Rahul Gandhi : కేసీఆర్ చికాకు పెట్టించాడు. అధికారులతో ఇబ్బందిపెట్టించాడు. అయినా కాంగ్రెస్ సభ విజయవంతమైంది. ఖమ్మం నడిబొడ్డున నిజంగానే గర్జించింది. కాంగ్రెస్ అనుకున్నట్టు కాదు గాని 150 ఎకరాల మైదానం దాదాపు నిండింది. 2.5 లక్షల మంది దాకా వచ్చారని ఓ అంచనా. పోలీసులు చికాకు పెట్టకుంటే ఇంకా జనం వచ్చేవారు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరి ఏమాత్రం హుందాగా లేదు. సంస్కారయుతంగా అంతకన్నా లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. ఫర్ సపోజ్ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు ఇదే స్థాయిలో ఆంక్షలు విధిస్తే ఎలా ఉండేది? సీఎం అయిన తర్వాత కేసీఆర్ నియంత కన్పిస్తున్నాడు. తెలంగాణలో ఎవరూ సభ జరుపుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా సాగుతోంది ఆయన వ్యవహారం. గతంలో కోదండరాంను ఇలాగే కేసీఆర్ ఇబ్బందిపెట్టాడు.
ఖమ్మం సభకు సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. అదేంటోగాని హఠాత్తుగా ఇలాంటి సమయాల్లోనే నిబంధనలు గుర్తుకు వస్తాయి. అంతే కాదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా బీఆర్‌ఎస్ నాయకులు భౌతిక దాడులకు దిగారు. ఈ సంస్కృతి ద్వారా తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం మేసేజ్ ఇస్తున్నట్టు? ఏంటో కేసీఆర్ లో రోజురోజుకూ ఉద్యమ నాయకుడి లక్షణాలు పూర్తిగా గాయబ్ అయిపోతున్నాయి. ఇక ఆ కేటీఆర్, హరీష్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక మీటింగ్‌లో రాహుల్ గాంధీ కొన్ని సందర్భాల్లో తెలివిగా మాట్లాడాడు. కేసీఆర్ అవినీతికి మోదీతో లింక్ పెట్టాడు. అంటే కేసీఆర్ అవినీతికి మోదీ సపోర్టర్ అని.. ప్రతిపక్షాల మీటింగ్‌కు కేసీఆర్‌ను ఆహ్వానించకూడదని మేమే చెప్పామనీ, ఆయన వస్తే మేం రాలేమని.. కేసీఆర్‌కు మాకూ ఎలాంటి సంబంధాలు లేవని పదే పదే చెబితే ఇక్కడి వరకు పనికి వస్తుంది గాని.. ఒక్కసారి చరిత్రను తవ్వి తీస్తే అవన్నీ ఝూఠా మాటల కిందకే వస్తాయి.
గతంలో ఎన్నికలప్పుడు కేసీఆర్ కాంగ్రెస్‌కు ఆర్థిక సాయం చేసింది వాస్తవం. రేప్పొద్దున అవసరం పడితే మళ్లీ కేసీఆర్ కాంగ్రెస్ వైపు పరుగులు తీయడు అనే గ్యారెంటీ లేదు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ సభ విజయవంతమైంది. భట్టి, పొంగులేటికి సమాన ప్రయారిటీ దక్కింది. మరో పవర్ హౌస్ రేణుకా చౌదరి సైలెంట్ అయింది. కలిసి పని చేస్తే వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఖమ్మం నిరూపించింది. మరి ఆ గట్టిదనాన్ని కాంగ్రెస్ నిలుపుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. గత ఎన్నికల్లో 8 మందిని గెలిపిస్తే ఏకంగా ఆరుగురు గులాబీ జెండా పంచన చేరారు. ఈసారి ఏమవుతుందో చూడాలి మరీ..