Home Blog Page 8449

రైతుబంధు డబ్బులపై కేసీఆర్ క్లారిటీ!

Rythu bandhu

Rythu bandhu

రైతుబంధు పథకం, నియంత్రిత పంటల సాగు విధానం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిపై సీఎం సమీక్షించారు. జిల్లాల వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వారం పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుబంధు డబ్బులు ఉపయోగించుకుని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించింది. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం  హర్షణీయమని సీఎం అన్నారు. మార్కెట్‌ లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని సీఎం తెలిపారు.

ఆసుపత్రులు అందుకే నిండాయి:ఈటెల

TRS

కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడినవారికి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చికిత్సకు ధరలను నిర్ణయించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 అని, వెంటిలేటర్‌ అవసరం లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500 తీసుకోవాలని, ఒకవేళ రోగి వెంటిలేటర్‌ పై ఉంటే రోజుకు రూ.9,000 వసూలు చేయాలని కోరారు.

అయితే, కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని తాము మార్గదర్శకాలు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 237 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఏకంగా 195 మందికి ఈ వైరస్ సోకింది.

సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ ను విచారించనున్న పోలీసులు!


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగా మారింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెబుతుండగా కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్ చనిపోయిన చోట సుసైడ్ లెటర్ లాంటివి లభించకపోవడంతో వారి అనుమానం మరింత పెరిగింది. దీంతో పోలీసులు సుశాంత్ మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేసుకొని విచారణ వేగవంతం చేశారు.

ప్రస్తుతం సుశాంత్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నాడు. ఇటీవలే ఆయన తీసిన ‘చిచోరే’ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. కెరీర్ పరంగా రాణిస్తున్న ఈ తరుణంలో సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానం ప్రతీఒక్కరిలో మొదలైంది. దీంతో పోలీసులు కూడా విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియాను పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరు చివరిసారిగా మార్చిన 11న ముంబయిలోని ఓ జిమ్ వద్ద కలిశారు. వారిని ఓ వ్యక్తి ఫోటో తీయటంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా సుశాంత్ చనిపోయిన తరవాత కూడా ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసులు ఆమెను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా వీరిద్దరి మధ్య సంబంధం ఏంటీ? చివరిసారిగా ఎప్పుడు కలిశారు?. సుశాంత్ మృతిచెందే ముందే ఏమైనా మాట్లాడారా? అనే కోణంలో విచారణ చేపట్టనున్నారు. అయితే సుశాంత్ పోస్టుమార్టంలో రిపోర్టులో మాత్రం ఆయన ఉరి వేసుకోవడం వల్లే మృతిచెందినట్లు తేలింది. ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తేలింది. దీంతో సుశాంత్ వ్యక్తిగత కారణాలతో చనిపోయాయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం సుశాంత్ అంత్య‌క్రియల‌ను ముంబైలో నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పటికే పాట్నా నుంచి ముంబైకి సుశాంత్ కుటుంబ‌ స‌భ్యులు చేరుకున్నారు. సుశాంత్ మృతిపై బాలీవుడ్ తోపాటు తెలుగు, తమిళ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.

సినిమాల్లోకి రాగానే అది వదిలేసిన హాట్ బ్యూటీ!


మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పూజా హెగ్డే. 2012లో తమిళ్‌లో ‘మిస్కిన్’ (తెలుగులో మాస్క్‌) మూవీతో తెరంగేట్రం చేసిందీ ఈ ముంబై ముద్దుగుమ్మ. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఈ వెంటనే హిందీ సూపర్ స్టార్ హృతిక్‌ రోషన్‌ సరసన ‘మొహంజొదారో’లో నటించింది. దాంతో, హిందీలో సెటిల్‌ అవుదామనుకున్నా.. ఆ మూవీ ఫెయిలవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. వెంటనే మళ్లీ టాలీవుడ్‌ బాట పట్టింది. అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాధం’తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీలో తన అందచందాలతో యూత్‌ హార్ట్‌బీట్‌ పెంచిన ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. దాంతో, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందామె. మహర్షి, గద్దలకొండ గణేశ్, అల వైకుంఠపురములో చిత్రాలు హిట్‌ కావడంతో ఆమె అదృష్ట దేవతగా మారిపోయింది. అక్కినేని అఖిల్ ‘మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్’తో పాటు ప్రభాస్‌ 20వ చిత్రంలో ఆమెనే హీరోయిన్‌. నటనతోనే కాదు స్కిన్‌షో కు కూడా వెనుకాడడం లేదామె.‘దువ్వాడ’తో పాటు అల వైకుంఠపురములో చాలా గ్లామరస్‌గా కనిపించింది.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. ఈ క్రమంలో కెమెరా ముందు నటించేటప్పుడు భయం అనిపించడం లేదా? తొలి సినిమా సమయంలో మీ ఫీలింగ్ ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి పూజ ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘ నాకు సిగ్గు, బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడాలన్నా, కనీసం వాళ్ల ముందు నిలబడాలన్నా చాలా సిగ్గు పడేదాన్ని. కానీ, సినిమాల్లోకి రావాలని డిసైడ్‌ అయినప్పుడే ఆ సిగ్గును పూర్తిగా వదిలేశాను. అందుకే కెమెరా ముందు నటించడమంటే కష్టంగా అనిపించదు. ఇప్పుడు మరింత ఈజీగా యాక్ట్‌ చేస్తున్నా’ అని తెలిపింది. తన క్యారెక్టర్‌ను, నటించే సన్నివేశాన్ని దర్శకుడు చెప్పినప్పుడే అందులో లీనమైపోతాను అంది. స్క్రిప్ట్ చూసుకున్న తర్వాత ఎలా నటించాలో నిర్ణయించుకుంటానని చెప్పింది. అలా కెమెరాను ఈజీగా ఫేస్‌ చేయగలనని, ఎక్కువ టేక్‌లు కూడా అవసరం లేదని వివరించింది. సినిమాల్లో నటించాలంటే సిగ్గు, బిడియం పక్కనపెట్టాల్సిందే అని స్పష్టం చేసింది.

గంటకు లక్ష అంటున్న శృతి హాసన్..!


‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. కొంత విరామం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’పై ప్రేక్షకుల్లోనే కాకుండా టాలీవుడ్‌ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం ఈ మూవీ చిత్రీకరణ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌, ఓ పాటకు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మూవీపై హైప్‌ మరింత పెంచింది. ఈ మూవీ షూటింగ్ ఈనెల 21 నుంచి తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే ఫైనల్ షెడ్యూల్ అని సమాచారం. ఒరిజినల్‌ మూవీ ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉంది. మహిళా హక్కులు, స్త్రీ రక్షణ అనే సోషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించబోతున్నాడు. తప్పుడు కేసులో ఇరుక్కున్న ముగ్గురు అమ్మాయిలను రక్షించే పాత్రలో పవన్‌ కనిపించనున్నాడు. ఈ పాత్రల కోసం అంజలి, నివేధా పేతురాజ్‌, ‘మల్లేశం’ ఫేమ్‌ అనన్యా నాగల్లను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘పింక్‌’లో తాప్సీ పోషించిన లీడ్‌ రోల్‌లో నివేదా నటిస్తోందని అంటున్నారు.

అయితే, తాజా సమాచారం మేరకు ఈ మూవీలో ప్రధాన హీరోయిన్‌ పాత్రను ఇంకా ఫైనలైజ్‌ చేయలేదగ. ఈ రోల్‌కు శ్రుతి హాసన్‌ను సంప్రదించారట. షూటింగ్‌ తిరిగి మొదలైన తర్వాత ఆమె సెట్స్‌కు వస్తుందని సమాచారం. అందుకోసమే ఆమె ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకుందని పలువురు చెబుతున్నారు. ‘వకీల్‌ సాబ్‌’ కోసం తన డేట్స్‌ను కూడా శ్రుతి అడ్జస్ట్‌ చేసుకుందట. కానీ, పారితోషికం విషయంలోనే నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఈ మూవీ కోసం ఏడు రోజుల డేట్స్‌ ఇచ్చిన శ్రుతి 70 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. సాధారణంగా రోజు పది గంటలు మాత్రమే షూటింగ్ పాల్గొంటుందామె. ఈ లెక్కన ఆమె గంటకు లక్ష రూపాయాలు ఇస్తేనే సంతకం చేస్తుందని అంటున్నారు. మరి, అంత మొత్తం ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

సుశాంత్ ఆత్మహత్యకు ముందు మాజీ ప్రేయసి సంచలన పోస్ట్!


బాలీవుడ్ యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌ను తీవ్రంగా కలచివేస్తోంది. మానసిక ఒత్తిడి, ఒంటరి తన భరించలేకపోయిన ఈ యువ నటుడు ఆదివారం ముంబై బాంద్రాలోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ మరణవార్త విని ఇండస్ట్రీ వర్గాలంతా షాక్‌కు గురయ్యారు. సూసైడ్‌ నోట్‌ లేకపోవడంతో అతని ఆత్మహత్యకు కారణం ఏమిటని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో తల్లి మరణంతో పాటు మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండేతో ప్రేమ వైఫల్యం కూడా అతని కుంగుబాటు కారణం అని భావిస్తున్నారు.

గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్రా రిష్తా’ సీరియల్ లో కలిసి నటించిన సుశాంత్, అంకిత ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల పాటు సుశాంత్‌తో ప్రేమలో మునిగిన జంట 2016లో విడిపోయింది. బ్రేకప్‌కు ‘ఒంటరినని బాధపడకు, నేను నీ గుండెల్లో ఎప్పడు చిరస్థాయిగా నిలిచిపోతాను’ అని అంకిత ట్వీట్ కూడా‌ చేసింది. సుశాంత్ ఆత్మహత్యపై అంకిత స్పందించింది. ఓ మీడియా ప్రతినిధి ఫోన్‌ చేసి చెప్పేంత వరకూ తనకు ఈ విషయం తెలియదని తెలిపింది. సుశాంత్‌ ఇకలేడని తెలిసి షాక్‌కు గురయ్యానని చెప్పింది.

కానీ, సుశాంత్ మరణించడానికి కొద్దిసేపటి ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంకిత పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ‘దేవుడు కొంతమంది వ్యక్తులను మీ జీవితం నుంచి తొలగిస్తాడు. ఎందుకంటే మీరు వినని సంభాషణలను ఆయన విన్నాడు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసింది. అనంతరం దీన్ని డిలీట్ చేసింది. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్యకాదు హత్యే అని ఆయన మేనమామ ఆరోపిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అంకిత ఇన్‌స్టాలో రాసి.. డిలేట్‌ చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. అప్పటికే ఈ స్టోరీని స్క్రీన్ షార్ట్ ‌ తీసిన పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. సుశాంత్‌ మరణంలో అంకిత పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు దీన్ని ప్రశ్నించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వైసీపీ టార్గెట్: టీడీపీలో నెక్స్ట్ ఎవరు


ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారిని ఏరేస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ కు గురై ఆందోళనలో ఉన్నారు.

ఇక అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లగా ఆయనకు అనుమతి నిరాకరించారు అధికారులు. ఇక జేసీ ఫ్యామిలీని ఓదార్చడానికి నారాలోకేష్ బయలు దేరారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులను లోకేష్ అనంతపురం వెళ్లి పరామర్శించనున్నాడు. అనంతపురంలో జేసీ అరెస్ట్ కు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునివ్వనున్నారు.

అయితే జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్.. అచ్చెన్నాయుడు ఫ్యామిలీ వద్దకు, అచ్చెన్న వద్దకు వెళ్లే సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఈఎస్ఐ స్కాంతోపాటు ఫైబర్ గ్రిడ్, సహా చంద్రబాబు పాలనలో నారాలోకేష్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అచ్చెన్నను కలిస్తే పాత విషయాలు తవ్వుకున్నట్టు ఉంటుందని అచ్చెన్న ముఖం చూడడానికి కూడా లోకేష్ బాబు సాహసించడం లేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నను లోకేష్ పూర్తిగా విస్మరించడానికి కారణం అదేనా అన్న చర్చ మొదలైంది.

ఇక అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ తర్వాత వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల టీడీపీ సీనియర్లు ఇద్దరిపై కేసులు బుక్ కావడంతో వారేనని అని ఆందోళన చెందుతున్నారు.

టీడీపీలో సీనియర్ నేతలు, కీరోల్ పోషించే ఇద్దరు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై తాజాగా ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై స్ట్రాంగ్ కేసు పెట్టింది. తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. అనంతలక్ష్మిని అడ్డుకొని తన భర్తను తన దరికి చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం కూడా మొదలైంది.

అచ్చెన్నాయుడు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు పితాని సత్యనారాయణ. ఇప్పుడు ఆయన టార్గెట్ గా రాజకీయ ప్రచారం సాగుతుండడంతో పితాని ఆందోళన చెందుతున్నారు. పితాని సత్యనారాయణ కుమారుడిని ఏసీబీ అరెస్ట్ చేయబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో పితాని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన పితాని వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన నిర్వహించిన శాఖల్లో ఆరోపణలు, వివాదాలు పెద్దగా లేవు. ఈ వ్యవహారంలో కావాలని కొందరు పితానిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వర్గం ఆరోపిస్తోంది. అధికార పార్టీ నేతలు ఈ మేరకు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే పితాని ప్రమేయం ఎక్కడా బయటపడకపోవడంతో ఆయన కుమారుడిని టార్గెట్ చేశారనే ప్రచారం ఉధృతమైంది. దీనిపై తాజాగా పితాని మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడిని, తనను అరెస్ట్ చేస్తారనే వార్తలను ఖండించారు. కార్మికమంత్రి పనిచేసిన సమయంలో కొందరి అధికారుల తీరుపై తానే విచారణకు ఆదేశించారు. తనపై ఇప్పుడు లేనిపోని ఆరోపణలు తెరమీదకు తెచ్చారని’ పితాని ఏకరువు పెట్టారు.

ఇక ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను కూడా జగన్ టార్గెట్ చేశారని అంటున్నారు. వారే కాదు.. ఇప్పుడు టీడీపీ సర్కార్ హయాంలో నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్ తోపాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా జగన్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. మొత్తంగా 2015-19 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.158.38 కోట్ల మేర అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించినట్టు సమాచారం.

ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల స్కాంలను తవ్వితీస్తున్న వైసీపీ సర్కార్ ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ తోపాటు.. చంద్రన్న కానుకల్లో అవినీతిలో నాటి సీఎం చంద్రబాబు అవినీతి ఉందని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ లను కూడా బుక్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇదే మొదలైతే టీడీపీలో పెను సంక్షోభం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

కరోనా దెబ్బకు ‘దసరా’ హౌస్ ఫుల్ !


కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్నీ పోస్టుపోన్ అయిపోయాయి. ఇక సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు పోటీకి సిద్దమయ్యే అవకాశం ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు ఆ పోటీ రెట్టింపు అయ్యేలా కనిపిస్తోంది. దసరాకి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ మూవీ ఇంకా అప్పటికీ కొన్ని సినిమాలు రేసులోకి వచ్చేలా ఉన్నాయి.

మొత్తానికి వచ్చే దసరా సీజన్ టాలీవుడ్ కి కీలకంగా మారిపోయింది. చిరంజీవిల ‘ఆచార్య’, రజనీ మూవీ అలాగే ‘కె.జి.ఎఫ్ 2’ దసరాకి వస్తే.. భారీ అంచనాలు ఉన్న ఆ సినిమాల ప్రభావంలో మిగిలిన మిడియమ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు పరిస్థితి ఎంటనేదే ఆయా సినిమాల మేకర్స్ ఆలోచించుకోవాలి. పైగా ఈ దసరాకి భారీ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక మరో పక్క సమ్మర్ సీజన్ లాగే, దసరా సీజన్ కూడా మిస్ అవుతుందేమో అనే టెన్షన్ కూడా ఉంది.

ఏమైనా అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గితే దసరాకి భారీ చిత్రాల దెబ్బకి చిన్న చిత్రాలు రిలీజ్ అయి నిలబడటం కష్టమే.

బోనాలు నిర్వహించకపోతే అనర్థమంటున్న కాంగ్రెస్ నేత


తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం బోనాల పండుగపై నిర్వహించాలా? వద్దా అని సుదీర్ఘంగా చర్చించి ఇటీవలే నిర్ణయం తీసుకుంది. సామూహిక బోనాలను రద్దు చేసింది. బోనాల పండుగను ఈసారి ప్రతీఒక్కరూ వారి ఇళ్లల్లోనే చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది బోనాలను పూజారుల బృందమే అమ్మవార్లకు సమర్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతియేటా బోనాలతో కళకళలాడే భాగ్యనగరం ఈసారి కళ తప్పనుండటంతో నగరవాసులు నిరాశ చెందుతున్నారు.

తెలంగాణలో బోనాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆషాడం వచ్చిందంటే చాలు బోనాల వైభవం కొట్టిచ్చొనట్లు కన్పించేంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలతో ప్రారంభమై.. ఆ తర్వాత భాగ్యనగరం.. ఆ వెంటనే ప్రతీ పల్లె బోనం ఎత్తుతుంది.. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగ ప్రకటించి వైభవంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది.

ఈసారి కరోనా కారణంగా బోనాల పండుగ కళ తప్పిపోనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ వంటి వేడుకలు కరోనా కారణంగా సాదాసీదాగా జరిగాయి. తాజాగా ఈ ఎఫెక్ట్ బోనాల నిర్వహణపై పడింది. ఇదిలా ఉంటే మహానగరంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు కోరుతున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు స్వయంగా లేఖను రాశారు. బోనాల పండగపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని ఆ లేఖలో కోరారు. అవసరమైతే పోతరాజులు, ఫలహారం బండిని ఆపేయండి కానీ.. మహిళలు అమ్మవారికి బోనం సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. మహిళలు బోనం సమర్పిస్తే కరోనా పోతదని.. గతంలోనూ అమ్మవారికి సాకే పోస్తే ప్లేగు వ్యాధి తగ్గిందని ఆయన గుర్తుచేశారు. బోనాలు ఆపితే అనర్దాలు జరుగొచ్చని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

జగన్ పక్కచూపులు చూసి అలా చేశారు:వైసీపీ ఎంపీ

Raghu ramakrishnam raju


పార్టీ మారతారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తన నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో చేరిన నేతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముఖ్యమంత్రి పక్క చూపులు చూసి ప్రముఖ బీజేపీ నేత గంగరాజు కుమారుడు రంగరాజును తెచ్చుకున్నారని.. తాను పక్క చూపులు చూడటం లేదన్నారు. సీఎం ముందు చూపుతో ఆయన్ను తీసుకొచ్చారేమో తనకు తెలియదని.. తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండా నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అపాయింట్‌ మెంట్ తమకు దొరకడం లేదని ఆయన వాపోయారు. సీఎం అపాయిట్‌ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో తెలియదని.. పార్లమెంట్ సమావేశాల సమయంలో రెండుసార్లు పిలిచారు కలిశాను అన్నారు. ఢిల్లీ వచ్చినప్పుడు కలుద్దామనుకున్నానని.. కరోనా వల్ల సీఎం ఢిల్లీ రావడం లేదన్నారు. ఇక్కడ కలిసే అవకాశం తమకు లేదని.. దీన్ని ఓపెన్‌ గా సిగ్గు విడిచి చెప్పుకుంటున్నాను అన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పుకోవడానికి ఏమైనా గర్వకారణమా.. బాధతోనే చెప్పుకుంటున్నాను అన్నారు. ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాపం.. రాహుల్ గాంధీని అడ్డంగా బుక్ చేశారు


తెలుగు రాష్ట్రాల్లో పప్పు అంటూ టీడీపీ అధినేత కుమారుడే గుర్తొస్తాడని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తుంటారు. అదే కేంద్రంలో తీసుకుంటే ఆ సార్థక నామదేయం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కుతుందని రాజకీయాల్లో ప్రచారం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీని మరింత అవమానించేలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

రాహుల్ గాంధీ అపరిపక్వత వల్ల చాలా సార్లు అవమానాల పాలయ్యాడు. పార్లమెంట్ లో మోడీని కౌగిలించుకొని కన్నుకొట్టడం.. పలు ప్రసంగాల్లో నవ్వుల పాలవ్వడం చూస్తూనే ఉన్నాం.. కానీ ఇప్పుడు మెచ్చుర్డ్ గా ఆలోచిస్తున్నారు. ఇటీవల వలస కార్మికులను ఇళ్లకు సొంత ఖర్చుతో పంపి అందరి మనసులు చూరగొన్నారు.

దేశమంతా గమనించే రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా జాతీయ నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలా మర్పు కనిపిస్తోంది.

తాజాగా రాహుల్ గాంధీ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. లాక్ డౌన్ వేళ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ మరణానికి దేశమంతా నివాళులర్పిస్తోంది. మంచి భవిష్యత్ ఉన్న అతడి అర్ధాంతరంగా చనిపోవడంపై కన్నీళ్లు కారుస్తున్నారు.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ లో తాజాగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి, ఫ్యాన్స్ కు సానుభూతి తెలిపారు.

కానీ కొందరు నెటిజన్లు రాహుల్ ట్వీట్ ను మార్చేశారు. మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని అవమానించేలా వదిలారు.

తాజాగా రాహుల్ గాంధీ పేరిట వైరల్ అవుతున్న ఆ ట్వీట్ నకిలీదని తేలింది. రాహుల్ ను అవమానించేలా కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలగా పాపం దానికి రాహుల్ బుక్కయ్యాడు. రాహుల్ ట్విట్టర్ లో యాక్టర్ అనే ఉండగా.. సోషల్ మీడియాలో మాత్రం క్రికెటర్ అని ఉండడంతో రాహుల్ ను అభాసుపాలు చేయడానికి కొందరు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.

యాక్టర్ ను క్రికెటర్ గా మార్చి రాహుల్ గాంధీ ట్వీట్ ను వైరల్ చేసి.. ఆయనకు నటుడికి, క్రికెటర్ కు తేడా తెలియదా అని సెటైర్లు వేశారు. కానీ రాహుల్ చేసిన ట్వీట్ నిజమైనదే కావడంతో ఇదంతా రాహుల్ ను డ్యామేజ్ చేసే కుట్రగా అభివర్ణిస్తున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టు ధర ఎంతంటే?


రాష్ట్రంలో కరోనా కేసులు విభృంభిస్తుండటంతో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19కు చికిత్స చేసేందుకు అనుమతినిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, చికిత్సలకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కరోనా టెస్టులను ఏవిధంగా చేయాలని, చికిత్స సంబంధించిన పలు సూచనలను ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించింది. కరోనా టెస్టులకు సంబంధించి రోగుల నుంచి ఎంతవరకు వసూలు చేయాలనే ధరను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.

తెలంగాణలో ప్రైవేట్ ల్యాబుల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి రూ.2200గా ధర నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులను నిర్వహించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు కరోనా టెస్టులు చేయాలని లక్షణాలు లేనివారికి టెస్టులు చేయొద్దని తెలిపారు. ఏ మాత్రం కరోనా అనుమానం ఉన్నా రోగికి ప్రభుత్వం ఆధ్వర్యంలో టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలి, లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్లో ఉంచాలన్నారు.

కరోనా పాజిటివ్ అని తేలినవారికి రోజుకు రూ.4 వేలు వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స పొందితే రోజుకు రూ.7500, వెంటిలేటర్ మీద ఉన్నవారికి రోజుకు రూ.9 వేల చొప్పున మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వెంటిలేటర్‌పై ఉన్నవారికి, ఐసీయూలో ఉన్నవారికి యాంటీ వైరల్ డ్రగ్‌ ఇస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు. కొన్ని యాంటీ వైరల్ ఇంజక్షన్లు రూ.50వేల వరకు ఖరీదు చేస్తున్నాయని వీటికి ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. టెస్టులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో వైద్యులు నమోదు చేయాల్సి ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో రోజుకు 4,500 కరోనా టెస్టులు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. త్వరలోనే ఈ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదగాధ…


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. గొప్ప ప్రతిభావంతుడైన నటుడు, ఎంతో భవిష్యత్ ఉన్న వ్యక్తి ఇలా అర్ధంతరంగా లోకాన్ని విడిచిపెట్టడం పలువురిని కలిచి వేసింది. సుశాంత్‌ ఆదివారం ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త షాక్‌కు గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు పలువురు క్రీడాకారులు ట్వీట్‌ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఒత్తిడి, కుంగుబాటు కారణంగానే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కానీ, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే హఠాత్తుగా ఆత్మహత్యం చేసుకోవడం మిస్టరీగా మారింది. సుశాంత్‌ ఇంట్లో సూసైడ్‌ నోట్ లభించలేదు.

మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం వల్లే యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ లోకాన్ని విడిచి పెట్టాలనుకునేంత ఒత్తిడి, కుంగుబాటుకు అతను ఎందుకు గురయ్యాడంటే ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. తల్లి మరణం, ఆరేళ్ల ప్రేమ విఫలం కావడం.. మరో అమ్మాయితో పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడడం వల్లే సుశాంత్ కుంగిపోయాడని తెలుస్తోంది.

అమ్మను మరిచిపోలేక
బీహార్ లోని పూర్నియా జిల్లాకు చెందిన సుశాంత్ కుటుంబం పాట్నాలో స్థిరపడింది. సుశాంత్ చిన్నతనంలోనే ఆ కుటుంబంలో ఓ విషాదం. తన 16వ ఏటనే తల్లి ఉషా సింగ్‌ మరణించడంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి మకాం మార్చింది. వాతావరణం మారడంతో చదువులో గొప్పగా రాణించాడు సుశాంత్. ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్ ఇంజనీరింగ్‌లో.. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ తెచ్చుకున్నాడు. ఫిజిక్స్‌లో నేషనల్ ఒలింపియాడ్ విన్నర్ కూడా అయిన సుశాంత్ తర్వాత థియేటర్ ఆర్ట్స్‌ వైపు ఆకర్షితుడవడంతో చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆపై నటక రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి తన టాలెంట్‌తో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఎంత స్టార్డమ్, డబ్బు సంపాదించినా అతని ఆలోచనలు ఈ లోకంలో తల్లిచుట్టూనే తిరిగేవి. ఆమెను తలుచుకుంటూ కవితలు రాసేవాడు. ‘అమ్మా.. నీకు గుర్తుందా. ఎప్పటికీ నాతో కలిసుంటానని మాటిచ్చావు. నువ్వు లేకపోయినా సంతోషంగా నవ్వుతూ ఉంటానని నేను కూడా నీకు మాటిచ్చా. కానీ ఇప్పుడనిపిస్తోంది.. ఇద్దరమూ తప్పేనని’ ఓ సందర్భంలో రాశాడు. కొన్ని రోజుల కిందట తల్లిని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా’ అని ఈ నెల 3వ తేదీన ఓ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

ఆరేళ్ల ప్రేమ ముగియడం తట్టుకోలేక
సినిమాల్లోకి రాకముందు పలు టీవీ సీరియల్స్‌లో సుశాంత్ నటించాడు.ఈ క్రమంలో సహనటి అంకితా లోఖాండేతో ప్రేమో పడ్డాడు. దాదాపు ఆరేళ్ల పాటు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అంకిత తనపై చూపించే ప్రేమతో తల్లి మరణం నుంచి క్రమంగా కోలుకున్నాడు. వీరిద్దరి పెళ్లి ఖాయం అని చాలా మంది భావించారు. కానీ, ఏమైందో ఏమో కానీ సడెన్‌గా విడిపోయారు. దాంతో, సుశాంత్ మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అతడిని మళ్లీ ఒంటరితనం ఆవహించింది. మరోవైపు ఈ బ్రేకప్‌ నుంచి అంకితా లోఖండే త్వరగానే బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వికీ జైన్‌ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్ ఏర్పరుచుకున్న ఆమె ఈ నెల 11వ తేదీనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన చేయకపోయినా వేలికి ఉంగరంతో కూడిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

పెళ్లి ఆగిపోవడంతో కుంగిపోయి..
అంకితతో బ్రేకప్‌ అయిన తర్వాత సుశాంత్ నాలుగేళ్ల పాటు ఒంటరిగానే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ బయోపిక్‌తో స్టార్డమ్‌ తెచ్చుకోవడంతో పాటు వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు. నెమ్మదిగా అంకితను మర్చిపోయిన తను మరో నటికి దగ్గరయ్యాడు. ఆ నటి పేరు రియా చక్రవర్తి. తమ బంధాన్ని బహిరంగ పరచకపోయినా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గతేడాది నవంబర్లోనే సుశాంత్‌ పెళ్లి జరగాల్సి ఉందని అతని కజిన్ ఒకరు చెప్పాడు. పెళ్లి వేడుక కోసం కుటుంబ సభ్యులంతా ముంబై వచ్చేందుకు రెడీ అయ్యారట. ఇంతలో పెళ్లి ఆగిపోయిందన్న సమాచారం వచ్చిందని తెలిపాడు. ఇలా వరుస షాక్‌లతో సుశాంత్‌ మరింత కుంగిపోయాడు. అప్పటి నుంచి ఆరు నెలల పాటు అతను ఎవ్వరినీ కలవకుండా బాంద్రాలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.

అదే సమయంలో అతని చేతుల్లోకి వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లు కూడా దూరమయ్యాయి. బాలీవుడ్‌లో కొందరు తనను కావాలనే దూరం పెడుతున్నారని, కొన్ని వేడుకలకు తనను అస్సలు ఆహ్వానించరని ఓ సందర్భంలో సుశాంత్ చెప్పాడు. ఇక, తన దగ్గర మేనేజర్ గా పని చేసిన దిశ అనే యువతి వారం కిందటే ఆత్మహత్య చేసుకోవడం కూడా సుశాంత్‌ను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసింది. తల్లి జ్ఞాపకాలు వెంటాడడం, ప్రేమ, పెళ్లి విఫలం.. అవకాశాలు చేజారడం… తన దగ్గర పనిచేసిన వ్యక్తి మరణం.. ఇలా అనేక విషాదాలు, అవరోధాలను తట్టుకోలేకపోయిన సుశాంత్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు.. చనిపోయే ముందే తన అప్పులన్నీ తీర్చేసిన యువ నటుడు ఎవ్వరికీ బాకీ ఉండకూడదని అనుకున్నాడు. కానీ, చావే అన్నింటికీ పరిష్కారం కాదని నిజాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు.

వ్యాక్సిన్ పై చిగురిస్తున్న ఆశలు


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలయ్యాయి. చైనా మినహా అన్నిదేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే లాంటి అగ్రదేశాలు సైతం ఈ వైరస్ దాటికి కకావికలమయ్యాయి. ఈ దేశాల్లో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కొన్ని దేశాలు లాక్డౌన్ వంటి కఠిన చర్యలతో కొంతమేర కట్టడి చేయగలిగారు.

జనాభా అధికంగా ఉన్న చైనా, భారత్ దేశాలు లాక్డౌన్ చర్యలు చేపట్టి కొంతమేర వైరస్ విజృంభణను కొంతమేర కట్టడి చేశాయి. అయితే ఇది తాత్కాలికమే. చైనా కఠిన చర్యలు అమలు చేయడంతో కొత్తగా కేసులు నమోదుకావడం లేదు. అక్కడక్కడ కేసులు నమోదవుతున్నా వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటుంది. ఇక భారత్ గత పదిరోజులుగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ తరుణంలోనే చైనాలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో అందరి దృష్టి అటువైపు పడింది.

కోవిడ్-19 వైరస్ కు వ్యాక్సిన్ కనుగోనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వైరస్ రకరకలుగా రూపాంతరం చెందుతుండటంతో వ్యాక్సిన్ కనుగోనటం కష్టంగా మారింది. తాజాగా చైనాలోని ఔష‌ధ త‌యారీ సంస్థ‌ సినోవ్యాక్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలివడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మానవులపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ టీకా మొదటి రెండు దశలు పూర్తి చేసుకుంద‌ని ఆ సంస్థ ప్రకటించిది. ‘కరోనా వ్యాక్స’ పేరుతో అభివృద్ధి చేస్తున్న‌ ఈ టీకాను 18నుంచి 59ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 743మందిపై ప్రయోగించినట్లు వెల్లడించింది.

ఈ టీకా తీసుకున్న 14రోజుల తర్వాత 90శాతం మందిలో కరోనాతో పోరాడే యాంటీ బాడీలు తయారైనట్లు స్పష్టం చేసింది. టీకా తీసుకున్న వారిపై ఎలాంటి దుష్ఫలితాలు లేకపోవడంతో మూడో దశకు ట్రయల్స్ సిద్ధమవుతుంది. మూడోదశలో దేశం బయట ప్రయోగాలు చేయనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీకి బ్రెజిల్ లోని ఓ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సినోవ్యాక్ బ‌యోటెక్ వెల్లడించింది. మరోవైపు ప్రఖ్యాత ఫార్మాసూటికల్ కంపెనీలు సైతం కరోనాకు వ్యాక్సిన్ ను కనుగోనే పనిలో నిమగ్నమయ్యాయి. వీలైనంత త్వరగా కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు పోటాపోటీగా ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే వైరస్ కు వ్యాక్సిన్ రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

నిరాడంబరంగా సీఎం కూతురి రెండో పెళ్లి


కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణా తయికండియిల్ వివాహం నేడు సాదాసీదాగా జరిగింది. మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ పీఎం అబ్దుల్ ఖ‌దీర్ కుమారుడు మహమ్మద్ రియాస్‌తో వీణా తయికండియల్ వివాహం తిరువనంతపురంలో జరిగింది. లాక్డౌన్ కారణంగా వధూవరులు స్పెషల్ మార్యేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేరళ సీఎం అధికార నివాసంలో కొద్దిమంది అతిథుల మధ్య వివాహా వేడుక సాదాసీదాగా జరిగింది.

వీణా త‌యికండియిల్-రియాస్ లకు ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లికావడం గమనార్హం. వీరిద్దరికి దాదాపుగా 43ఏళ్లు ఉంటాయి. వీణా బెంగుళూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని నడిపిస్తున్నారు. ఆమె ప్ర‌స్తుతం ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెడ్‌గా ఉన్నారు. ఇక రియాస్‌ చిన్న‌నాటి నుంచి రాజ‌కీయాల్లో ఉన్నాడు. ప్ర‌స్తుతం డీవైఎఫ్ఐ అధ్య‌క్షుడిగా కొనసాగుతున్నాడు. కిందటి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కోజికోడ్ నుంచి పోటీచేసి సల్ప తేడాతో ఓటమిపాలయ్యాడు.

రియాస్‌ తొలిసారి 2002లో పెళ్లి చేసుకోగా 2015లో డైవ‌ర్స్ తీసుకున్నాడు. రియాస్‌కు ఇద్ద‌రు సంతానం ఉన్నారు. అదేవిధంగా సీఎం విజ‌య‌న్ కూతురు వీణకు కూడా సంతానం ఉంది. ఆమె కూడా 2015లో విడాకులు తీసుకుంది. కాగా నేడు వారిద్దరి కొంతమంది అతిథుల మధ్య వీరిద్దరు ఒక్కటయ్యారు. నూతన దంపతులకు పలువురు సెలబెట్రీలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టీడీపీ వ్యూహాలకు కరోనా ఎఫెక్ట్..!


తెలుగు దేశం పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీ ప్రభావం తగ్గిపోయింది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడటం, అవినీతి, అక్రమాల కేసుల్లో టీడీపీ నాయకులు అరెస్టులు వంటి వరుస దెబ్బలతో ఇబ్బంది పడుతున్న ఆ పార్టీకి కరోనా వల్ల ఇబ్బంది తప్పడం లేదు. ప్రభుత్వం వివిధ అంశాలపై నిరసన తెలిపే అవకాశం కరోనా వల్ల లేకుండా పోయింది. చివరికి సొంత పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నా ఆందోళన చేసే అవకాశం లేకుండా పోవడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

మాజీ మంత్రి, టీడీపీ శాసన సభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అరెస్ట్ వంటి సంఘటనలపై పెద్ద ఎత్తున నిరసన తెలిపే అవకాశం లేకుండా పోయింది. కరోనా లేకుంటే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలకు చంద్రబాబు పిలుపు నిచ్చి భారీ స్థాయిలో నిరసనలు తెలిపే వ్యూహం పన్నేవారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు వల్ల ఆ అవకాశం లేకపోయింది. చంద్రబాబు నిరసనలకు పిలుపునిచ్చినా ఎవరి ఇళ్లలో వారు నిరసన తెలపడం వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదు. టీడీపీ నాయకులు అరెస్టులకు నిరసనగా స్వయంగా చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలో కాగడాల ప్రదర్శన తన నివాసంలో చేపట్టారు. అయినా పెద్దగా మైలేజ్ దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ లాక్ డౌన్ ను లెక్కచేయకుండా నిరసనలు భారీ సంఖ్యలో కార్యకర్తలతో నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ఉదాహరణ. అచ్చెన్నాయుణ్ని ఏసీబీ అధికారులు విజయవాడ తీసుకువెళుతున్న క్రమంలో అడ్డుకునేందుకు ఏలూరు సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు అధిక సంఖ్యలో కార్యకర్తలతో వెళ్లారు. పోలీసులు అరెస్టు చేసి లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు పెట్టడంతో మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించి నిరసనలు తెలిపేందుకు ఓవైపు కేసులు, మరోవైపు వైరస్ భయంతో నాయకులు ముందుకు రావడం లేదు.

మరోవైపు టీడీపీ నాయకులు అరెస్టుల అంశంపై ఇంత రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దీ రోజుల కిందట విశాఖ నగరంలో స్టైరీన్ గ్యాస్ విషాదంలో 12 మంది మరణించినప్పుడు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించని బాబు, లోకేష్ లు ఇప్పుడు టీడీపీ నాయకులు అరెస్టుల విషయంలో మాత్రం అతిగా స్పందిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుణ్ని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వకపోయినా బాబు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని సూపరిండెంట్ సుధాకర్ తో అచ్చెన్న ఆరోగ్యంపై వాకబు చేశారు. విశాఖ విషయంలో మాత్రం ప్రభుత్వం అనుమతి ఎవ్వలేదంటున్నారు. అదేవిధంగా జేసీ కుటుంబాన్ని పరామసరించేందుకు ఈ రోజు లోకేష్ అనంతపురం వెళ్లారు.

బెజవాడ గ్యాంగ్ లపై పోలీసుల కీలక నిర్ణయం..!


విజయవాడ నగర పోలీసులు గ్యాంగ్ వార్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సందీప్, పండు రెండు గ్యాంగ్ ల సభ్యులకు నగర బహిష్కరణ దండన విధించారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో సందీప్, పండు గ్యాంగ్ ల మధ్య జరిగిన కొట్లాటలో సందీప్ మృతి చెందగా మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ రెండు గ్యాంగ్ ల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా గ్యాంగ్ వార్ కేసులో ఇప్పటి వరకూ 37 మందిని అరెస్టు చేశారు.

ఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్‌కు 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని వీరిలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులు తాజాగా అరెస్టు చేసిన పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డి లను కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో గ్యాంగ్ ల విష సంస్కృతి నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భావించిన క్రమంలో ఈ రెండు గ్యాంగుల సభ్యులను విజయవాడ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడినా, గ్యాంగ్ లను నిర్వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు.