యువభారత్ అదరగొట్టింది. గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి చూపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బుల వాయో లో పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో ఏకంగా 58 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీమిండియా వేదాంత త్రివేది (68) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. వైభవ్ సూర్యవంశీ(30), కనిష్క్ చౌహన్ (35) సత్తా చూపించారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. సాయం, అహ్మద్ హుస్సేన్ చెరి రెండు వికెట్లు సాధించారు.
ఆ తర్వాత 253 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు తొలి వికెట్ 23 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత రెండు వికెట్ కు 65 పరుగులు, మూడో వికెట్ కు 63 పరుగులు జోడించింది. దీంతో పాకిస్తాన్ జట్టు ఒకానొక దశలో 151/3 వద్ద నిలిచింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తద్వారా పాకిస్తాన్ జట్టు చూస్తుండగానే 7 వికెట్ల కోల్పోయింది.. మిగతా ఏడు వికెట్లను పాకిస్తాన్ జట్టు 43 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. భారత బౌలర్లలో కిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే చెరి 3 వికెట్లు సాధించారు. ఈ విజయం ద్వారా భారత్ సెమి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడుతుంది. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆ ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. కీలకమైన మ్యాచ్ లో సూర్య వంశీ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. వేదాంత్ త్రివేది స్థిరంగా నిలబడ్డాడు. 98 బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే కొట్టాడు. దీనిని బట్టి అతడు ఒత్తిడిలో ఏ స్థాయిలో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో భారత జట్టు లో ఉత్సాహం తారస్థాయికి చేరింది.
పాకిస్తాన్ జట్టులో హంజా జహ్హుర్ (42), ఉస్మాన్ ఖాన్ (66), ఫర్హాన్ యూసఫ్ (38) పరుగులు చేశారు. అయితే వీరు అవుట్ కావడంతో పాకిస్తాన్ జట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే క్రమంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో మ్యాచ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. భారత జట్టుకు అనుకూలమైన ఫలితం రావడంతో యువ ఆటగాళ్ల బృందం దర్జాగా సెమి ఫైనల్లోకి వెళ్లింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి బ్యాట్, బంతితో రాణించిన కనిష్క్ చౌహాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.