Jayesh Ranjan: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఓలో ప్రియాంక వర్గీస్, స్మిత సబర్వాల్ కీలక అధికారులుగా ఉండేవారు. వారితోపాటు జయేష్ రంజన్ కూడా ఉండేవాడు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా.. అప్పట్లో ఐటీ కార్యకలాపాలను పర్యవేక్షించిన అధికారిగా జయేష్ సుపరిచితుడు. నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా.. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు.
భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత కొద్ది రోజులపాటు రంజన్ ఐటీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల సదస్సు కోసం వెళ్ళినప్పుడు రంజన్ కూడా ఆయన వెంట ఉన్నారు. అయితేనాడు కుదుర్చుకున్న ఎం ఓ యు వ్యవహారాలలో లోపాలు ఉన్నాయని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఆ ఆరోపణలు తగ్గట్టుగానే ప్రభుత్వ వ్యవహార శైలి ఉండడం ఆందోళన కలిగించింది. చివరికి రంజన్ సెల్ఫీ వీడియో తీసి.. తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ ఉదంతం రంజన్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగ్రహాన్ని కలిగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గ్లోబల్ సమ్మిట్ విఫలం కావడంతో రంజన్ వ్యవహార శైలి పై మరోసారి చర్చ జరిగింది. గ్లోబల్ సమ్మిట్ జరిగేటప్పుడు కీలక సమాచారం భారత రాష్ట్ర సమితి చేతుల్లోకి వెళ్ళింది. దీంతో అప్పుడే ప్రభుత్వం అప్రమత్తమయింది. వెంటనే లోతుగా విచారణకు ఆదేశించింది. దీంతో కొంతమంది అధికారులు కావాలని ప్రభుత్వ సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీకి అందిస్తున్నారని అందులో తేలింది. ఇక అప్పటినుంచి జయేష్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అతడిని ఐటీ విభాగం నుంచి దూరం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు సీఎం ఓ నుంచి కూడా పక్కనపెట్టింది. ఆయనకు క్రీడా శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది.
గతంలో జయేష్ కేటీఆర్ కు దగ్గరగా ఉండటంవల్ల.. కీలకమైన విషయాలు ఆయన ద్వారా ప్రతిపక్ష పార్టీకి తెలుస్తున్నాయని ప్రభుత్వానికి సమాచారం ఉండడం వల్ల.. రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ కు స్థానచలనం తప్పదని ప్రచారం జరిగింది. అయితే రేవంత్ ప్రభుత్వం కొద్దిరోజులపాటు అతడినే అదే శాఖలో కొనసాగించింది. చివరికి ప్రభుత్వం నుంచి కీలక సమాచారం బయటకు పోతున్న క్రమంలో.. ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. తన వేగుల ద్వారా సమాచారం తెప్పించుకుని.. సరైన సమయంలో.. సరైన విధంగా వేటు వేశారు. పైకి క్రీడాభివృద్ధి అని చెబుతున్నప్పటికీ .. అసలు అంతరార్థం వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి సీఎంఓ నుంచి జయష్ ను పంపించడం ద్వారా పూర్తిగా ప్రక్షాళన చేసామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ వచ్చిన తర్వాత ప్రియాంక, స్మిత.. ఇప్పుడు జయేష్ సీఎం ఓ నుంచి బయటికి వెళ్లిపోయారు. స్మిత అనారోగ్యం వల్ల లాంగ్ లీవ్ లో ఉన్నారు.
