Moinabad party : ప్రజా ప్రతినిధులు అనేవారు కొంతలో కొంత పారదర్శకతను పాటించాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. చట్ట వ్యతిరేకమైన పనులు చేసి.. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన వ్యక్తులను ఏ రాజకీయ పార్టీలు కూడా సహించకూడదు. దురదృష్టవషత్తు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పై ఉపోద్ఘాతానికి విరుద్ధంగా జరుగుతోంది.. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా.. అన్ని రాజకీయ పార్టీలలో ఈ తంతు దర్జాగా సాగుతోంది.
ఇటీవల తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మాదక ద్రవ్యాల పార్టీ జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దానికంటే ముందు పకడ్బందీగా వివరాలు సేకరించి దాడులు చేశారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి, ఇతర వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఏపీ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ ఉన్నారు. ఆ ఎంపీ విషయంలో టిడిపి వెంటనే రెస్పాండ్ అయింది. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉండాలని సూచించింది. టిడిపి చేసిన ఈ ప్రకటన.. స్పందించిన తీరు రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం గులాబీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మరొక విధంగా ఉంది. రోహిత్ రెడ్డి దొరికిపోవడం ఒకరకంగా గులాబీ పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఆ పార్టీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసింది. అయితే ఇక్కడ రోహిత్ రెడ్డి రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పటికీ.. అతని వద్ద రెండు గ్రాముల మాదక ద్రవ్యం లభించినప్పటికీ.. వైద్యులు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్గా తేలినప్పటికీ.. గులాబీ పార్టీ రాజకీయ కుట్ర అని ఆరోపించడం మొదలుపెట్టింది. ఇది కాస్త తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారి తీసింది.
సహజంగా ఇటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినపుడు రాజకీయ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను దూరం పెడతాయి. అయితే రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం గులాబీ పార్టీ సానుభూతి ప్రదర్శిస్తోంది. దీని వెనక కారణాలు ఏమిటనేది అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ ఎంపీ విషయంలో టిడిపి వ్యవహరించిన తీరుకు.. రోహిత్ రెడ్డి వ్యవహారంలో గులాబీ పార్టీ స్పందించిన తీరుకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మహేష్ మీద టిడిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అంతే కాదు ఏపీ ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించింది. గులాబీ పార్టీ మాత్రం రోహిత్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోక పోగా, ఆయనను బాధితుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. పైగా ప్రభుత్వ యంత్రాంగం కావాలని అతడిని ఇరికించిందని వాదిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ ఫామ్ హౌస్ మాదక ద్రవ్యాల కేసును ఆసరాగా పొలిటికల్ ఎటాక్ మొదలుపెట్టింది. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ విమర్శలకు కేటీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో రాజకీయ సెగ తీవ్రస్థాయిలో ఉంది.. అయితే రోహిత్ రెడ్డి గతంలో దుబాయ్ ప్రాంతంలో లావాదేవీలు నిర్వహించారని.. బినామీ పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది.