OG Censor Certificate : మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ(They Call Him OG) మూవీ కి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు రెండు మూడు రోజుల ముందే పూర్తి అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు వరకు సెన్సార్ సర్టిఫికెట్ ని జారీ చెయ్యలేదు. అందుకు ముఖ్య కారణం సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA ఇవ్వడానికి నిరాకరించిందనే కారణమే. బోర్డు లో ఉన్న కొంతమంది అంగీకరించారు, కానీ మరికొంతమంది మాత్రం ఇంతటి రక్త పాతం తో కూడిన సన్నివేశాలు ఉన్న సినిమాకు UA ఎలా ఇస్తామని మేకర్స్ తో కాస్త వాదోపవాదాలు జరిగాయట. అయితే చివరికి UA ఇవ్వడానికి సెన్సార్ సభ్యులు ఒప్పుకున్నారు కానీ, 100 కట్స్ చేయాల్సి ఉంటుందని అన్నారట. అందుకు మూవీ టీం ఒప్పుకోలేదు. చాలా వరకు రిక్వెస్ట్ చేసి చూసారు, కానీ సెన్సార్ సభ్యులు ససేమీరా ఒప్పుకోలేదు.
దీంతో మేకర్స్ చేసేది ఏమి లేక కొన్ని మినిమం కట్స్ తో A సర్టిఫికేట్ ని అందుకున్నారు. కాసేపటి క్రితమే ఈ సర్టిఫికెట్ సోషల్ మీడియా లో విడుదలైంది. A సర్టిఫికేట్ ఇచ్చి కూడా రెండు నిమిషాల సన్నివేశాన్ని కట్ చేశారు. ఇక సెన్సార్ బోర్డు చెప్పినట్టు కరెక్షన్స్ చేసి ఫైనల్ కట్ ఇచ్చి ఉండుంటే కచ్చితంగా 15 నిమిషాల నిడివి సినిమా నుండి తొలగిపోయి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ లో కట్ చేయబడిన సన్నివేశాలు కొన్నిటిని చూసి అసలు సినిమా ఈ రేంజ్ వయొలెన్స్ ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒక సన్నివేశం నెక్ స్టీట్చింగ్, మరో సన్నివేశం లో బేబీ ఇన్ బ్లడ్ పూల్ లాంటివి ఉన్నాయి అందులో. వీటిని చూసి డైరెక్టర్ సుజీత్ ని అభిమానులు ట్యాగ్ చేస్తూ అసలు సినిమాలో ఏమి ప్లాన్ చేసావు బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కాసేపు పక్కన పెడితే A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 18 సంవత్సరాల కంటే చిన్న వాళ్ళని అనుమతించరు. B ,c సెంటర్స్ లో పెద్దగా పట్టించుకోరు కానీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి సిటీస్ లో రూల్స్ ని తూచా తప్పకుండ అనుసరిస్తారు. దీని వల్ల చాలా రెవిన్యూ నష్టం ఉంటుంది. అసలే ఓజీ చిత్రానికి చిన్న పిల్లల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయం లో UA సర్టిఫికేట్ వస్తే బాగుంటుంది, దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కదులుతారని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే సెన్సార్ సభ్యులు A సర్టిఫికేట్ ని జారీ చేశారు. దీని వల్ల సినిమాకు ఎంత నష్టం జరుగుతుందో చూడాలి. రీసెంట్ గా విడుదలైన కూలీ చిత్రానికి కూడా A రేటింగ్ ఇచ్చారు.