
సొంత పార్టీపై వివిధ అంశాలపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణం రాజుపై వైసీపీ కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. షో కాజ్ నోటీసులు జారీ చెయ్యాలని నిర్ణయించింది. ఈ నోటీసుకు సరైన జవాబు రాకపోతే పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని కూడా నిర్ణయించారని సమాచారం. ఎంపీ విమర్శలు శృతి మించిన స్థాయికి చేరుకున్నాయని భావించిన పార్టీ ఈ నిర్ణయానికి వచ్చింది. కొంత కాలంగా రఘు రామకృష్ణం రాజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, ఇసుక వ్యవహారం, టిటిడి భూముల అమ్మకం, సీఎం కోటరీ, కులరాజకీయం వంటి అనేక విషయాల్లో ఆయన వైఖరి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంది. వైసీపీ వ్యతిరేక మీడియాతో సన్నిహితంగా ఉంటూ కావాలనే ఏ చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.
తాజాగా జరిగిన సంఘటనలు ఈ అగ్నికి కొంత ఆజ్యం పోశాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, ఎంపీ రఘు రామకృష్ణం రాజు వైఖరిని తప్పుపట్టారు. కరోనా సమయంలోనూ జగన్ అందరితోను కలుస్తున్నారన్నారు. జగన్ పక్కచూపులు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన ఏ చూపు చూస్తే.. రఘు రామ కృష్ణంరాజు ఎంపీ అయి ఉంటారన్నారు. ఏ చూపు చూస్తే పార్లమెంట్ కమిటీ పదవి దక్కించుకున్నారని ప్రసాదరాజు పేర్కొన్నారు. జగన్ చుట్టూ ఎటువంటి కోటరీ లేదన్నారు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ లాంటి వ్యక్తి చెప్పటం బాధాకరమన్నారు. ఎంపీ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడిన తీరు పార్టీ శ్రేణుల్ని బాధ కలిగించిందని పేర్కొన్నారు.
మరోవైపు ప్రసాదరాజు తనపై చేస్తున్న వ్యాఖ్యాలపై ఘాటుగా కౌంటరిచ్చారు. ప్రసాదు రాజుతో మాట్లాడిస్తున్నవారు ఎవరో తనకు తెలుసునని అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ రాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుందని అన్నారు. సీఎం జగన్‌తో భేటీకి సమయం అడిగితే ఇవ్వలేదని అన్నారు. దయచేసి కులాల మధ్య చిచ్చుపెట్టవద్దని వేడుకుంటున్నానని అన్నారు. పార్టీలో కుల రాజకీయం అధికంగా ఉన్నారు. ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడించాలనుకుంటే అదే సామాజిక వర్గం వారిని ఎంపిక చేసి విమర్శలు చేయిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీతో సత్సంబంధాలు ఉన్న రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీలో చేరేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ పార్టీలో ఉండటామో.. లేక వెళ్లటమో తేలిపోయే సమయం దగ్గరకు వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ పై సీఎం జగన్ ఒక క్లారటీ ఇస్తారని సమాచారం.