13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద వినతి పత్రాలు ఇస్తున్నారు. వారి దగ్గర నుంచి కలెక్టర్.. ఇతర అధికారులు వినతిపత్రం స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను ఓపికతో వింటున్నారు. వెంటనే వాటికి పరిష్కార మార్గం చూపుతున్నారు.
అక్కడికి ఒక 13 సంవత్సరాల బాలుడు వచ్చాడు. నేరుగా కలెక్టర్ కూర్చున్న ప్రాంతం వద్దకు వెళ్లాడు. ఎటువంటి వినతిపత్రం లేకుండానే నేరుగా కలెక్టర్ తో మాట్లాడారు..”సార్ నమస్కారం. మా ఇంటిని బంధువులు ఆక్రమించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో మా బంధువులు మా ఇంటిని వదిలిపెట్టడం లేదు. కమీషన్ ఇస్తేనే అధికారులు పనిచేస్తున్నారు.. ఒకవేళ అది ఇస్తే పని జరుగుతుందా” అంటూ కలెక్టర్, ఇతర అధికారులను ప్రశ్నించాడు.
ఆ బాలుడి మాటలు విన్న కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వెంటనే ఆ బాలుడుతో మాట్లాడారు. సమస్యను తెలుసుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమస్యను విన్నవించారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వారికి సూచించారు. దీంతో ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లకీమ్ పూరి కేరీ ప్రాంతంలో చోటుచేసుకుంది అబాలుడు అధికారులను కలిసిన తీరు.. తమ సమస్యపై ప్రశ్నించిన తీరు అందరిని ఆకట్టుకుంటున్నది. “ఆ బాలుడి ధైర్యం మామూలుగా లేదు. అతడు నేరుగా కలెక్టర్ నే కలిశాడు. తన వెంట పెద్దవాళ్ళు కూడా లేరు. ఆధారాలతో సహా అధికారులను ప్రశ్నించాడు. లంచం ఇస్తేనే పని జరుగుతుందా అంటూ అడిగాడు. దానికి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఆ బాలుడి ధైర్యానికి హాట్సాఫ్ అంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా పోలీసులు అక్కడికి వెళ్లడం.. ఆ బాలుడి బంధువులతో మాట్లాడటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ బాలుడి బంధువులకు పోలీసులు తమ మార్క్ పనితనం చూపిండంతో ఆక్రమించిన ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారని ఉత్తరప్రదేశ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తమ బంధువుల ఆక్రమణ నుంచి ఇంటిని కాపాడుకున్న బాలుడి తెగువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
