Sandeep Kumar Sultania: న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారుల మీద ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో తీర్పులు వెలువడుతున్నాయి. సదరు అధికారుల మీద న్యాయమూర్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాదులో హైడ్రా అనే వ్యవస్థ వల్ల ఇబ్బంది పడ్డ వారంతా రంగనాథ్ కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారు. కోర్టుకు అనేక ఆధారాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను రంగనాథ్ విస్మరించి ముందుకు వెళ్లారు. దీంతో హైకోర్టుకు తీవ్రస్థాయిలో ఆగ్రహం కలిగింది. వెంటనే రంగనాథ్ ను ఆ పోస్టు నుంచి తప్పించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇది ఒక రకంగా రేవంత్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ.
రంగనాథ్ వ్యవహారాన్ని మర్చిపోకముందే మరో ఐఏఎస్ అధికారికి తెలంగాణ హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి. ఏకంగా ఆ అధికారి ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆ అధికారికి నాన్ బెయిలబుల్ వారిని కూడా జారీ చేసింది. హైకోర్టు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.
సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ బోర్డు ఉంది. ఆ బోర్డుకు స్టాంప్ డ్యూటీ బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై ఒక వినతి పత్రాన్ని బోర్డు సమర్పించింది. దీనిపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించింది. దాదాపు 33.42 కోట్ల బకాయిలను విడుదల చేయాలని.. ఒకవేళ ఆలస్యం జరిగిన నేపథ్యంలో 12 శాతం వడ్డీ చెల్లించాలని.. ఈ ఆలస్యానికి పరిహారంగా సైనిక సంక్షేమ నిధికి ప్రతినెల 1 లక్ష రూపాయలు చెల్లించాలని హైకోర్టు సూచించింది.
తమ ఉద్దేశాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అమలు చేయలేదని రామకృష్ణ అనే పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సందీప్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని.. ఆయనను శిక్షించాలని అందులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు కేసును విచారించింది. సుల్తానియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఒకవేళ అది చేయని పక్షంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని సూచించింది.. తదుపరి విచారణకు సందీప్ కుమార్ నుంచి ఎటువంటి కౌంటర్ దాఖలు కాలేదు. కోర్టుకు కూడా ఆయన నుంచి ఎవరు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహం కలిగింది. సందీప్ కుమార్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. అదే కాదు ఆయనను ఎక్కడికనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. హైడ్రా రంగనాథ్ వ్యవహారం మర్చిపోకముందే .. మరో అధికారి మీద తెలంగాణ హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సంచలనంగా మారింది.