
రైటర్ గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్గా మారిన కొద్దిమందిలో హరీశ్ శంకర్ ఒకడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా పలు సినిమాలకు కో రైటర్ గా పని చేసిన హరీశ్.. 2006లో రవిజేత ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ మూవీని ఆర్జీవీనే నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ, శంకర్ టాలెంట్ గురించి తెలిసిన హీరో రవితేజ అతనికి మరో చాన్స్ ఇచ్చాడు. ఐదేళ్ల తర్వాత ‘మిరపకాయ్’ తీసిన హరీశ్… మాస్ మహారాజకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు హరీశ్. ‘గబ్బర్ సింగ్’తో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేసే విజయం సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ నిరాశ పరిచినా.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘దువ్వాడ జగన్నాథం’తో ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే ‘గద్దలకొండ గణేష్’తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇలా హిట్ ట్రాక్‌లో ఉన్న శంకర్… మరోసారి పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ సొంతం చేసుకున్నాడు.
‘వకీల్ సాబ్’, క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ తర్వాత పవన్- శంకర్ కాంబో సెట్స్‌పైకి రానుంది. అందుకు కనీసం ఒకటిన్న నుంచి రెండేళ్ల టైమ్ పట్టేలా ఉంది. అయితే, ఈ ఖాళీ టైమ్‌లో కొత్త అవతారం ఎత్తాలని హరీశ్ భావిస్తున్నాడట. అతను త్వరలోనే నిర్మాతగా మారనున్నాడని సమచారం. ఓవైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మారుతి, సుకుమార్ మాదిరిగా శంకర్ కూడా కొత్త వారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గా మారుతున్నాడట. యువ నిర్మాత బన్నీ వాసుతో కలిసి ఓ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. ఓ కొత్త దర్శకుడితో వీరిద్దరూ సినిమా నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని… కాయ కొట్టడమే ఆలస్యమని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై ఏ క్షణంలో అయిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఆస్కారం ఉంది.