Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరోలలో యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు విశ్వక్ సేన్(Vishwak Sen). ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన విశ్వక్ సేన్ తొలిసినిమాతోనే యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పటి నుండి ఆయన యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంటూ తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి, కొన్ని సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అలా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘లైలా’. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం మాత్రమే కాదు, విశ్వక్ సేన్ పరువు మొత్తం తీసేసింది. ఈ సినిమాకు అతను ఎదురుకున్న విమర్శలు గతంలో ఏ చిత్రానికి ఎదురుకోలేదు. బహుశా భవిష్యత్తులో కూడా అలాంటి విమర్శలు విశ్వక్ సేన్ చూడకపోవచ్చు. ఆ రేంజ్ లో ఛీత్కారాలు అందుకోవాల్సి వచ్చింది.
విశ్వక్ సేన్ కి ఎన్టీఆర్(Junior NTR), బాలకృష్ణ(Nandamuri Balakrishna) లతో ఎంత సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలయ్య అయితే తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడిగా విశ్వక్ ని చూస్తాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే విశ్వక్ సేన్ ని తన సొంత తమ్ముడిలాగా భావిస్తాడు. అయితే లైలా సినిమా విడుదలయ్యాక వీళ్ళిద్దరూ తనకు ఫోన్లు చేసి బాగా తిట్టారని, ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దని గట్టిగా మందలించారని విశ్వక్ సేన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన హీరో గా నటించిన ‘ఫంకీ’ మూవీ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో ఈ విషయాలను పంచుకున్నాడు. నా జీవితం లో నా తల్లిదండ్రుల తర్వాత నేను బాలయ్య, ఎన్టీఆర్ సలహాలకు ఎంతో విలువ ఇస్తాను అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
ఇక ఆయన హీరో గా నటించిన ‘ఫంకీ’ మూవీ విశేషాల్లోకి వెళ్తే, ఈ చిత్రానికి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ KV దర్శకత్వం వహించాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనుదీప్ నుండి ఎలాంటి కామెడీ పంచులు ఆశిస్తామో, ఈ చిత్రంలో అవన్నీ ఉన్నట్టుగా అనిపించింది. ఇకపోతే ఈ చిత్రం లో విశ్వక్ సేన్ మూవీ డైరెక్టర్ గా నటిస్తున్నాడు. అదే విధంగా హీరోయిన్ కాయదు లోహర్ నిర్మాత కమ్ హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి మధ్య జరిగే ఫన్ బాగా పేలినట్టుగా అనిపించింది ట్రైలర్లో. చూస్తుంటే ఈ సినిమా విశ్వక్ సేన్ కి భారీ కం బ్యాక్ లాగానే అనిపిస్తుంది, చూడాలి మరి ఆయన అదృష్టం ఫిబ్రవరి 13న ఎలా ఉండబోతుంది అనేది.