Etela Rajender political future: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి.. గులాబీ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన ఈటెల రాజేందర్ అనివార్య పరిస్థితుల్లో అత్యంత అవమానకరంగా కారు పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత కమలం పార్టీలో చేరారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయారు. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.
కమలం పార్టీలో ఉంటున్నప్పటికీ ఈటల రాజేందర్ కు సముచితమైన స్థానం లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేందర్ గులాబీ గూటికి వెళ్తారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని మొన్నటిదాకా ప్రచార జరిగినప్పటికీ.. అలాంటి అవకాశం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. పురపాలక ఎన్నికల్లో ఆయన కేవలం మల్కాజి గిరి స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. కరీంనగర్ లో జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే ఆయనకు అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది. స్టార్ క్యాంపెనర్ గా ఆయనకు అవకాశం కల్పించినప్పటికీ.. ఎక్కడికక్కడ బంధనాలు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని కాపాడుకోలేదనే భావన రాజేందర్ లో ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో హుజురాబాద్లో పట్టు కోసం రాజేందర్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఈటల వర్సెస్ బండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ఈటల రాజేందర్ కు మధ్య ఉప్పు నిప్పు లాగా వ్యవహారం సాగుతోందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య బండి సంజయ్.. ఈటల రాజేందర్ పరోక్షంగా విమర్శలు కూడా చేసుకున్నారు. రాజేందర్ అయితే తన స్వరాన్ని పెంచి పేరు చెప్పకుండా బండి సంజయ్ వర్గం మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు మొత్తం ఈటెల రాజేందర్ వర్గీయులలో అంతర్మథనానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీలో ప్రాధాన్యం లేనప్పుడు.. గుర్తింపు ఇచ్చే పార్టీలోకి వెళ్లాలని ఈటెల రాజేందర్ మీద ఆయన అనుచరులు తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఈటెల రాజేందర్ కు గులాబీ పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఈటల రాజేందర్ మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: తిండి లేదు..నీరు ఇవ్వలేదు.. బాల్క సుమన్ ను జైల్లో టార్చర్ పెట్టారా?
గతంలో బిజెపిలో చేరికల కమిటీ చైర్మన్ గా రాజేందర్ పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎంపిగా కూడా గెలిచారు. కానీ ఆయనకు కేంద్ర కేబినెట్లో చోటు లభించలేదు. దీనికి తోడు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఆశించారు. అది కూడా ఆయనకు దక్కలేదు. రామచంద్రరావుకు బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం రాజేందర్ లో అసహనాన్ని కలిగించిందని ఆయన వర్గీయులు చెబుతుంటారు. తన ఆవేదనను అమిత్ షా వంటి నేతలతో చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రాజేందర్ అనేక సందర్భాలలో తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది.
ఇటీవల స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడా రాజేందర్ ను మనస్థాపానికి గురి చేసినట్టు సమాచారం. స్థానిక ఎన్నికల తర్వాత పార్టీలో రాజేందర్ అంత వ్యూహాత్మకంగా కనిపించడం లేదు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిన రాజేందర్.. ఇప్పుడు కేవలం మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి పరిమితం కావడానికి ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం కావాలని ఇలా చేసిందా? వేరే వ్యక్తుల ఒత్తిడి వల్ల ఇలా చేస్తోందా? అనే ప్రశ్నలు కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని రాజేందర్ ను పార్టీ అధిష్టానం ఆదేశించడం మింగుడు పడని విధంగా ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గీయులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా రాజేందర్ ను మనస్థాపానికి గురి చేసినట్టు తెలుస్తోంది. స్టార్ క్యాంపెనర్ గా రాజేందర్ ను పేర్కొన్నప్పటికీ.. కరీంనగర్ జిల్లాలో వేలు పెట్టకూడదని చెప్పడం ఒకరకంగా ఆయన వేగానికి స్పీడ్ బ్రేకర్ వేయడం లాంటిదేనని కార్యకర్తలు అంటున్నారు. అధిష్టానం వైఖరితో రాజేందర్ సీరియస్ గా ఉన్నారని.. త్వరలోనే ఆయన వేరే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో వారంతా కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. దీనికి తోడు ఆ మధ్య సోషల్ మీడియాలో రాజేందర్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే హుజరాబాద్ అసెంబ్లీ స్థానం ఉంటుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజేందర్ అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ప్రత్యేకమైన వర్గం కూడా ఉంది. బిజెపిలో రాజేందర్ చేరినప్పుడు వారు కూడా కాషాయం కండువా కప్పుకున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన బండి సంజయ్ ప్రస్తుతం ఇక్కడ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ ఉండేది. ఇప్పుడు ఆ గ్యాప్ మరింత పెరిగింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరచడానికి అనేకమంది నేతలు ప్రయత్నించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు.
Also Read: ప్రభుత్వ కార్యాలయాల్లో 25వేల మంది దొంగలు పడ్డారు..!
ఆమధ్య ఈటెల రాజేందర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు హైదరాబాదులోని షామీర్పేట ప్రాంతంలో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. వారందరికీ అండగా ఉంటానని బండి సంజయ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులకే గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తన వర్గీయులను రాజేందర్ రంగంలోకి దింపారు. కొన్ని పంచాయతీలలో రెబల్ అభ్యర్థులుగా కూడా పోటీలో ఉంచారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను హుజరాబాద్ నియోజకవర్గం లోకి ప్రవేశించకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం అడ్డుకున్నట్టు ప్రచారంలో ఉంది. ఈ పరిణామం రాజేందర్ ను ఇబ్బందికి గురి చేసిందని.. పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మల్కాజి గిరి పార్లమెంటు స్థానానికే రాజేందర్ పరిమితమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజేందర్ మీద తీవ్రస్థాయిలో పోస్టులు కనిపిస్తున్నాయి. వాటిపై ఆయన స్పందించారు. అవన్నీ కూడా పిచ్చోళ్ళు పెట్టే పోస్టులని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక అప్పట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పీ ఆర్ ఓ ను ఉద్దేశించి రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు తాను ఏ పార్టీలో ఉన్నాననే విషయం ప్రజలు తేల్చుకుంటారని రాజేందర్ అన్నారు. సోషల్ మీడియా పోస్టులు ఆధారంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని రాజేందర్ పేర్కొన్నారు. అయితే ఆయనకు గులాబీ పార్టీ నుంచి ఆహ్వానం లభించిందని.. త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.