Knee Health: ప్రస్తుత కాలంలో ప్రతి రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరిగా మారింది. ఇది వీలుకాకపోతే కనీసం వాకింగ్ అయినా చేయాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్లు అరిగిపోతాయని కొందరు భయపడుతున్నారు. కానీ క్రమబద్ధమైన శారీరక శ్రమ కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని , అవి అరిగిపోవని వైద్యులు అంటున్నారు. ఇంతకీ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ల సమస్యలు ఉంటాయా?
కొందరు ప్రముఖ వైద్యులు తెలుపుతన్న ప్రకారం.. కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కండరాల బలం, సరైన శరీర బరువు నిర్వహణ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలు బలపడి, కీళ్లపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే, శరీరం అధిక బరువు ఉన్నప్పుడు కీళ్లపై విపరీతమైన భారం పడి అరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవడమే కీళ్ల రక్షణకు అసలైన మార్గం. ఈ కీళ్ల రక్షణకు వాకింగ్ సరైనదే అని అంటున్నారు.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు వ్యాయామాలకు పూర్తిగా దూరంగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. నొప్పులు ఉన్నప్పటికీ వైద్యుల సలహాతో తేలికపాటి వ్యాయామాలు, స్విమ్మింగ్ లేదా వాకింగ్ వంటి తక్కువ ఒత్తిడినిచ్చే పనులు కొనసాగించడం మంచివని అంటున్నారు. వ్యాయామం పూర్తిగా ఆపివేస్తే కీళ్లు మరింత బిగుసుకుపోయి, సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది.
చాలామంది కాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్లు వాడితే కీళ్లవాతం రాకుండా అడ్డుకోవచ్చని భావిస్తుంటారు. అయితే ఈ సప్లిమెంట్లు కీళ్లవాతాన్ని నివారించలేవని ఆయన స్పష్టం చేశారు. ఎముకల సాంద్రతకు ఇవి తోడ్పడినప్పటికీ, కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి క్రమబద్ధమైన వ్యాయామం, సరైన జీవనశైలి మాత్రమే నిజమైన పరిష్కారాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.