HYDRA Ranganath : నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటినుంచి ఒకటే చర్చ. హైడ్రా అధిపతిగా రంగనాథ్ ను తొలగిస్తారా.. రేవంత్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తారా.. తదుపరి జరిగే పరిణామాలు ఏంటి.. ఒకవేళ రంగనాథ్ ను తప్పిస్తే.. ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారు.. హైదరాబాదు నగరంలో అక్రమాలకు ఏ విధంగా చెక్ పెడతారు.. ఇవే ప్రశ్నలు మీడియా నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు వ్యక్తమవుతున్నాయి.
ఈ చర్చ రకరకాలుగా సాగుతున్న నేపథ్యంలో.. మొత్తానికి హైడ్రా రంగనాథ్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి తన మనోగతాన్ని విలేకరులతో వెల్లడించారు.. ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే..
హైకోర్టు సూచనలను.. ఆదేశాలను అతిక్రమించిన వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ జరిమానా కూడా విధించే అధికారం ఉంటుంది. రాజ్యాంగ నిబంధన 215 ప్రకారం.. కోర్టు ధిక్కరణ చట్టం 1971లోని సెక్షన్ 12 (1) ప్రకారం కోర్టు నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ఇక ఇండియన్ పోలీస్ సర్వీస్ పరిధిలో పనిచేసే అధికారిని బదిలీ లేదా ఉద్యోగాల నుంచి తొలగించడం అనేది ఆర్టికల్ 311(1) ప్రకారం అది పూర్తిగా కార్యనిర్వాహక పరిధిలో ఉంటుంది. ఐపీఎస్ అధికారిని కోర్టు ట్రాన్స్ ఫర్ చేయాలని ఓపెన్ గా ఆదేశించలేదు. కాకపోతే ఈ విషయాన్ని ప్రభుత్వానికి నేరుగా చెప్పే అవకాశం ఉంటుంది.
తెలంగాణ హైకోర్టు రంగనాథ్ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆయనను హైడ్రా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో మరో ఐజి స్థాయి అధికారిని విధుల్లోకి తీసుకోవాలని సూచించింది.
హైడ్రా అధినేత వ్యవహారం నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్, ఆల్ఫ్రెడ్ అనే కేసును ఒకసారి పరిశీలిస్తే.. నాడు కార్య నిర్వాహక వ్యవస్థ తీసుకునే నిర్ణయాలను.. కోర్టులు నేరుగా తీసుకున్నాయి. దీనివల్ల అధికారాల పరిధి సిద్ధాంతం పూర్తిగా మారిపోయింది. ఇది సరైన విధానం కాదని న్యాయ నిపుణులు అప్పట్లోనే చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థకు న్యాయ స్థానాలు సూచనలు మాత్రమే చేయగలవు. సిఫారసులు మాత్రమే సూచించగలవు. ఒకవేళ పదేపదే తమ ఆదేశాలను అధికారులు గనుక అతిక్రమిస్తుంటే.. కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. జరిమానా లేదా జైలు శిక్ష లేదా బదిలీ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం కోర్టులకు ఉంటుంది. ఒక అధికారికి బదిలీ ఆదేశాలు జారీ చేసే విషయంలో.. న్యాయస్థానాలు కచ్చితంగా ఆదేశ సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఆ సూత్రాల ఆధారంగానే న్యాయస్థానాలు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
రంగనాథ్ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకుండా ఉండే అధికారం కూడా ఉంటుంది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టు దాకా వెళ్లే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. స్టే తెచ్చుకొని.. రంగనాథ్ ద్వారా హైడ్రా వ్యవహారాలను సాగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. రేవంత్ వ్యాఖ్యల ప్రకారం ప్రభుత్వం న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇక్కడ న్యాయ స్థానాన్ని తమ గౌరవిస్తామని రేవంత్ చెప్పారు. అందువల్లే స్టే తెచ్చుకొని.. ఇతర న్యాయపరమైన అవకాశాల వైపు రేవంత్ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏ కోణంలో కూడా రంగనాథ్ ను రేవంత్ వదులుకునే విధంగా కనిపించడం లేదు.