Srikakulam politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల పరిస్థితి మరీ వింతగా ఉంది. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ప్రాధాన్యత లేకుండా పోయారు. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తమ్మినేని సీతారాంకు ఇంచార్జ్ పదవి లేదు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై కుటుంబ, వ్యక్తిగత వివాదాలతో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. తమ్మినేని పార్టీలో ప్రాధాన్యత కోసం ప్రయత్నిస్తుండగా.. దువ్వాడ శ్రీనివాస్ తిరిగి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వర్కౌట్ కాకపోవడంతో ఇద్దరూ కలిసి ఇప్పుడు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. అక్కడ వారికి పార్టీలకంటే అటు ధర్మాన, ఇటు కింజరాపు కుటుంబాలే ప్రత్యర్థులు. వారిని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వారు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
తమ్మినేని ని తప్పించి..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తమ్మినేని సీతారాం గెలుస్తూ వస్తున్నారు ఆ పార్టీ తరపున. 1999 వరకు ఆ పార్టీ ఎమ్మెల్యే గానే గెలిచారు. 2004లో టిడిపి తరఫున పోటీ చేసి తొలిసారిగా ఓడిపోయారు తమ్మినేని. తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ తరఫున రెండో సారి పోటీ చేసి గెలిచారు. 2024 లో మాత్రం ఓడిపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కకు తప్పించి ద్వితీయ శ్రేణి నాయకుడైన చింతాడ రవికుమార్ కు ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు. అప్పటినుంచి నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు.
ఆ రెండు కుటుంబాలపై ప్రతీకారం..
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ కుటుంబ వ్యవహారాలతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. మూడుసార్లు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేసి ఓటమి చవిచూశారు. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. అయితే తాను పార్టీలోకి రాకుండా ధర్మాన బ్రదర్స్ అడ్డుకుంటున్నారన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణ. మరోవైపు కింజరాపు కుటుంబీకులు ప్రత్యర్ధులుగా ఉండడంతో వారు ధర్మాన సోదరులతో కలిసి రాజకీయం చేస్తున్నారని తరచు వ్యాఖ్యానిస్తుంటారు. అందుకే తన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత తమ్మినేని తో చేతులు కలిపి.. సరికొత్త రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఒకవేళ తమ్మినేనికి టిక్కెట్ రాకపోయినా.. దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు తొలగించకపోయినా.. వారిద్దరూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వారి నిర్ణయంతో టిడిపి కంటే వైసీపీకి నష్టం ఎక్కువ. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.