Homeజాతీయ వార్తలుNational Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం.. ఆధునికతతో పూర్వ వైభవం!

National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం.. ఆధునికతతో పూర్వ వైభవం!

National Handloom Day: భారతీయ సంస్కృతిని ప్రపంచం గుర్తించినవాటిలో యోగా, ఆయుర్వేదంతోపాటు చేనేత కూడా ప్రత్యేక స్థానం ఉంది. వేల ఏళ్ల చరిత్రను మోసుకుని వచ్చిన ఈ కళ ఇప్పటికీ తన విలక్షణతను కాపాడుకుంటూ అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరమైన ముద్ర వేస్తోంది. సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్లను కలిపి కొత్త తరాన్ని ఆకర్షిస్తోంది. వారసత్వాన్ని గౌరవిస్తూ, దేశవ్యాప్తంగా నేత కుటుంబాల కృషిని స్మరించుకునేందుకు ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. ఇది కేవలం ఒక […]

National Handloom Day: భారతీయ సంస్కృతిని ప్రపంచం గుర్తించినవాటిలో యోగా, ఆయుర్వేదంతోపాటు చేనేత కూడా ప్రత్యేక స్థానం ఉంది. వేల ఏళ్ల చరిత్రను మోసుకుని వచ్చిన ఈ కళ ఇప్పటికీ తన విలక్షణతను కాపాడుకుంటూ అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరమైన ముద్ర వేస్తోంది. సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్లను కలిపి కొత్త తరాన్ని ఆకర్షిస్తోంది. వారసత్వాన్ని గౌరవిస్తూ, దేశవ్యాప్తంగా నేత కుటుంబాల కృషిని స్మరించుకునేందుకు ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. ఇది కేవలం ఒక పరిశ్రమను గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు, స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని కూడా తెలియజేస్తుంది.

స్వదేశీ ఉద్యమం నుంచి..
1905 ఆగస్టు 7న కోల్‌కతా టౌన్‌హాల్‌లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను తిరస్కరించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ రోజు ఉద్యమం మొదలైంది. అందులో చేనేత కేంద్ర భూమిక పోషించింది. భారతీయ నేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల వినియోగం ద్వారా స్వావలంబన బలపడింది. ఈ చారిత్రక సంఘటనను గుర్తుచేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి జౌళి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక ఆధారం
చేనేత కేవలం వస్త్ర తయారీ కాదు. ఇది లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రధాన జీవనాధారం. 2019–20 జనగణన ప్రకారం దేశంలో 35.22 లక్షల మంది నేత కార్మికులు, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. వారిలో 25.46 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం కార్మికుల్లో 72 శాతం మించి మహిళలే ఉన్నారు. 28.20 లక్షల హ్యాండ్‌లూమ్‌లు ఉండగా వాటిలో సుమారు 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

ఆధునికీకరణ దిశగా..
మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది. నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కొత్త డిజైన్లు, మార్కెటింగ్‌కు సహాయం అందిస్తోంది. యార్న్‌ సప్లై స్కీమ్, రా మెటీరియల్‌ సప్లై స్కీమ్, హ్యాండ్‌లూమ్‌ మార్కెటింగ్‌ అసిస్టెన్స్, వీవర్‌ ముద్రా పథకం వంటి పథకాలు నేత కార్మికులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నాయి. 2021 నుంచి 2026 జూన్‌ వరకు 357 హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. 200 హ్యాండ్‌లూమ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీలు స్థాపించబడ్డాయి. ఆధునిక వర్క్‌షెడ్లు, ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌ యంత్రాల వినియోగంతో ఉత్పత్తి సామర్థ్యం 53 శాతం పెరిగింది. నెలవారీ సగటు ఆదాయం రూ.9,600 నుంచి రూ.15 వేలకు పెరిగింది.

ప్రపంచ మార్కెట్‌లో గుర్తింపు..
ఒకప్పుడు స్థానిక మార్కెట్‌కే పరిమితమైన చేనేత ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్‌ రంగంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2025–26లో ఎగుమతుల విలువ రూ.1,330.96 కోట్లకు చేరింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, ఫ్రాన్స్, యునైటెడ్‌ కింగ్‌డమ్, స్పెయిన్‌ వంటి దేశాలు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. వినియోగదారుల్లో నమ్మకం పెంచేందుకు హ్యాండ్‌లూమ్‌ మార్క్, ఇండియా హ్యాండ్‌లూమ్‌ బ్రాండ్, జీఐ ట్యాగ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే 106 చేనేత ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది.

ప్రాంతీయ వైవిధ్యం..
ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకమైన చేనేత సంప్రదాయం ఉంది. ఉత్తరప్రదేశ్‌ బనారసీ సిల్క్, తమిళనాడు కాంచీపురం పట్టు, తెలంగాణ పోచంపల్లి ఇకత్, ఒడిశా సంబల్‌పురి ఇకత్, అస్సాం ముగా సిల్క్, కేరళ కసవు, మహారాష్ట్ర పైఠాణీ, మధ్యప్రదేశ్‌ చందేరి, పశ్చిమ బెంగాల్‌ జామ్‌దాని వంటివి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇవి కేవలం వస్త్రాలు కావు. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకలు.

సాంకేతికతతో కొత్త అవకాశాలు
యువతను ఈ రంగం వైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది. హ్యాండ్‌లూమ్‌ హ్యాకథాన్‌–2026 ద్వారా విద్యార్థులు, స్టార్టప్‌లు, డిజైనర్లు, పరిశోధకులు కలిసి కొత్త డిజైన్లు, డిజిటల్‌ మార్కెటింగ్, సుస్థిర ఉత్పత్తి పద్ధతులపై ఆవిష్కరణలు చేస్తున్నారు. విశ్వసూత్ర, భారత్‌ టెక్స్, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వంటి వేదికలపై భారత చేనేతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

చేనేత వస్త్రం కొనడం అంటే ఒక వస్త్రాన్ని సంపాదించడం మాత్రమే కాదు.. ఒక నేత కుటుంబానికి ఉపాధి కల్పించడం, సంప్రదాయాన్ని కాపాడటం, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించడం కూడా. తక్కువ విద్యుత్, సహజ పదార్థాలతో తయారయ్యే ఈ వస్త్రాలు సుస్థిర అభివృద్ధికి దోహదపడతాయి. అందుకే వోకల్‌ ఫర్‌ లోకల్‌ ఉద్యమంలో చేనేతకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం భారతీయ సంప్రదాయం, స్వదేశీ స్ఫూర్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, లక్షలాది నేత కుటుంబాల జీవితాలను ప్రతిబింబించే వేడుక.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper