూ. లక్షల్లో నగదు బదిలీ చేయాల్సినవే. అందుకే నిధుల ఒత్తిడి అలాగే ఉంటుంది. ఎన్ని నిధులు వచ్చినా సరిపోవు.
గెలవాలంటే కంటిన్యూ చేయాలి..
ఇప్పటికే కేసీఆర్‌పై ఎన్నికల వేళ పథకాలు ప్రకటిస్తారన్న అపవాదు ఉంది. ఎన్నికలు అయ్యాక ఆగిపోతాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తప్పని నిరూపించేందుకు, వచ్చే ఎన్నికల్లో గెలిచేందకు పథకాలు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గొర్రెలు పంచి ఐదేళ్లు దాటింది. దళితబంధు మూడేళ్ల క్రితం ఇచ్చారు. రెండో విడత ఊసే లేదు. బీసీలు, మైనార్టీలకు లక్ష సాయం ప్రారంభం దశలోనే ఆటంకాలు ఎదుర్కొంటోంది. సొంత ఇంటి పథకానికి ఇంకా అడుగు పడలేదు. రైతులకు పరిహారం అందడం లేదు. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని కొనసాగించడమే ఇప్పుడు కేసీఆర్ తక్షణ కర్తవ్యం. అందకు భారీగా నిధులు కావాలి. ఇప్పుడు ప్రారంభించి.. ఎన్నికలు అడ్డం వచ్చాయి.. ఎన్నికలు అయిపోగానే మళ్లీ కంటిన్యూ చేద్దాం అని నమ్మించే ప్రయత్నంలో భాగంగానే ఈ స్కీములు అందుకుంటున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనా కేసీఆర్ వనరులు దాచుకుని ఎన్నికల ముందు వాడేస్తున్నారు.