YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్, విషయంలో ఒకలా.. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో మరోలా వ్యవహరిస్తోంది. అడ్డగోలుగా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేపట్టారని గగ్గోలు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తోంది. ఇది అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకే అని విమర్శలు చేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇలా భిన్న వైఖరితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లడం పై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ఓట్లు తొలగించారని చెబుతున్న ఆ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవాలని చూడడం హాట్ టాపిక్ అవుతోంది.
* పూర్తయిన సర్ ప్రక్రియ..
రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి ఓట్ల తొలగింపు తో పాటు రెండు చోట్ల ఓట్లు కలిగిన బినామీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపడుతోంది. ఇప్పటికే ఏపీలో ఈ ప్రక్రియ పూర్తయింది. సరైన గుర్తింపు, ధ్రువీకరణలేని 60 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తుంది అనేది ఆ పార్టీ నుంచి వచ్చిన ఆరోపణ. దీనిపై అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కిందిస్థాయి నేతల వరకు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
* పాత జాబితాపై వద్దంటూ కోర్టుకు..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటనకు సిద్ధమయింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తక్షణం ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. దానికి కారణం పాత ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించడమే. ఒకవైపు సర్ లో 60 లక్షలకు పైగా ఓట్లు తొలగింపు అనేది అక్రమమని చెబుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పాత జాబితా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటే అడ్డుకుంటుంది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడేమో 60 లక్షల ఓట్లు అక్రమ తొలగింపు అని చెబుతోంది. అదే ఓట్లతో కలిపి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటే దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా వైసిపి సెల్ఫ్ గోల్.