Telangana municipal elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక సమస్యలు, అంశాలే కీలకం అవుతాయి. స్థానిక ఎజెండా ఆధారంగానే అభ్యర్థులు పోటీ చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను రాష్ట్రలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కాకుండా రాష్ట్ర అంశాలతో రాజకీయం చేస్తున్నారు. స్థానిక అంశాలకు మించి కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కేసు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఆయుధంగా మారింది. అరెస్టును బీజేపీ అడ్డుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. రేవంతే అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.ఇది ఓటర్లలో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను పెంచే వ్యూహంగా ఉంది.
రేవంత్ డబుల్ గేమ్..
బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, బీఆర్‌ఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా అరెస్టు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసు, ఫోన్ ట్యాపంగ్ కేసులో కూడా కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నా రేవంత్ కావాలనే చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
కేంద్రంపై రేవంత్ ఆరోపణ..
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని, ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే కేసీఆర్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ మొదటి నుంచి బీజేపీకి మద్దుతు ఇస్తోందని, దానికి కృతజ్ఞతగానే కేసీఆర్ అరెస్టు చేయడం లేదని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.
రాజకీయ పర్యావసానాలే కీలకం..
కేంద్రమైనా, రాష్ట్రమైనీ ముఖ్య నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులను అరెస్టు విషయంలో జాప్యం చేయడానికి కారణం.. పర్యవసానాలే. అరెస్టు తర్వాత ఏం జరుగుతుందని ఆలోచిస్తాయి. ఈ విషయం సీఎంకు తెలియంది కాదు. అలాగే సీబీఐతో సోనియా, రాజీవ్ గాంధీపై విచారణ చేపట్టిన సీబీఐ అరెస్టు విషయంలో మాత్రం వెనుకాడుతోంది. అంటే కేంద్రం కూడా అరెస్టులకు తొందరపడడం లేదు.
అస్మదీయులు అంటూ ప్రచారం..
కాంగ్రెస్ బీఆర్‌ఎస్–బీజేపీ ఒక్కటే అని ఆరోపిస్తోంది. ఇక బీజేపీ కాంగ్రెస్–బీఆర్‌ఎస్ ఒక్కటే అంటోంది. ఇందులో అస్మదీయులు ఎవరు అన్నది తేల్చడం లేదు. బీజేపీ మాత్రం ఇష్యూలను లైవ్‌గా ఉంచి పరిష్కారం మానేస్తోంది. కర్ర విరగొద్దు.. పాము చావాలి అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
మొత్తానికి అరెస్ట్ రాజకీయాలతో అన్ని పార్టీలు స్థానిక సమస్యలను గాలికి వదిలేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు స్వార్థ రాజకీయాలే చేస్తున్నాయి.