Daytime napping side effects: పగటి పూట కునుకు తీయడం చాలా మందికి సహజ అలవాటు. ముఖ్యంగా భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే శరీరానికి తేలికగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొందరు నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు మితిమీరితే ఆరోగ్యానికి మేలు కంటే నష్టం ఎక్కువ అవుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వయస్సు పెరిగిన వారిలో ఇది మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశంగా మారింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
అమెరికాలోని Rush University నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. 55 ఏళ్లు పైబడిన వెయ్యికి పైగా వ్యక్తులను సుమారు 8.3 సంవత్సరాల పాటు పరిశీలించారు. ఈ ఆధ్యయనంలో పాల్గొన్నవారికి చేతికి ధరించే ప్రత్యేక పరికరాలను ఇచ్చారు. ఆ తరువాత వారి కదలికలు, నిద్ర, విశ్రాంతి అలవాట్లను నిరంతరం రికార్డు చేశారు. ఈ విధంగా పొందిన డేటాతో వారి రోజువారీ జీవనశైలిని విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో బయటపడిన విషయమేంటంటే.. పగటి పూట ఎక్కువసేపు కునుకు తీసుకునే వారిలో మరణ ముప్పు పెరుగుతుందని తేలింది. ప్రతి అదనపు గంట కునుకు తీసుకుంటే సుమారు 13 శాతం వరకు మరణ ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. అంటే ఒకటి రెండు నిమిషాల విశ్రాంతి కాకుండా, గంటల కొద్దీ నిద్రపోవడం ప్రమాదకరంగా మారవచ్చు.
అదేవిధంగా రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు కునుకు తీసుకునే అలవాటు ఉన్నవారిలో కూడా ప్రమాదం పెరుగుతుంది. ప్రతి అదనపు నాప్‌తో దాదాపు 7 శాతం వరకు ముప్పు పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది శరీరంలో ఏదో లోపం లేదా అలసటను సూచించే సంకేతం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం సమయంలోనే కునుకు తీసుకునే వారిలో ప్రమాదం మరింత ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఉదయం సమయంలో శరీరం యాక్టివ్‌గా ఉండాలి. అయితే ఆ సమయంలోనే నిద్ర రావడం అనేది ఆరోగ్య సమస్యల సంకేతంగా భావిస్తున్నారు. ఇది హృదయ సంబంధిత వ్యాధులు, మెటబాలిక్ సమస్యలు లేదా నిద్రలేమి వంటి సమస్యల వల్ల రావచ్చు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. పగటి పూట వచ్చే అధిక నిద్రమత్తు అనేది చాలా సార్లు తెలియని ఆరోగ్య సమస్యల సూచిక. ఉదాహరణకు, Sleep Apnea, డిప్రెషన్, డయాబెటిస్, గుండె సమస్యలు వంటి వ్యాధులు ఉన్నప్పుడు శరీరం అలసటగా అనిపించి తరచుగా కునుకు తీసుకోవాలనిపిస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో మరణ ముప్పును పెంచే అవకాశం ఉంది. అయితే నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. రోజుకు 20 నుంచి 30 నిమిషాల వరకు తీసుకునే చిన్న నాప్ శరీరానికి మేలు చేస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ దీన్ని గంటలకొద్దీ నిద్రగా మార్చితే మాత్రం ప్రమాదం మొదలవుతుంది.
పగటి పూట కునుకు అలవాటు ఉంటే దాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఎక్కువగా నిద్ర రావడం, తరచుగా కునుకు అవసరం అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన నిద్రపాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.