
కరోనా భయంతో సామాన్య ప్రజలు, రాజకీయ ప్రముఖులు విలవిలాడుతున్నారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకి ఈ కోవిద్ సోకినట్లు సమాచారం. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు సైతం కరోనా సోకిందనే ప్రచారం జరుగుతోంది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇక ఆయన ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకోగా… నేడు అందుకు సంబంధించిన ఫలితం రానుంది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు కరోనా సోకినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పరీక్షలు నిర్వహించగా… కోవిడ్ 19 లేదని తేలింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
ఇక లాక్ డౌన్ సడలింపులు తరువాత కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. దేశ రాజధానిలో కోవిడ్ 19 వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటం కేంద్రానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ప్రభుత్వంతో సమావేశం కూడా నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.