Homeలైఫ్ స్టైల్Friendship: చెడ్డ వారితో స్నేహం కంటే మంచి వారితో విరోధం మంచిది.. ఎందుకో ఈ స్టోరీ...

Friendship: చెడ్డ వారితో స్నేహం కంటే మంచి వారితో విరోధం మంచిది.. ఎందుకో ఈ స్టోరీ చదవండి..

Friendship: కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు.. ‘చెడ్డ వారితో స్నేహం చేయడం కంటే.. మంచి వారితో విరోధం ఉండటం మేలు’ అని. మనం ఎవరితో కలిసి ఉంటామో, ఎవరిని ప్రత్యర్థిగా భావిస్తామో కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుంది. దీనికి ఉదాహరణగా మహాభారతంలోని దుర్యోధనుడి పరిపాలనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ స్టోరీ నేటి కాలంలోని వారికి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అ స్టోరీ ఏంటంటే? కౌరవులు, పాండవుల మధ్య జరిగిన […]

Friendship: కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు.. ‘చెడ్డ వారితో స్నేహం చేయడం కంటే.. మంచి వారితో విరోధం ఉండటం మేలు’ అని. మనం ఎవరితో కలిసి ఉంటామో, ఎవరిని ప్రత్యర్థిగా భావిస్తామో కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుంది. దీనికి ఉదాహరణగా మహాభారతంలోని దుర్యోధనుడి పరిపాలనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ స్టోరీ నేటి కాలంలోని వారికి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అ స్టోరీ ఏంటంటే?

కౌరవులు, పాండవుల మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో పాండవులు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో హస్తినాపురంలో దుర్యోధనుడి ఆధిపత్యం కొనసాగింది. రాజ్యం తన చేతుల్లోకి రావడంతో దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడు? ప్రజలు సంతోషంగా ఉన్నారా? రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ధర్మరాజు తెలుసుకోవాలనుకున్నాడు. ధర్మరాజు తనకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తిని రాజ్యంలోకి వెళ్లి పరిస్థితులను తెలుసుకురావాలని కోరాడు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా రాజ్యంలో తిరుగుతూ ప్రజలను కలుసుకున్నాడు. పాలన ఎలా ఉంది? ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అధికారులు ఎలా పనిచేస్తున్నారు? అనే అంశాలపై సుమారు ఆరు నెలల పాటు వివరాలు సేకరించాడు.

ఆరు నెలల తరువాత తిరిగి వచ్చిన ఆ వ్యక్తి ధర్మరాజును కలిశాడు. తాను చెప్పబోయే విషయం విని కోపం తెచ్చుకోవద్దని ముందుగానే కోరాడు. అనంతరం దుర్యోధనుడి పాలన గురించి ధర్మరాజుకు ఊహించని విషయాన్ని చెప్పాడు. దుర్యోధనుడు రాజ్యాన్ని బాగానే పరిపాలిస్తున్నాడని తెలిపాడు. ఈ మాట విన్న ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుడికి వంకర బుద్ధి ఉందని, తమపై ఎప్పుడూ ద్వేషంతో ఉంటాడని తెలిసినప్పటికీ.. అతని పాలన ఎలా మంచిగా ఉందని అడిగాడు.

అప్పుడు ఆ వ్యక్తి అసలు విషయాన్ని వివరించాడు. ‘దుర్యోధనుడి ఆలోచనా విధానం ఎలా ఉన్నా.. అతను మీ కంటే మెరుగ్గా పరిపాలించాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకు ప్రధాన కారణం మీరే ’ అని చెప్పాడు. ధర్మరాజు తన పాలనలో న్యాయం, ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు. ప్రజలను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడు. అందుకే పాండవులతో పోల్చినప్పుడు తాను తక్కువగా కనిపించకూడదనే ఉద్దేశంతో దుర్యోధనుడు మరింత సమర్థవంతంగా పాలించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ వ్యక్తి వివరించాడు.

ధర్మరాజుపై ఉన్న అసూయ, ద్వేషం దుర్యోధనుడిలో ఒక రకమైన పోటీ భావనను పెంచింది. ‘ధర్మరాజు కంటే నేను మెరుగ్గా ఉండాలి’ అనే ఆలోచనతో అతను తన పరిపాలనపై శ్రద్ధ పెట్టాడు. ప్రజలకు తాను మంచి రాజుననే భావన కలిగించాలని ప్రయత్నించాడు. అంటే ధర్మరాజు అనే మంచి వాడితో దుర్యోధనుడి శత్రుత్వమే ఒక విధంగా అతన్ని మెరుగైన పరిపాలన వైపు నడిపించింది. మంచి వ్యక్తితో ఉన్న పోటీ కారణంగా చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి కూడా తన పనితీరును మెరుగుపరుచుకోవాల్సి వచ్చింది.

ఈ కథ ద్వారా నేటి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనపై ప్రభావం చూపుతారు. మంచి వ్యక్తులతో పోటీ పడితే మనలో కూడా మంచి లక్షణాలు పెరుగుతాయి. వారి స్థాయిని అందుకోవాలనే ప్రయత్నంలో మన పనితీరు మెరుగవుతుంది. అదే సమయంలో చెడు వ్యక్తులతో స్నేహం చేస్తే వారి అలవాట్లు, ఆలోచనలు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.అందుకే ‘చెడ్డ వారితో స్నేహం కంటే.. మంచి వారితో విరోధం మంచిది’ అనే సామెతకు ఈ కథను ఉదాహరణగా చెబుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper