Gold Rates Today:బంగారం ధర తగ్గింది.. దేశంలో ఎన్ని కోట్ల వ్యాపారం? పెళ్లిళ్ల సీజన్ తో జ్యూవెలరీ షాప్ లకు భారీ లాభాలేనా..
Gold Rates Today: బంగారం ధరలు తగ్గుతున్నాయి.. ఈ తగ్గుదల వల్ల కేవలం నగలు కొనుగోలు చేసే వారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందా.. వాస్తవానికి బంగారం ధర తగ్గుదల కేవలం ఈ అంశం ఆధారంగా మాత్రమే కాకుండా.. మిగతా వాటి పరిధిలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది.. బంగారం ధర తగ్గడం వల్ల దీని ప్రభావం దేశంలో అన్ని రంగాల మీద ఉంటుంది. ముఖ్యంగా నగల వ్యాపారం.. బంగారం దిగుమతులు.. ఆభరణాల తయారీ.. రిటైల్ మార్కెట్ వంటి రంగాలలో సరికొత్త కొనుగోలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు మళ్లీ నగల దుకాణాల వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వివాహాల సీజన్ కూడా మొదలు కావడంతో ఈసారి బంగారం వ్యాపారం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక దశలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1.80 లక్షల స్థాయిని చేరుకుంది. దీంతో సామాన్య.. మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేశాయి. వివాహల కోసం నగలు కొనాల్సిన వారు కూడా తమ బడ్జెట్ ను తగ్గించుకున్నారు. కొంతమంది తక్కువ బరువు ఉన్న నగల మీద ఆసక్తి చూపించారు.
ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో మార్కెట్లో మార్పు కనిపిస్తోంది. నవంబర్ 18 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1.35 లక్షలకు పడిపోయినట్టు తెలుస్తోంది. జనవరి నెలలో నమోదైన గరిష్ట ధరతో పోల్చి చూస్తే ఇది చాలావరకు తగ్గుదల. నవంబర్ 21న కూడా బంగారం.. వెండి ధరల్లో భారీగా పతనం నమోదయింది.. ధన్ తెరస్.. దీపావళి సమయంలో బంగారం కొనుగోలు గత ఏడాదితో పోల్చి చూస్తే పరిమాణం పరంగా 30% పెరిగినట్టు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ రెండు సందర్భాలలో దేశవ్యాప్తంగా సుమారు 52 టన్నుల బంగారం కొనుగోలు జరిగాయి. వీటి విలువ దాదాపు 72 వేల కోట్లు.
బంగారం ధర తగ్గితే ముఖ్యంగా ఐదు రంగాలకు ప్రయోజనం లభిస్తుంది. కొనుగోలుదారుల రాక పెరిగితే నగల అమ్మకాలు మెరుగుపడతాయి. దీంతో చిన్న.. పెద్ద నగల దుకాణాలకు వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్డర్లు పెరిగితే బంగారు నగలు తయారు చేసే కార్మికులకు.. డిజైనర్లకు పని పెరుగుతుంది. నగల దుకాణాలకు కొత్త ఆర్డర్ ఇవ్వడంతో బులియన్ వ్యాపారంలో లావాదేవీలు పెరుగుతాయి. బంగారం సరఫరా.. ప్యాకేజింగ్.. సెక్యూరిటీ.. రిటైల్ సేవలకు డిమాండ్ పెరుగుతుంది. నగల తయారీ కేంద్రాలు.. షో రూమ్లలో అమ్మకాలు పెరిగితే అదనపు సిబ్బంది అవసరం ఏర్పడుతుంది.
బంగారం ధరలు తగిన నేపథ్యంలో కొనుగోలుదారులు మళ్ళీ దుకాణాలకు వస్తున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో చాందిని చౌక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ జువెలరీ వ్యాపారి తన వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే దాదాపు 25% పెరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్.. జనవరి నెలలో జరిగే పెళ్లిళ్ల కోసం కొనుగోలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అయితే కస్టమర్లు భారీ ఆభరణాల కంటే తక్కువ బరువు ఉన్న నగల మీద ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధరలు తగ్గడం వల్ల కొనుగోళ్ల పరిమాణం పెరిగితే మన దేశ రిటైల్ మార్కెట్లో లావాదేవీలు ఎక్కువవుతాయి. పండుగలు.. వివాహల సమయంలో నగల కొనుగోలు పెరగడం వ్యాపార కార్యకలాపాలకు ఊతం ఇస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నవంబర్ 17న విడుదల చేసిన నివేదిక ప్రకారం ధరలు తగ్గడం.. వివాహాల సీజన్ కొనసాగడం వల్ల వచ్చే రోజుల్లో మనదేశంలో ఆభరణాల కొనుగోళ్లకు సపోర్టు లభించే అవకాశం ఉంది. బంగారం ధరల తగ్గుదల కస్టమర్లకు ఊరట ఇవ్వడంతో పాటు దేశంలోని బంగారం వ్యాపారానికి కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. వివాహాల సమయంలో ఈ డిమాండ్ మరింత పెరిగితే ఆభరణాల తయారీ నుంచి రిటైల్ అమ్మకాల వరకు అనేక రంగాలలో వ్యాపార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ధరలు పెరిగితే ఈ ఉత్సాహం ఎంత కాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది.