Celebrity Weddings: భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. వివాహ క్రతువును మన పెద్దలు గొప్పగా నిర్వహిస్తుంటారు. వివాహ వేడుకను అత్యంత ఆడంబరంగా జరుపుతుంటారు. ఎందుకంటే మనదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత బలంగా ఉంటుంది. వివాహం ద్వారానే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. అందుకోసమే మన పూర్వికులు వివాహ వ్యవస్థను బలంగా నిర్మించారు. పెళ్లంటే ఎవరికైనా ఒక జీవితకాలం జ్ఞాపకం. అందుకే దానిని గొప్పగా చేసుకుంటారు. మనదేశంలో ఈ నలుగురు సెలబ్రిటీలు మాత్రం పెళ్లికి సరికొత్త అర్థం చెప్పారు.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్
సెలబ్రిటీలు వివాహం చేసుకునే క్రమంలో ఆడంబరాలకు పోతుంటారు. కానీ, సైఫ్ అలీ ఖాన్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.. తన వివాహం కోసం సైఫ్ తన అమ్మమ్మ, భోపాల్ నగరానికి చెందిన బేగం సజిదా సుల్తాన్ కు చెందిన బంగారు రంగు షరారా ను కరీనాకపూర్ కు అందించారు. వివాహంలో కరీనాకపూర్ దానిని ధరించారు. భారతీయ సంపన్న వర్గాలలో ఇది సరికొత్త అధ్యాయంగా నిలిచిపోయింది. నిజమైన వారసత్వాన్ని కొనసాగించాలంటే కాపాడుకోవాలని.. దానిని డబ్బుతో కొనలేమని సైఫ్ నిరూపించారు.
దీపిక, రణ్ వీర్ సింగ్
వివాహ సమయంలో దీపిక తన తల్లికి బహుమతిగా వచ్చిన కాంజీవరం పట్టుచీరను ధరించారు. ఆ చీర మీద మైసూరు రాజా చిహ్నంలోని రెండు తలల పౌరాణిక పక్షి అయిన గండబేరుండ ను చిత్రీకరించారు. ఇది కేవలం పెళ్లికూతురికి చేసిన అలంకరణ మాత్రమే కాదు. అది ఒక రకమైన సాంస్కృతిక ప్రకటన. దేశవ్యాప్తంగా చేనేత చీరలను మహిళలు ఎందుకు ధరించాలో దీపిక తన వివాహం ద్వారా చాటిచెప్పారు.

రణ్ బీర్ కపూర్, ఆలియా భట్
సంపన్న కుటుంబాలకు చెందిన వారైనప్పటికీ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ తమ వివాహ విషయంలో నిరాడంబరతను ప్రదర్శించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ను పక్కనపెట్టి ముంబైలో.. తమ ఇంట్లో ఉన్న బాల్కనీలో పెళ్లి చేసుకున్నారు. వివాహ వాతావరణాన్ని ఆడంబరంగా కాకుండా.. సాధారణంగా జరిపించారు. సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన చీరను ఆలియా ధరించారు. ఆ చీరలో ఆమె దేవకన్య లాగా మెరిసిపోయారు.

కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్ర
వీరిద్దరి వివాహం రాజస్థాన్లో జరిగింది. ఈ ప్రాంతంలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది. వధూవరులు భారీగా డిజైన్ చేసిన వస్త్రాలను ధరిస్తుంటారు. కానీ సిద్ధార్థ, కియారా సరికొత్త పద్ధతి ఎంచుకున్నారు. రాజస్థాన్లో వివాహం జరుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ డిజైన్ లో రూపొందించిన పింక్ లెహంగా ధరించారు. అందులో రోమన్ గోపురాలు.. ఇతర స్తంభాలను రూపొందించారు. లేత గులాబీ రంగుకు.. అత్యంత ప్రకాశవంతమైన జాంబియన్ పచ్చలను అద్దడంతో అద్భుతమైన రంగు వచ్చింది. ఆ వస్త్రాలలో యువరాణి లాగా కియారా కనిపించింది. సిద్ధార్థ రాకుమారుడిలాగా కనిపించారు. వీరిద్దరూ ధరించిన వస్త్రాలు చాలా రోజులపాటు మీడియాలో ప్రధాన వార్తా అంశాలుగా కనిపించాయి.