Mallareddy Narendra Modi meeting: రాజకీయ నాయకులు అవసరాల కోసం మాత్రమే అడుగులు వేస్తుంటారు. ప్రతి విషయంలోనూ రాజకీయాలను మాత్రమే చూసుకునే నాయకులు.. తమ భవిష్యత్తు విషయంలో కూడా అలాంటి విధానాలనే పాటిస్తూ ఉంటారు. అందువల్లే రాజకీయ నాయకులను ఎవరూ నమ్మరు. వారు మాట్లాడే మాటలను పెద్దగా విశ్వసించరు.
తెలంగాణలో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటి సాధించిన నాయకులలో మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఈయన మీద ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో చిత్రచిత్రమైన పనులు చేస్తూ.. జనాల మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. పాలు, పూలు అమ్మే ఈ స్థాయికి వచ్చానని నిత్యం చెప్పుకునే మల్లారెడ్డి.. తన మీద వచ్చిన ఆరోపణలకు మాత్రం సమాధానం చెప్పరు. ఈయన మీద.. ఈయన సంస్థల మీద గతంలో అనేకసార్లు ఐటీ అధికారులు దాడులు చేశారు.
మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రారంభించారు. ప్రారంభంలోనే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గట్టి లాబీయింగ్ తో మంత్రి అయ్యారు.. కేవలం భారత రాష్ట్ర సమితి నాయకులతో మాత్రమే కాకుండా.. ఇతర పార్టీ నాయకులతో కూడా మల్లారెడ్డి సంబంధాలు కొనసాగిస్తుంటారు. తన అవసరాల కోసం.. మల్లారెడ్డి పది మెట్లు ఎక్కుతారు.. అవసరమైతే పది మెట్లు దిగుతారు.
మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా రేవంత్ రెడ్డి ఆయనకు బద్ధ శత్రువు. ఇప్పటికే మల్లారెడ్డి సంస్థల మీద అనేక రకాల కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆయన అలా సమావేశం కావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అయితే తన కోడలు ప్రీతి రెడ్డితో ఆయన నరేంద్ర మోడీని కలవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రీతి రెడ్డికి ఎంపీ సీటు కోరడానికి ఆయన ప్రధానమంత్రిని కలిశారని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు ఎంపీ అవ్వాలని ఉందని ఇటీవల కాలంలో ప్రీతి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మధ్య ఆమె బండి సంజయ్ ని కూడా కలిశారు. ఈ పరిణామాలన్నీ మల్లారెడ్డి పార్టీ మార్పును సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తన అల్లుడిని ఎమ్మెల్యేను చేశారు మల్లారెడ్డి. ఇప్పుడు కోడలు విషయంలో మల్లారెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రకారం విద్యా వ్యాపారి గానే కాకుండా.. రాజకీయంగా కూడా అంతే స్థాయిని అందిపుచ్చుకోవడానికి మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.