AP liquor scam : ఏపీలో మద్యం కుంభకోణానికి( liquor scam) సంబంధించి కేసు విచారణ లోతుగా కొనసాగుతోంది. తవ్వే కొద్ది అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. కోర్టులో రెండు చార్జ్ షీట్లు సైతం దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసులో ఉన్న నిందితుల ఫోటోలు బయటకు వస్తున్నాయి. నాడు మద్యం కుంభకోణంలో వసూలు చేసిన నగదు లెక్కింపు, పర్యవేక్షణ వంటి వాటిలో నిందితులు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకోవైపు నిందితులు, నిందితుల సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సైతం పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జగన్ సోదరుడు ఒకరు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నాడు మద్యం కుంభకోణంలో వసూలు చేసిన మొత్తాన్ని.. నాటి ప్రభుత్వ పెద్ద కు అందించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
* నగదు సరఫరా లో కీలక పాత్ర..
మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర పోషించారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల నుంచి నెలకు 40 నుంచి 50 కోట్ల రూపాయలను రాజ్ కసిరెడ్డి వసూలు చేసేవారు. ఆ నగదును ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరితోనూ పంపించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి( Anil Reddy) ద్వారా ఎక్కువ మొత్తం అందజేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ అనిల్ రెడ్డి ఎవరో కాదు.. జగన్మోహన్ రెడ్డి పెదనాన్న జార్జ్ రెడ్డి కుమారుడు. అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి ద్వారా ఈ నగదు అంతిమ లబ్ధిదారుడికి చేరేదని.. ఇప్పటికే సిట్ గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రధాన భూమిక మాత్రం జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి పోషించినట్లు ప్రచారం నడుస్తోంది.
* మద్యం వ్యాపారంలో ఆరితేరి..
అనిల్ రెడ్డి వ్యాపారంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు సమాచారం. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసేవారని.. అందుకే ఏపీలో మద్యం వ్యాపారంలో ఆయనను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో నివాసం ఉండే అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలు సైతం చూస్తుంటారని సమాచారం. కెసిపిసి, ప్రతిమ వంటి సంస్థలను ఏర్పాటు చేసి వైసిపి హయాంలో ఇసుక దోపిడీకి సైతం పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర తేలడంతో అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత విచారణ చేసి.. పక్కా ఆధారాలతో బోనులో నిలబెడతారని తెలుస్తోంది. అయితే జగన్ కుటుంబ సభ్యులను టచ్ చేయడం ద్వారా.. తరువాత అరెస్టు ఎవరనేది పూర్తిగా స్పష్టత ఇవ్వనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అదే జరిగితే పెను సంచలనమే.