Home Blog Page 8448

సుకుమార్, మారుతి బాటలో హరీశ్ శంకర్!


రైటర్ గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్గా మారిన కొద్దిమందిలో హరీశ్ శంకర్ ఒకడు. రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడిగా పలు సినిమాలకు కో రైటర్ గా పని చేసిన హరీశ్‌.. 2006లో రవిజేత ‘షాక్‌’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ మూవీని ఆర్జీవీనే నిర్మించారు. కానీ, బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. కానీ, శంకర్ టాలెంట్‌ గురించి తెలిసిన హీరో రవితేజ అతనికి మరో చాన్స్‌ ఇచ్చాడు. ఐదేళ్ల తర్వాత ‘మిరపకాయ్‌’ తీసిన హరీశ్… మాస్‌ మహారాజకు బ్లాక్‌ బాస్టర్ హిట్‌ ఇచ్చాడు. ఆ వెంటనే పవన్‌ కళ్యాణ్‌ను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టేశాడు హరీశ్‌. ‘గబ్బర్ సింగ్‌’తో ఏకంగా ఇండస్ట్రీని షేక్‌ చేసే విజయం సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ నిరాశ పరిచినా.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్‌’, ‘దువ్వాడ జగన్నాథం’తో ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే ‘గద్దలకొండ గణేష్’తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇలా హిట్‌ ట్రాక్‌లో ఉన్న శంకర్… మరోసారి పవన్‌ కళ్యాణ్‌ను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ సొంతం చేసుకున్నాడు.

‘వకీల్‌ సాబ్‌’, క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ మూవీ తర్వాత పవన్- శంకర్ కాంబో సెట్స్‌పైకి రానుంది. అందుకు కనీసం ఒకటిన్న నుంచి రెండేళ్ల టైమ్‌ పట్టేలా ఉంది. అయితే, ఈ ఖాళీ టైమ్‌లో కొత్త అవతారం ఎత్తాలని హరీశ్‌ భావిస్తున్నాడట. అతను త్వరలోనే నిర్మాతగా మారనున్నాడని సమచారం. ఓవైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మారుతి, సుకుమార్ మాదిరిగా శంకర్ కూడా కొత్త వారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గా మారుతున్నాడట. యువ నిర్మాత బన్నీ వాసుతో కలిసి ఓ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని టాక్‌. ఓ కొత్త దర్శకుడితో వీరిద్దరూ సినిమా నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని… కాయ కొట్టడమే ఆలస్యమని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దీనిపై ఏ క్షణంలో అయిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే ఆస్కారం ఉంది.

మహేష్‌తో ‘పాట’ డౌట్.. వరుణ్ తేజ్‌తో ‘ఆట’ ఫిక్స్‌!


‘సరిలేరు నీకెవ్వరూ’తో భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం వేగం పెంచాడు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశరాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ కోసం రెడీ అవుతున్నాడు. టైటిల్‌తో పాటు ఈ మూవీలో మహేష్ పస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయగా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మెడపై రూపాయి టాటూ, చెవి పోగుతో ఉన్న మహేష్‌ మాస్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ మూవీలో హీరోయిన్‌గా చిత్ర బృందం అన్వేషిస్తోంది. దీనిపై రోజుకో వార్త వస్తోంది. తొలుత కియారా అద్వానీ, పూజా హెగ్డేతో పాటు కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. కానీ, సూపర్ స్టార్ సరసన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని బాలీవుడ్‌ యువ నటి, దబాంగ్‌ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ను సంప్రదించారని తెలిసింది. ఈమె ప్రముఖ మరాఠీ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తనయ.

తాను మహేష్ మూవీకి సంతకం చేయలేదని సయీ చెప్పింది. ఈ మూవీకి తాను హీరోయిన్‌గా ఎంపికయ్యానన్న వార్తల్లో నిజం లేదంది. కానీ, ఫ్యూచర్లో ఏమైనా జరుగొచ్చు అని ట్విస్ట్‌ ఇచ్చింది. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తన పేరెంట్స్‌కు సన్నిహితురాలు అని చెప్పింది. గతంలో ‘భరత్‌ అనే నేను’లో కోసం కియారాను ఫైనల్‌ చేయడంలో నమ్రతనే కీలక పాత్ర పోషించిందట. ఈ నేపథ్యంలో సయీని కూడా ఒప్పించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. కాగా, మహేష్‌ మూవీపై క్లారిటీ ఇవ్వలేకపోయినా తాను ఓ తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్టు సయీ స్పష్టం చేసింది. ఆ సినిమా పేరు మాత్రం వెల్లడించలేదు. కానీ, వరుణ్ తేజ్‌ తర్వాతి చిత్రం ‘బాక్సర్’లో సయీనే హీరోయిన్‌ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు మూవీలో చేస్తున్నా అని సయీ చెప్పిన నేపథ్యంలో వరుణ్‌తో ఆమె ‘ఆట’ ఖాయమైందని అర్థమవుతోంది. ఇక, మహేష్‌తో ‘పాట’ గురించే క్లారిటీ రావాల్సి ఉంది.

సుశాంత్ ఆత్మహత్యకు అసలు కారకులెవరు?


నిండా 34 ఏళ్లు కూడా లేవు. నటనలో మేరునగధీరుడు.. గొప్ప ప్రతిభావంతుడు.. సీరియళ్ల నుంచి సినిమాల స్థాయికి ఎవరి అండాదండా లేకుండా కష్టపడి ఎదిగాడు. ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కానీ ఈ సినీ రాజకీయాలకు 34 ఏళ్లకే బలైపోయాడు. మరో టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ ను తలపించాడు. ఇంతకీ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడా? చేసుకునే పరిస్థితులను ఎవరైనా సృష్టించారా అన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్న ప్రశ్న. అందరూ కలిసి ఎంతో భవిష్యత్ ఉన్న గొప్ప నటుడిని అయితే చంపేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.

కెరీర్ లో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకెళ్లినప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది. అంతేకానీ అణగదొక్కాలనుకున్న వారికి బెండ్ అయిపోతే మన జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో అదే జరిగిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి..

నిజానికి సుశాంత్ తన కెరీర్ విషయంలోనే సినిమా అవకాశాలు లేక ఎక్కువగా నిరాశకు గురయ్యాడని అంటున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా అలాగే కరణ్ జోహార్‌ లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అవకాశాలు దెబ్బతీశారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సుశాంత్ పతనానికి వారే కారణమని ఆరోపిస్తున్నాయి.

మొదటగా ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా చిత్రం కోసం మొదట సుశాంత్ ను ఎంపిక చేశాడని సమాచారం. సుశాంత్ సినిమాలో పనిచేయడానికి అనుమతించమని భన్సాలీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ను సంప్రదించాడు. అయితే నిర్మాత ఆదిత్య చోప్రా సుశాంత్ ను హీరోగా నిరాకరించాడని బాలీవుడ్ మీడియా కథనాలు వేసింది. తరువాత యశ్ రాజ్ తో కాంట్రాక్టులో ఉన్న రణవీర్ తో సినిమా చేయడానికి ఆదిత్య చోప్రా అనుమతించాడు.

బెఫిక్రే అనే మరొక చిత్రం కూడా సుశాంత్ తోనే చేయవలసి ఉంది. కానీ రణ్‌వీర్‌కు ఇది కూడా ట్రాన్స్ ఫర్ అయ్యింది. శేఖర్ కపూర్ రూపొందించిన పానీ అనే సినిమాను యశ్ రాజ్ బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సుశాంత్ తో చెప్పారు. కానీ రెండేళ్ల తర్వాత ఆదిత్య చోప్రా కూడా పానీ నుండి సుశాంత్ ను తప్పించాడట.. ఇది సుశాంత్ మరియు ఆదిత్య చోప్రా మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. కరణ్ జోహార్ కూడా ఈ ఫైట్ లో తలదూర్చాడని సుశాంత్ కు వ్యతిరేకంగా ఒక సమూహం ఏర్పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

గత ఏడాది లేదా అంతకుముందు సుశాంత్ కు సినిమా అవకాశాలు దక్కకుండా బాలీవుడ్ పరిశ్రమ తొక్కేసిందని కథనాలు వెలువడ్డాయి. బాలీవుడ్ పార్టీలకు సుశాంత్ ను ఆహ్వానించకపోవడం.. పెద్ద సినిమాలు ఇవ్వకపోవడంతో సుశాంత్ కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

గత ఫిబ్రవరిలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ రాజ్ ఫిలింస్, సాజిద్ నదియడ్ వాలా, సల్మాన్ ఖాన్, బాలాజీ, కేజీఓ, దినేష్ విజయన్, భన్సాలీ, టీ సీరిస్ లు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను బహిష్కరించారని.. తిరిగి అతడు టీవీ సీరిస్ లు, షార్ట్ ఫిలింలు తీసుకోవాలని కమల్ ఖాన్ ట్వీట్ చేయడం బాలీవుడ్ లో దుమారం రేపింది. బాలీవుడ్ మొత్తం సుశాంత్ ను వెలివేసిందని.. అతడిని నిస్సహాయుడిని చేశాడని ఆయన ఆరోపించారు.

అయితే సుశాంత్ ఒక తెలివైన విద్యార్థి, ఫిజిక్స్ ఒలింపియాడ్ విజేత మరియు ఇంజనీరింగ్ ప్రవేశంలో టాపర్. అతను నటుడిగా మారడానికి ఇంజనీరింగ్ డిగ్రీని విడిచిపెట్టాడు. ఎంతో గొప్పగా నటిస్తాడు. ప్రస్తుత బాలీవుడ్ హీరోలందరిలోకి చాలా బాగా నటనా ప్రావీణ్యం ఉన్నది. కానీ బాలీవుడ్ రాజకీయాల్లో బలైపోయాడు. వారి రాజకీయాలకు కుదేలయ్యాడు. 34 ఏళ్ళ వయసులోనే అతడి నటన కలలు కల్లలయ్యాయి. ఈ రాజకీయాలకు తట్టుకోలేక లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు.

బాలీవుడ్ లో కొందరు నిర్మాతలు, దర్శకులు ముఠాగా ఏర్పడి నటుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అవకాశాలు దక్కకుండా చేస్తున్నారన్న ప్రచారం మొదలైంది. యశ్ రాజ్, భన్సాలీ, ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ వారు, కరణ్ జోహర్ లు ఒక ముఠాగా ఏర్పడి బాలీవుడ్ లో ఎవరినీ జీవించనీయడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే రెండవ అత్యధిక సినిమాలు చేసే భారతదేశంలో అగ్రశ్రేణి సినీ పరిశ్రమను అర డజను మంది బాలీవుడ్ ప్రముఖులు నియంత్రిస్తున్నారు. ప్రతిభ, నైపుణ్యం, కృషి, అంకితభావం ఉన్న ఎవరైనా సరే బాలీవుడ్ లో విజయం సాధించాలన్నా.. అవకాశాలు దక్కించుకోవాలన్నా వీరి దయాదాక్షిణ్యాలపైనే బతకాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. నిర్దిష్ట వంశానికి, మతానికి చెందినవారే వీరికి కావాలి. కొన్ని ఇంటిపేర్లు కలిగి ఉండాలి అప్పుడే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు. లేదంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా బయటికి గెంటేస్తారు.

బాలీవుడ్ నిర్మాత కరోన్ జోహర్ ‘కాఫీ విత్ కరన్’లో సుశాంత్ ను ఘోరంగా అవమానించడం అప్పట్లో దుమారం రేపింది. అంతేకాదు.. సుశాంత్ తో కలిసి కరణ్ తీసిన ‘డ్రైవ్ ఆన్’ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుశాంత్ కెరీర్ ను ఈ సినిమా నాశనం చేసింది.కరణ్ అతడి కెరీర్ వాస్తవంగా చంపేశాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

అలాగే సుశాంత్ పై వ్యతిరేక ప్రచారాన్ని చేశారు. సుశాంత్ కు షార్ట్ టెంపర్, అహంకారి, పని చేయడం కష్టం అని బాలీవుడ్‌లో గాసిప్పులు వదిలారు. పుకార్లు వ్యాపింపచేశారు. అతని చివరి చిత్రం చిచోరీ సూపర్ హిట్ అయినప్పటికీ అతని చేతిలో సినిమాలు లేవు. సుశాంత్ కు దక్కే సినిమాలన్నీ రణ్ వీర్ సింగ్ కు ఇవ్వబడ్డాయి. భన్సాలీ ముఠాను ప్రసన్నం చేసుకోవడానికి తన ఇంటిపేరు రాజ్ పుత్ ను కూడా సుశాంత్ వదులుకున్నాడు. అంతేకాదు.. సుశాంత్ కు బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లేడని.. అతడి సినిమాలు చూడకపోతే ఇక తాను బాలీవుడ్ నుంచి వైదొలుగుతాడని సొంచారియా అనే వ్యక్తి కూడా చెప్పాడు.

ఇలా బాలీవుడే సుశాంత్ ను తొక్కేసింది. అందగాడు.. తెలివైనవాడు.. నటనలో చాలా స్మార్ట్ గా ఉంటాడు.అయినా బాలీవుడ్ లో పక్షపాతానికి గురయ్యాడు. ప్రతిభ ఉన్నా అతడిని చంపేశారు. 90శాతం బాలీవుడ్ సినిమాలు చెత్త. మంచి నటులు, దర్శకులను ఇలానే తొక్కేస్తే ఇలానే ఇండస్ట్రీ సంకనాకి పోతుంది. ఇప్పటికైనా బాలీవుడ్ టాలెంట్ ఉన్న వారిని గుర్తిస్తేనే ఇండస్ట్రీ నాలుగు కాలాల పాటు బతుకుతుంది. అందరికీ బతునిస్తుంది.

-ఎన్నం

కరోనా దెబ్బకు ఆస్కార్ అవార్డ్‌ వేడుక వాయిదా


ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ సినిమా రంగాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి దెబ్బకు వరల్డ్‌వైడ్‌ షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీల్లో మినహా సినిమా విడుదల నిలిచిపోయింది. డిస్నీల్యాండ్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు సైతం ఉద్యోగులను తొలగించడంతో అనేక మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ప్రాణాంతక వైరస్‌ ప్రభావం ప్రఖ్యాత హాలీవుడ్‌ సినిమా పండగ… 2021 ఆస్కార్ అవార్డుల వేడుకపై సైతం పడింది. కరోనా కారణంగా ఈ వేడుక రెండు నెలలు వాయిదా పడింది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లేదంటే మార్చి తొలి వారంలో ఆస్కార్‌ అవార్డ్స్‌ జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్‌ వేడుకలను నిర్వహించాలని అవార్డు కమిటీ ప్రకటించింది. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచ‌న విర‌మించుకోక త‌ప్పలేదు.

హాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఏడాది వరకు రిలీజ్ చేయకుండా రిలీజ్ తేదీలను వాయిదా వేసుకున్నాయి. దీంతో అవార్డుల వేడుకలను నిర్వహించే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది. రెండు నెలలు ఆలస్యంగా అంటే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 25న పుర‌స్కారాల ప్ర‌ధానం ఉంటుంద‌ని ప్రకటించింది. అంతేకాదు ఆస్కార్ అవార్డుల కోసం పోటీప‌డే చిత్రాలఅర్హత తేదీని సైతం ఫిబ్రవరి 28 వ‌ర‌కు పొడిగించింది. అనంత‌రం మార్చి 15న ఎన్ని నామినేషన్లు వచ్చాయో వెల్లడిస్తామని తెలిపింది.

ఓటీటీ చిత్రాలకు చాన్స్‌ ఇస్తారా?
ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి సినిమా నామినేట్‌ అవ్వాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్‌లో రిలీజ్‌ అయ్యుండాలి. కనీసం వారం రోజుల థియేట్రికల్‌ రన్‌ ఉంటేనే ఆ మూవీని ఆస్కార్‌ కమిటీ ఎంపికకు పరిగణిస్తారు. ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్స్‌ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆస్కార్‌కి చిత్రాలను ఎలా ఎంపిక ఎలా చేస్తారు? అనేది ప్రశ్న. అతి భారీ బడ్జెట్‌ సినిమాలు మినహాయిస్తే.. షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రాలను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. కానీ. అలాంటి చిత్రాలకు ఆస్కార్ కమిటీ అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. థియేటర్లో విడుదల కాకపోయినా ఆస్కార్‌కి ఆస్కారం ఉందని కొంతకాలం కిందట కమిటీ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత క్లారిటీ ఇచ్చింది. నిబంధనల ప్రకారం కచ్చితంగా థియేటర్‌లో విడుదలైన సినిమాలనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు వేడుక వాయిదా పడడం.. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేకపోవడంతో నిబంధనలు సడలించే ఆస్కారం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కరోనా ఎఫెక్ట్.. వీడియో కాన్ఫెరెన్స్ లో గవర్నర్ ప్రసంగం..!


ఆంద్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో దేశంలోనే తొలిసారి రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఈ సమావేశాల్లో విశేషం. గవర్నర్ ప్రసంగంలో ప్రధానాంశాల వివరాల్లోకి వెళితే…మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాము. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాము. విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాము. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుట్లున్నాము.

ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేశాము. 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కల్పించాము. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం, పారిశ్రామిక రంగంలో 5 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి నెలకొంది. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి. మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పిస్తున్నాము. దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి చెయ్యాలని లక్ష్యం. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు అందిస్తున్నాము. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు కల్పిస్తున్నాము. కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2 వేల కోట్ల విపత్తు సాయం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నాము. ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కింద 50 లక్షల మందికి లబ్ధిపొందుతున్నారు. ఇంటి వద్దే పెన్షన్‌ అందిస్తున్నాము. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం అందించాము. గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్‌ జనతా బజార్‌లు తీసుకువస్తున్నాము.

పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తాము. వచ్చే నాలుగేళ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాము. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం చర్యలు చేపట్టడం జరిగింది. పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు ఖర్చు చేస్తున్నాము. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నాము. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాము, రోజుకు 15 వేల టెస్ట్‌లు చేయడం జరుగుతుంది. జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికంగా ఉంది. అదేవిధంగా 38 వేల ఐసోలేషన్ బెడ్స్‌, 1300 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. 24 వేల మంది వైద్యులు, 24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారు. 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ సౌకర్యం ఉచితంగా కల్పించాము.

మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో గవర్నర్ ప్రసంగించడాన్ని సిపిఐ తప్పు పట్టింది. అసెంబ్లీకి రాలేని గవర్నర్ రాష్ట్రానికి అవసరమా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ లపై గుడ్డిగా సంతకాలు చేయడం తప్ప గవర్నర్ వల్ల ప్రయోజనం లేదన్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు.

జీతంపై రాని క్లారిటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్


దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కేంద్రం నిర్ణయం మేరకు ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేయడంతో ఆయా రాష్ట్రాల్లోనూ ఆదాయానికి గండిపడింది. అయితే లాక్డౌన్లోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించగా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం కోతలు విధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉద్యోగులకు ఎంతెంత కోత విధిస్తున్నారో ప్రకటించారు. వైద్య, పోలీస్, పారిశుధ్య, విద్యుత్ శాఖలను మినహాయించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సగం జీతంతోనే సరిపెట్టారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మార్చి, ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ప్రభుత్వం సగం జీతాన్ని మంజూరు చేసింది. మే నెలలో తెలంగాణలో భారీగా సడలింపులు ఇవ్వడంతో పూర్తిస్థాయి వేతనం అందుతుందని ఉద్యోగులు భావించారు. అయితే వారి ఆశలు ఆవిరైయ్యాయి. మే నెలలోనూ వారికి సగం జీతమే దక్కింది. గత మూడునెలలుగా ఉద్యోగులకు సగం జీతం రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జూన్ నెల జీతంపై కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.

జూన్ నెల నుంచి తమకు పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల జీతం, ఫించన్లో కోతలు పెట్టొద్దని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్ సహా సీఎస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి జేఏసీ నేతలు ఈ మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఇదే అంశంపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) నేతలు కూడా తమ సమావేశంలో కీలకంగా చర్చించారు. జూన్లో పూర్తి జీతం ఇవ్వడంతోపాటు గత మూడు నెలల బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతం అందుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

ఈ రోజు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్!


రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి ఈరోజు వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి, రేపు రాత్రి వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. మంగళవారం నాడు 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, బుధవారం నాడు మిగతా 15 రాష్ట్రాలసిఎంలతో ఆయన మాట్లాడనుండగా, బుధవారం నాటి సమావేశాలే దేశానికి అత్యంత కీలకమని తెలుస్తోంది.

అయితే నేడు పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లడఖ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ హలేవీ అండ్ డామన్ డయ్యూ, సిక్కిం లక్షద్వీప్ సిఎంలతో ప్రధాని మోడి మాట్లాడనున్నారు. కాగా ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అన్ని కరోనా కేసుల సంఖ్య, మొత్తం కేసుల్లో 20 శాతం కూడా లేవు. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య రెండంకెలను దాటలేదు.

ఇక బుధవారం నాడు ప్రధాని మొత్తం కేసుల్లో 30 శాతానికి పైగా ఉన్న మహారాష్ట్ర, 15 శాతం ఉన్న తమిళనాడుతో పాటు, వేల సంఖ్యలో కేసులు వచ్చిన ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్, తెలంగాణ, ఒడిశా సిఎంలతో మాట్లాడనున్నారు. ఇండియాలోని కేసుల్లో 80 శాతానికి పైగా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

రాజకీయ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి!!


కరోనా భయంతో సామాన్య ప్రజలు, రాజకీయ ప్రముఖులు విలవిలాడుతున్నారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకి ఈ కోవిద్ సోకినట్లు సమాచారం. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ కు సైతం కరోనా సోకిందనే ప్రచారం జరుగుతోంది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇక ఆయన ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకోగా… నేడు అందుకు సంబంధించిన ఫలితం రానుంది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సైతం అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు కరోనా సోకినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పరీక్షలు నిర్వహించగా… కోవిడ్ 19 లేదని తేలింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

ఇక లాక్‌ డౌన్ సడలింపులు తరువాత కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. దేశ రాజధానిలో కోవిడ్ 19 వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటం కేంద్రానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ప్రభుత్వంతో సమావేశం కూడా నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

సుశాంత్ సింగ్ ఇంట మరో విషాదం


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం మృతి చెందడంతో చిత్రసీమలో విషాదచాయలు నెలకొన్నాయి. సుశాంత్ సింగ్ మృతిపై అనేక అనుమానాలు నెలకొనడంతో ఆయన మృతి మిస్టరీగా మారింది. ఓవైపు సుశాంగ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా మరోవైపు అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతి నుంచి కుటుంబ సభ్యులు కోలుకోక ముందే ఆ ఇంట్లో మరోవిషాదం నెలకొనడం అందరినీ కలిచివేస్తోంది.

సుశాంత్ సింగ్ మృతి వార్త తెల్సినప్పటి నుంచి అతడి వదిన(కజిన్ బ్రదర్ భార్య) తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆదివారం నుంచి ఆమె అన్నపానీయాలు తీసుకోకుండా నీరసించి పోయింది. సోమవారం సాయంత్రం ముంబైలో సుశాంత్ సింగ్ అంత్యక్రియలను నిర్వహిస్తున్న క్రమంలో మరో మరణం చోటుచేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారమే సుశాంత్ సింగ్ వదిన బీహార్లోని పూర్ణియాలో మృతిచెందటంతో కుటుంబ సభ్యులు దుఖసాగరంలో మునిగిపోయారు.

మరోవైపు సుశాంత్ సింగ్ మృతిపై ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బలవర్మణానికి దారితీసిన కారణాలను ఛేదించే పనిలో పడ్డారు. సుశాంత్ చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? తదితర విషయాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రెటీలు సుశాంత్ కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. సుశాంత్ మృతి మిస్టరీని పోలీసులు త్వరగా తేల్చాలని ఆయన అభిమానులు, సన్నిహితులు కోరుతున్నారు.

పదో తరగతి పరీక్షలపై పవన్ వైఖరి ఇదే..!


పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరానా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం చిన్నారుల ఆరోగ్యం పణంగా పెట్టినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందన్నారు. జులై 10 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారని, పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత మాత్రం మంచిది కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్ కి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి కరోనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హైకోర్టు అంగీకరించలేదని చెప్పారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడానికి మేము ఎటువంటి పరిస్థితులలో అంగీకరించమని హైకోర్టు ఖరాకండిగా తెలిపిందన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కులు ఆధారంగా ఉత్తీర్ణతను ఖరారు చేసిందని చెప్పారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 6 వేలకు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యాయని, పరీక్షా కేంద్రాలకు పిల్లలను తీసుకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోందన్నారు. ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాల తక్కువగా వుంది. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కొరిక మేరకు చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, పొరుగు రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను పాటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు తప్పదా?


సొంత పార్టీపై వివిధ అంశాలపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణం రాజుపై వైసీపీ కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. షో కాజ్ నోటీసులు జారీ చెయ్యాలని నిర్ణయించింది. ఈ నోటీసుకు సరైన జవాబు రాకపోతే పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని కూడా నిర్ణయించారని సమాచారం. ఎంపీ విమర్శలు శృతి మించిన స్థాయికి చేరుకున్నాయని భావించిన పార్టీ ఈ నిర్ణయానికి వచ్చింది. కొంత కాలంగా రఘు రామకృష్ణం రాజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, ఇసుక వ్యవహారం, టిటిడి భూముల అమ్మకం, సీఎం కోటరీ, కులరాజకీయం వంటి అనేక విషయాల్లో ఆయన వైఖరి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంది. వైసీపీ వ్యతిరేక మీడియాతో సన్నిహితంగా ఉంటూ కావాలనే ఏ చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

తాజాగా జరిగిన సంఘటనలు ఈ అగ్నికి కొంత ఆజ్యం పోశాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, ఎంపీ రఘు రామకృష్ణం రాజు వైఖరిని తప్పుపట్టారు. కరోనా సమయంలోనూ జగన్ అందరితోను కలుస్తున్నారన్నారు. జగన్ పక్కచూపులు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన ఏ చూపు చూస్తే.. రఘు రామ కృష్ణంరాజు ఎంపీ అయి ఉంటారన్నారు. ఏ చూపు చూస్తే పార్లమెంట్ కమిటీ పదవి దక్కించుకున్నారని ప్రసాదరాజు పేర్కొన్నారు. జగన్ చుట్టూ ఎటువంటి కోటరీ లేదన్నారు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ లాంటి వ్యక్తి చెప్పటం బాధాకరమన్నారు. ఎంపీ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడిన తీరు పార్టీ శ్రేణుల్ని బాధ కలిగించిందని పేర్కొన్నారు.

మరోవైపు ప్రసాదరాజు తనపై చేస్తున్న వ్యాఖ్యాలపై ఘాటుగా కౌంటరిచ్చారు. ప్రసాదు రాజుతో మాట్లాడిస్తున్నవారు ఎవరో తనకు తెలుసునని అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ రాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుందని అన్నారు. సీఎం జగన్‌తో భేటీకి సమయం అడిగితే ఇవ్వలేదని అన్నారు. దయచేసి కులాల మధ్య చిచ్చుపెట్టవద్దని వేడుకుంటున్నానని అన్నారు. పార్టీలో కుల రాజకీయం అధికంగా ఉన్నారు. ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడించాలనుకుంటే అదే సామాజిక వర్గం వారిని ఎంపిక చేసి విమర్శలు చేయిస్తున్నట్లు చెప్పారు.

బీజేపీతో సత్సంబంధాలు ఉన్న రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీలో చేరేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ పార్టీలో ఉండటామో.. లేక వెళ్లటమో తేలిపోయే సమయం దగ్గరకు వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ పై సీఎం జగన్ ఒక క్లారటీ ఇస్తారని సమాచారం.

గిరిజనులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గిరిజనులు ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న అటవీ భూములకు సంభందించి హక్కులు కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల మంతులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎంతో కొంత వ్యవసాయం చేసుకుని గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా అమలు చేస్తున్నందున, అటవీ భూములపై హక్కులు కల్పించడంతో గిరిజనులకు పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అటవీ భూముల హక్కుల విషయంలో గిరిజనులు ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో భూములను గిరిజనుల సాగుకు అనుకూలంగా మలుచుకుని సాగు చేసుకుంటున్నారు. అటవీ చట్టాలు వల్ల గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మాజీ మంత్రి విద్యా సంస్థలు మూత పడాల్సిందేనా


మరో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆఘమేఘాల మీద విడుదల చేసింది. విద్యా శాఖ విడుదల చేసిన ఈ జిఓ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులు పూర్తయ్యాయి. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిద్దా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా శాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలకు కష్టాల్లో పడనున్నాయి.

ఇటీవల జీ.ఓ.ఎం.ఎస్ 23ను విద్యాశాఖ జారీ విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్ కు 40 మందిని మాత్రమే అడ్మిషన్ ఇచ్చేేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 2002లో విడుదలైన జీ.ఓ 12ను సవరిస్తూ కొత్త జీఓను వైసీపీ ప్రభుత్వం జారీ చేసింది. సీబిఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఈ జీఓ జారీ చేసినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. కనిష్టంగా 4 సెక్షన్ లకు 160 మంది, గరిష్టంగా 9 సెక్షన్ లకు 360 మందిని చేర్చుకునే విదంగా పరిమితి విదించారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు గరిష్టంగా 360, 360 మొత్తం 720 మందిని మాత్రమే చేర్చుకోవాలి. గతంలో గరిష్టంగా 1,584 మందికి అవకాశం ఉండగా ఆ సంఖ్యను ఇప్పుడు కుదించారు.

దీంతో ప్రతి క్యాంపస్ లో సుమారు ఐదు నుంచి పది వేల సంఖ్యలో విద్యార్థులను ఉంచి కళాశాలను నిర్వహించే నారాయణ సంస్థకు ఈ ఉత్తర్వులతో సమస్యలు తప్పవని అంటున్నారు. మరోవైపు వేల సంఖ్యలో విద్యార్థులు ఉండే సంస్థలను, వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్న సంస్థలను ఒకేగాటన కట్టి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ప్రవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రవేటు కళాశాలలు నిర్వహిస్తున్న చిన్న యాజమాన్యాలకు ముప్పు తప్పదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మాజీ మంత్రి నారాయణ, మరో టీడీపీ అనుకూల విద్యా సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహేష్ సినిమా కథాకథనాల గురించి.. !


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఏ అంశం పై ఉండనుంది ? టైటిల్ ను బట్టి రాజకీయ అంశాల పై ప్రధానంగా సినిమా సాగుతుందా ? సిని వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని.. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నారని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథ మరియు మహేష్ పాత్రకు సంబంధించిన ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు ఆ రూమర్స్ సారాంశం. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందట.

అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.

స్టార్ డైరెక్టర్స్ నుండి వెబ్ సిరీస్ లు !


‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. చివరికీ అవి కూడా కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి రెండు వెబ్ సిరీస్‌ లు చేయడానికి ఓకే చెప్పారట. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసాడట. ఇక వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

అలాగే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసిన్నట్లు తెలుస్తోంది. మరి పూరి ఏ ప్లాట్ ఫామ్ కి వెబ్ సిరీస్ చేస్తాడో చూడాలి. మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుశాంత్ మృతిపై కంగనా సంచలన వ్యాఖ్యలు


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి బాలీవుడ్లో విషాదాన్ని నింపింది. చిత్రసీమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు సుశాంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా స్పందించింది. సుశాంత్ మృతికి బాలీవుడ్ పెద్దలే కారణమని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివిగల వీడియోను కంగనా తన ఇన్ స్ట్రాలో పోస్టుచేసింది. కంగనా పోస్టుకు అభిమానులు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సుశాంత్ చాలా అద్భుతమైన నటుడని కంగనా కితాబిచ్చింది. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉందని కానీ అవార్డు రానివ్వకుండా చేశారని ఆరోపించింది. ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడని ఆమె ప్రశ్నించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని కంగనా రనౌత్ ఫైరయ్యారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేస్తే వాళ్ళను ఎదగనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పక్కా ప్లాన్ ప్రకారంగా బాలీవుడ్లో బడా సెలబెట్రీలు సుశాంత్ సుసైడ్ చేసుకోవడానికి కారణమయ్యరని వాపోయింది. వీరంతా కొత్తగా ఇండస్ట్రికి వచ్చేవారిని ప్రోత్సహించకపోగా వెనక్కి లాగుతుంటారని చెప్పింది. అలాగే బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్‌ను తొక్కేస్తారని విమర్శించింది. సుశాంత్‌ను డ్రగ్ బానిసగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఒకనొక సమయంలో సంజయ్ దత్ పరిస్థితి కూడా బాలీవుడ్ పెద్దల వల్ల దయనీయంగా ఉండేదని చెప్పింది. చివరకు ఆయన తన సినిమాలను చూడమని అభిమానులకు విజ్ఞప్తి చేశారని తెలిపింది. ఆఖరికి తనపై కూడా ఆరు కేసులు బనాయించారని కంగనా మండిపడింది. బాలీవుడ్ పెద్దల ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కంగనా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

https://www.instagram.com/tv/CBc3sDDAtyb/