TVK MLA Arrest:ద్రావిడ వాదం లేకుండా.. సంప్రదాయ రాజకీయాలతో సంబంధం లేకుండా టీవీ కే విజయ్ తమిళనాడులో అధికారంలోకి రావడమే ఒక సంచలనం. అటువంటి తమిళనాట అధికారాన్ని ఒడిసి పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. అది విజయ్ కి అనుభవంలోకి వస్తోంది.
అసలు విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు అనేక రకాలుగా సంచలనాలుఈ చోటుచేసుకున్నాయి. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం.. మద్దతు ఇవ్వడానికి కమ్యూనిస్టులు.. ఇతర పార్టీలు దోబూచులాట ఆడటం.. ఇవన్నీ కూడా తమిళనాడులో రోజుకో తీరుగా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి వేశాయి. చివరికి అనేక రకాల ప్రయత్నాల తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దిరోజులు పరిపాలన సాగింది. ఆ తర్వాత వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజులు భార్యతో విడాకుల వ్యవహారం.. ఆ తర్వాత మంత్రుల అవినీతి.. ఎమ్మెల్యేల వ్యవహార శైలి.. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. పెట్టుబడుల విషయంలో కంపెనీలను ఒప్పించలేకపోవడం.. కంపెనీలు ఇతర రాష్ట్రాల వైపు వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తాజాగా టీవీ కే ఎమ్మెల్యే అరుల్ విగ్నేష్ ఏకంగా ఒక మహిళా కలెక్టర్ కు అసభ్యకరమైన సందేశాలు పంపించారు. అనచితంగా ప్రవర్తించారు. మద్యం తాగి ఆమె అధికారిక నివాసానికి కూడా వెళ్లారు. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత కూడా విజయ్ సరైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిపోయింది. చివరికి ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడం.. అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కోవడంతో విజయ్ వెనక్కి తగ్గక తప్పలేదు. తన ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సి వచ్చింది. . మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత విజయ్ తన ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు. దీనిని బట్టి ఆయన వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ ప్రభుత్వానికి ఒక దిశ అనేది లేకుండా సాగిపోతోంది. కనీసం పెట్టుబడులను ఆకర్షించడంలో.. కంపెనీలను పెట్టుబడులు పెట్టించే విధంగా ప్రోత్సహించడంలో విజయ్ ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. కనీసం అధికారులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కూడా విజయ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పోతోంది. నలుగురు మంత్రులు తప్ప మిగతా వారంతా విజయ్ ప్రభుత్వంలో కొత్తవారే. వారంతా కూడా ఏదో ఒక రూపంలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.. అసలే పొత్తులతో విజయ్ తన ప్రభుత్వం నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ తరహా ఘటనలు జరగడం విజయ్ ప్రభుత్వ మనుగడకే ముప్పుగా పరిణమించబోతున్నాయి.