GTA 6 : వీడియో గేమింగ్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA 6) ఎట్టకేలకు గేమర్ల ముందుకు వచ్చింది. దాదాపు దశాబ్ద కాలంగా భారీ అంచనాలను మోస్తున్న ఈ గేమ్.. కేవలం గ్రాఫిక్స్, యాక్షన్, గ్యాంగ్‌వార్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూడటం లేదు. అంతకుమించి ఒక కొత్త ప్రపంచంలో నిజంగా జీవిస్తున్నామనే అనుభూతిని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గతంలో వచ్చిన రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 (RDR 2)లోని అత్యుత్తమ అంశాలను మరింత మెరుగుపరిచి GTA 6లో అందించడం విశేషం.
యాక్షన్ కంటే జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం!
సాధారణంగా GTA గేమ్ అనగానే వేగవంతమైన కార్లు, పోలీసుల ఛేజింగ్‌లు, కాల్పులు, నేర ప్రపంచం గుర్తుకొస్తాయి. కానీ GTA 6 ప్రారంభం నుంచే ఈ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఆటగాళ్లు ప్రతిక్షణం ఏదో ఒక మిషన్ పూర్తి చేయాలనే తొందరలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా సముద్ర తీరంలో గడపడం, ఇంట్లో టీవీ చూడటం, స్నేహితులతో సరదాగా మాట్లాడటం, వంట చేసుకోవడం వంటి చిన్న చిన్న అనుభవాలకూ ప్రాధాన్యం ఇచ్చింది.
గేమ్ తొలి అధ్యాయంలో జేసన్ అనే ప్రధాన పాత్రతో కీ లెంటో అనే చిన్న సముద్ర తీర పట్టణంలోకి అడుగుపెడతారు. అక్కడ అతడి రోజువారీ జీవితం గేమర్లకు కొత్త అనుభూతిని అందిస్తుంది. బాస్ బ్రయాన్ కోసం చిన్న పనులు చేయడం, స్నేహితుడు కాల్‌తో సరదాగా గడపడం వంటి అంశాలతో కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది.
సేఫ్‌హౌస్ అంటే ఇక కేవలం నిద్రించే చోటు కాదు!
GTA 6లో రాక్‌స్టార్ గేమ్స్ తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో సేఫ్‌హౌస్ ఒకటి. గత గేమ్‌లలో సేఫ్‌హౌస్ అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడానికి, గేమ్‌ను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రదేశం మాత్రమే. కానీ ఇప్పుడు అది నిజమైన ఇల్లులా మారిపోయింది.
జేసన్ ఇంట్లో సోఫాలో కూర్చోవచ్చు. టీవీ చూడొచ్చు. మ్యాగజైన్లు చదవొచ్చు. సంగీతం వినొచ్చు. ఇంటి డెక్‌పై ఉన్న జిమ్‌లో వ్యాయామం చేయొచ్చు. కాఫీ తాగడం, ప్రోటీన్ బార్ తినడం, ఫ్రిజ్‌లో సరుకులు నిల్వ చేసుకోవడానికి షాపింగ్‌కు వెళ్లడం వంటి పనులు చేయవచ్చు. అంతేకాదు.. స్నానం చేయడం, హెయిర్‌స్టైల్ మార్చుకోవడం, దుస్తులు ఎంచుకోవడం కూడా సాధ్యమే. బయట బాస్కెట్‌బాల్ ఆడటం, బోటింగ్, ఫిషింగ్, కయాకింగ్ వంటి కార్యకలాపాలూ అందుబాటులో ఉన్నాయి.
ఈ మార్పులకు రెడ్ డెడ్ రిడెంప్షన్ 2లోని క్యాంప్, క్యారెక్టర్ లైఫ్‌స్టైల్ అంశాలే ప్రధాన ప్రేరణగా కనిపిస్తున్నాయి.
మిషన్లలోనూ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ!
GTA 6లో మరో ఆసక్తికరమైన పరిణామం మిషన్ల రూపకల్పన. గతంలో రాక్‌స్టార్ గేమ్స్ ఓపెన్ వరల్డ్‌లో ఎంతో స్వేచ్ఛ ఇచ్చినా.. మిషన్ల విషయంలో మాత్రం నిర్దిష్ట మార్గంలోనే ముందుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ కొత్త గేమ్‌లో పరిస్థితులు మారాయి.
ఒక డ్రగ్ స్థావరంలోకి చొరబడి పరిచయస్తుడిని రక్షించే మిషన్‌లో నేరుగా తుపాకులతో దాడి చేయవచ్చు. లేదంటే శత్రువులకు కనిపించకుండా రహస్యంగా వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఆటగాళ్లు ఎంచుకునే మార్గాన్ని బట్టి వారి క్రిమినల్ ప్రొఫైల్ కూడా మారుతుంది. ఎక్కువ హింసకు పాల్పడితే దూకుడైన నేరస్థుడిగా, హింసను తగ్గించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ప్రొఫెషనల్ నేరస్థుడిగా గుర్తింపు లభిస్తుంది. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో కథలోని పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
NPCలతోనూ కొత్త ప్రపంచం.. ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేకత!
గేమ్‌లో కనిపించే సాధారణ పాత్రలు (NPCలు) కూడా ఈసారి మరింత సహజంగా ప్రవర్తించేలా రూపొందించారు. వారి శరీరాకృతి, వ్యక్తిత్వం, మాటతీరు, స్పందనలు విభిన్నంగా ఉంటాయి. ఎవరితోనైనా మాట్లాడేందుకు ప్రత్యేకంగా మిషన్ మార్కర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. నేరుగా వారి వద్దకు వెళ్లి సంభాషణ ప్రారంభించవచ్చు.
ఈ సంభాషణలు కొత్త పనులకు దారితీయొచ్చు. సరదా సంఘటనలు ఎదురుకావచ్చు. కొన్నిసార్లు గొడవలకూ దారి తీయవచ్చు. అంతేకాదు.. ఆటగాళ్లు ఇబ్బంది పెడితే NPCలు కూడా ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. అంటే GTA 5లో మాదిరిగా ప్రతి సాధారణ పాత్రను సులభంగా అధిగమించగల పరిస్థితి ఉండదు.
డ్రైవింగ్, వెపన్స్ విషయంలోనూ మార్పులు
వాహనాల నడక, ప్రమాదాల సమయంలో వాటి ప్రవర్తన మరింత వాస్తవికంగా ఉండేలా మార్పులు చేశారు. ఢీకొన్నప్పుడు కార్లు బోల్తా పడటం, పల్టీలు కొట్టడం వంటి పరిణామాలు కనిపిస్తాయి. డ్రైవింగ్ అనుభూతి GTA 4లోని వాస్తవికతకు, GTA 5లోని ఆర్కేడ్ స్టైల్‌కు మధ్య సమతుల్యంగా ఉంటుంది.
వెపన్స్ విషయంలోనూ RDR 2 తరహా ఇన్వెంటరీ విధానాన్ని తీసుకొచ్చారు. ఆటగాళ్లు ఎప్పుడూ అన్ని రకాల ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లలేరు. పెద్ద తుపాకులను కారు డిక్కీలో భద్రపరచుకోవాల్సి ఉంటుంది.
గ్రాఫిక్స్ అద్భుతం.. కానీ పనితీరుపై ప్రశ్నలు!
విజువల్స్ పరంగా GTA 6 ప్రస్తుత తరం కన్సోల్‌ల సామర్థ్యాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలోని చిన్న చిన్న వస్తువుల నుంచి ప్రకృతి దృశ్యాల వరకు అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. అయితే బేస్ PS5లో 30 FPS లక్ష్యంగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఫ్రేమ్‌రేట్ 20ల మధ్యకు, అంతకంటే దిగువకు పడిపోతున్నట్లు తొలి అనుభవాలు వెల్లడిస్తున్నాయి.
GTA 6 కేవలం మరో ఓపెన్ వరల్డ్ యాక్షన్ గేమ్ కాదు. ఆటగాళ్లకు ఒక ప్రత్యామ్నాయ జీవితాన్ని అందించే ప్రయత్నం. RDR 2లో కనిపించిన సహజత్వం, పాత్రలతో అనుబంధం, రోజువారీ జీవితంలోని చిన్న చిన్న అనుభవాలను మరింత విస్తృతంగా తీసుకొచ్చింది. భారీ యాక్షన్, నేర ప్రపంచం ఒకవైపు ఉంటే.. ప్రశాంతమైన జీవితం మరోవైపు కనిపిస్తుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడమే GTA 6లో అసలైన ప్రత్యేకతగా నిలుస్తోంది.