Vijayawada Mayor : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. దీంతో అధికార కూటమిలో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థ తో కలిసి సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమారుడి పేరును పరిశీలించాలని బయోడేటా సమర్పించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ఇద్దరు కుమారులతో బోండా ఉమామహేశ్వరరావు చంద్రబాబుతో పాటు లోకేష్ ను కలిసారు. ఇప్పుడు మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* సీనియర్ నాయకుడు..
కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మాత్రం తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఐదేళ్లపాటు పార్టీలో చాలా దూకుడుగా వ్యవహరించి అప్పటి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు ఆయనపై దాడి ప్రయత్నం కూడా జరిగింది. అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచేసరికి మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. దక్కకపోయేసరికి బాధపడ్డారు. విస్తరణలో సైతం చోటు దక్కదని తెలిసి ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసిపి మాజీమంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్నారు. అది చాలా వివాదాస్పదంగా మారింది. పార్టీ నోటీసులు ఇచ్చే పరిస్థితికి చేరుకుంది.
* అప్పట్లోనే బలమైన హామీ..
అప్పట్లో పార్టీ హై కమాండ్ నుంచి నోటీసులు అందుకున్న బోండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తర్వాత తన ఇద్దరి కుమారులతో కలిసి అధినేత చంద్రబాబును కలుసుకున్నారు. అప్పట్లోనే చంద్రబాబు నుంచి బలమైన హామీ తీసుకున్నట్లు ప్రచారం నడిచింది. కుమారుడు సిద్ధార్థ కు మేయర్ పదవి ఇవ్వాలని అప్పట్లోనే విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి బయోడేటా తో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే యువనేత బోండా సిద్ధార్థ విజయవాడ మేయర్ అభ్యర్థి కావడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..