Censor Board : భారతదేశానికి చెందిన సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉంటూ చైనా దేశానికి భయపడుతున్న అధికారులు ఉన్నారా..? అంటే అవునన్న సమాధానమే డైరెక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నుంచి వినిపిస్తోంది. అమెరికాలో స్థిరపడిన ఈయన ఒక డాక్టర్. భారతదేశంపై చైనా చేసిన, చేస్తున్న దురాగతాలను వెల్లడిస్తూ భారతీయన్స్ పేరుతో సినిమాను రూపొందించారు శంకర్ నాయుడు అడుసుమిల్లి. అయితే, చైనాకు భయపడి సెన్సార్ బోర్డు అధికారులు ఈ సినిమాలో భారతీయుల గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భారతదేశంలో చైనా చేసిన దురాగతాలను వెల్లడిస్తూ రూపొందించిన మొట్టమొదటి సినిమా ఇదని, అయితే దీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈయన. ఈ సినిమాలో చైనా దాడులు, బ్యాక్ స్టాబ్ లు వంటి అనేక అంశాలను ఇందులో తీర్చిదిద్దారు. ఈ విషయాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతో సెన్సార్ బోర్డు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు శంకర్ ఆడుసుమిల్లి.
శంకర నాయుడు అడుసుమిల్లి అనే వ్యక్తి భారతీయ మూలాలు కలిగి అమెరికాలో స్థిరపడిన తెలుగువాడు. వైద్య వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆయన ఒక సినిమాను రూపొందించారు. భారతీయన్స్ పేరుతో రూపొందించిన ఈ చిత్రంలో భారతదేశంలో చైనా సాగించిన దురాగతాలను, వెన్నుపోట్లను గురించి స్పష్టంగా వివరించారు. ఈ సినిమా సెన్సార్ బోర్డు కు వెళ్ళినప్పుడు అక్కడి అధికారులు ఈ సినిమాను బయటకు రాకుండా చేస్తున్నారని శంకర్ నాయుడు అడుసుమిల్లి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో వెల్లడించిన విషయాలు, అధికారులు పెడుతున్న ఇబ్బందులు గురించి సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారు, ఆ వివరాలు మీకోసం.
భారతదేశ సరిహద్దుల్లో మ్యాపులు మారుస్తున్న చైనా..
ఈ చిత్రంలో చైనాతో ఉన్న అనేక ఇబ్బందులు, సంబంధాలను కీలకంగా శంకర్ నాయుడు ప్రస్తావించారు. సామాజిక మాద్యమాల్లో ఆయన షేర్ చేసిన విషయాలు ఇలా ఉన్నాయి. ‘ చైనా భారతదేశంతో అతి పొడవైన సరిహద్దుల్లో ఒకటిగా ఉంది. 3218 కిలో మీటర్లు పొడవైన సరిహద్దు ఉంది. 1950 నుంచి చైనా అనేక ప్రత్యక్ష, పరోక్షయుద్ధాలతో భారతదేశాన్ని దెబ్బతీస్తూ వస్తోంది. చైనా వ్యూహాత్మకంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి టిబేట్ ను స్వాధీనం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని క్లైమ్ చేస్తూ భారత్ పై దాడి చేయడానికి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించింది. సరిహద్దుల్లో చైనా భారతదేశ మ్యాపులను పూర్తిగా మార్చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని పేర్లను మారుస్తోంది. 2020లో గాల్వాన్ వ్యాలీకి వచ్చి 20 మంది భారతీయ సైనికులను చైనా హతమార్చింది. అంతేకాకుండా నీచ దేశమైనా చైనా కోవిడ్ ను తయారు చేసింది. ఇది వ్యూహాన్ లేబ్ నుంచి వచ్చింది. దాదాపు 8 మిలియన్ల మందిని చంపారు. కొద్ది వారాల క్రితం కాశ్మీర్లో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాన్ని చైనా పూర్తిగా బహిష్కరించింది. కాశ్మీర్ వివాదాస్పద భూభాగమని పాకిస్థాన్ కు బహిరంగంగా మద్దతిస్తోంది. భారత సార్వబౌమత్వాన్ని ప్రశ్నించడానికి వీళ్లకు ఎంత ధైర్యం. పాకిస్తాన్, కాశ్మీర్ ఉగ్రవాదులకు చైనా బహిరంగంగా మద్దతు ఇస్తోంది. 2008లో 26/11 దాడులకు తెగబడి ముంబైలో 165 మందిని చంపిన లస్కరి తోయిబాకు మద్దతిస్తోంది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం మనపై 26/11 దాడికి సూత్రధారి అయిన లష్కరే తోయిబాకు చెందిన సయ్యద్ మీర్ ను ఒక క్రూరమైన తీవ్రవాదిగా ప్రకటించాలని భారతదేశం, అమెరికా సంయుక్త తీర్మానాన్ని అడ్డుకుంది. చైనా ఎల్లప్పుడూ భారత్ వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. అత్యంత ప్రమాదకరమైన, మోసపూరిత, దుర్మార్గమైన చైనా.. బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా సాధ్యమైన ప్రతి దేశాన్ని వలస రాజ్యం చేయడానికి ప్రయత్నిస్తూ అధికారంలో ఉండేందుకు ప్రజలను సైతం చంపుతుంది. ఈ దుర్మార్గపు నిరంకుశల గురించి భారతీయులకు తెలియజేసే ఉద్దేశంతో భారతీయన్స్ పేరుతో సినిమా తీసి వారి తీరును ఎండగట్టి బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ‘ అని ఆయన వివరించాడు.
చైనా పేరు వాడోద్దంటున్న సెన్సార్ బోర్డు..
చైనా సాగిస్తున్న ఆకృత్యాల గురించి తీసిన సినిమాలో చైనా పేరును వాడవద్దు అంటూ సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు అడుసుమిల్లి శంకర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చైనా పేరుతోపాటు గాల్వాన్ వ్యాలీ పేరును కూడా తొలగించమని అడిగినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత అరాచకం, ఎంత అవమానకరమంటూ ఆయన విమర్శించాడు. గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా..? చైనాకు లొంగిపోతున్నామా..? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మౌనంగా ఉండలేమని, బలహీనంగా ఉండలేమని, జాతీయ చిహ్నమైన నాలుగు సింహాల ధైర్యం, పోరాటం, స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన
స్పష్టం చేశారు. సింహం లాగా ఉండాలని సూచించారు. భారతీయన్స్ చిత్రానికి మద్దతు ఇవ్వాలంటూ ఆయన వేడుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు చేసిన ఆరోపణలపై సెన్సార్ బోర్డు సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.