Telangana Municipal Exit Polls: తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు కొన్ని ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ.. ఇతర రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి.
ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానై వ్యవహరించారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గులాబీ పార్టీ నాయకులు కూడా జోరుగానే ప్రచారం చేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. బిజెపి నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ వంటి నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తమ సొంత జిల్లాలలో పట్టు కోల్పోకుండా వ్యవహరించారు.

116 మున్సిపాలిటీలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 68 నుంచి 76 స్థానాలు గెలుచుకుంటుందని.. భారత రాష్ట్ర సమితి 29 నుంచి 36 స్థానాలలో పాగా వేస్తుందని.. బిజెపి మూడు నుంచి ఐదు స్థానాలు.. ఎంఐఎం ఒక స్థానంలో గెలుపు సాధిస్తుందని.. ఇతర పార్టీలు 8 నుంచి 14 స్థానాలు దక్కించుకుంటాయని పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది.
ఏడు కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం ను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ ను బిజెపి సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి ఒక కార్పొరేషన్ లో కూడా సత్తా చూపించలేదని.. ఈ ఎన్నిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక కార్పొరేషన్ కూడా దక్కదని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది..

రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు 30 నుంచి 40.. భారత రాష్ట్ర సమితికి 16 నుంచి 20.. భారతీయ జనతా పార్టీకి మూడు నుంచి 6.. ఇతరులకు నాలుగు నుంచి ఏడు వార్డులు వచ్చే అవకాశం ఉంది..
మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 29 నుంచి 43.. భారత రాష్ట్ర సమితికి ఎనిమిది నుంచి 12.. భారతీయ జనతా పార్టీకి ఆరు నుంచి తొమ్మిది.. ఇతరులకు ఒకటి లేదా రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 28 నుంచి 34.. భారత రాష్ట్ర సమితికి ఏడు నుంచి తొమ్మిది.. సిపిఐ కి 14 నుంచి 16.. ఇతరులకు రెండు నుంచి నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16.. భారత రాష్ట్ర సమితికి పది నుంచి 12.. బిజెపికి 24 నుంచి 29.. ఎంఐఎం కు ఆరు నుంచి తొమ్మిది.. ఇతరులకు ఒకటి నుంచి మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 16.. భారత రాష్ట్ర సమితికి రెండు నుంచి నాలుగు.. భారతీయ జనతా పార్టీకి 26 నుంచి 31.. ఎంఐఎం కు 8 నుంచి 12.. ఇతరులకు ఒకటి నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
నల్గొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 26.. భారత రాష్ట్ర సమితికి ఎనిమిది నుంచి 12.. బిజెపికి ఆరు నుంచి పది.. ఎంఐఎం కు రెండు నుంచి నాలుగు.. ఇతరులకు ఒకటి లేదా రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 26 నుంచి 30.. భారత రాష్ట్ర సమితికి 18 నుంచి 22.. బిజెపికి ఆరు నుంచి 8.. ఎంఐఎం కు రెండు నుంచి నాలుగు.. ఇతరులకు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది..
పీపుల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 36%, భారత రాష్ట్ర సమితికి 29.7%, బిజెపికి 19.3%, ఎంఐఎం కు రెండు శాతం.. సిపిఐ కి రెండు శాతం, సిపిఎం కు 1.2%.. ఇతరులకు 9.7% ఓట్లు లభిస్తాయని తెలుస్తోంది.