Telangana Emergency Number : రోడ్డుమీద వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగినా.. ఏదైనా గొడవ జరుగుతున్నా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించడానికి ఇప్పటి వరకు డయల్ 100 ఉండేది. కానీ తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డయల్ 100 స్థానంలో ఇకపై ఒకే ఒక్క ఎమర్జెన్సీ నంబర్ 112 ఉంటుందని తెలిపింది. ఈ నెంబర్ డయల్ చేస్తే ఎటువంటి సేవలు అందుతాయో చూద్దాం..
అత్యవసర సేవలతో పాటు కొన్ని డిపార్ట్ మెంట్ వైజ్ గా ప్రత్యేక నెంబర్లను కేటాయించారు. ఇందులో భాగంగా పోలీసులను సంప్రదించాలంటే 100, అగ్నిమాపక సేవల కోసం 101, అంబులెన్స్ కావాలనుకున్నవారు 108 వంటినెంబర్లకు డయల్ చేస్తే సత్వర సేవలు అందించేవి. కానీ ఇప్పుడు ఈ మూడు పరిస్థితులు ఎదురైనా 112 నెంబర్ డయల్ చేస్తే చాలు అని తెలుపుతున్నారు. ఈ నెంబర్ కు డయల్ చేయగానే.. అక్కడి నుంచి సంబంధిత శాఖకు సమాచారం చేరి వెంటనే సహాయక బృందాలను పంపేలా వ్యవస్థను రూపొందించారు.
రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దాడులు, మహిళలపై వేధింపులు, అగ్నిప్రమాదాలు, వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, అనుమానాస్పద సంఘటనలు లేదా తక్షణ పోలీసు సహాయం అవసరమైన సందర్భాల్లో 112కు కాల్ చేయవచ్చు. ఒకే కాల్‌తో అవసరమైన సేవలను సమన్వయం చేసి అందించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నెంబర్ ద్వారా సాంకేతికంగా కూడా భారీ మార్పులు చేశారు. ఇప్పుడు ఒకేసారి 960 కాల్స్‌ను స్వీకరించేలా కాల్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో విపత్తులు లేదా భారీ ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా కాల్స్ బిజీ అయ్యే అవకాశాలు తగ్గనున్నాయి. 112 కంట్రోల్ సెంటర్‌కు కాల్ వచ్చిన వెంటనే సంఘటన జరిగిన ప్రాంతాన్ని గుర్తించి, సమీపంలోని పోలీస్ ప్యాట్రోలింగ్ వాహనం, అంబులెన్స్ లేదా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం పంపిస్తారు. దీంతో అత్యవసర సేవలు గతంతో పోలిస్తే మరింత వేగంగా బాధితులకు చేరుకునే అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ ప్రతి కుటుంబం తమ మొబైల్ ఫోన్‌లో 112 నంబర్‌ను తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని సూచించారు. ఇంట్లోని పిల్లలు, మహిళలు, వృద్ధులకు కూడా ఈ నంబర్ గురించి తెలియజేయాలని కోరారు. అత్యవసర సమయంలో ఆలస్యం చేయకుండా ఈ నంబర్‌కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని చెప్పారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. సరదాగా లేదా తప్పుడు సమాచారం ఇచ్చి కాల్స్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్నారు.