India Millionaires: భారత దేశం ప్రపంచంలో టాప్–5 సంపన్న దేశాల జాబితాలో చేరింది. గడిచిన పదేళ్లలో దేశ సంపద గణనీయంగా పెరగిందని గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో 3వ స్థానానికి చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో భారత దేశంలోనూ సంపన్నులు భారీగా పెరుగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో దేశంలో కోటీశ్వరుల సంఖ్య 300 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇవన్నీ ఊహించి చెప్పేవి కావు. కేంద్రమే స్వయంగా ప్లామెంటులో వెల్లడించింది. ఐటీ రిటర్న్స్ ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించింది. అసెస్‌మెంట్ ఇయర్ 2025–26లో గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా నమోదు చేసుకున్న వ్యక్తుల సంఖ్య 576కు చేరుకుంది. ఇది గతేడాది (2024–25) 415 ఉండగా, ఐదేళ్ల క్రితం (2021–22) కేవలం 142 ఉంది. గడిచిన 2022–23లో 301, 2023–24లో 284గా ఉండి, తర్వాత మళ్లీ పైకి ఎగిరింది. ఐదేళ్లలో 300 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది.
సంఖ్యలు చెప్పే కథ
ఈ పెరుగుదల కేవలం గణాంకాలు మాత్రమే కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఎగువ స్థాయి ఆదాయం ఎలా కేంద్రీకృతమవుతోందో చూపిస్తుంది. స్టార్టప్‌లు, టెక్, ఫైనాన్స్, ఇక్విటీ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో విలువ సృష్టి, క్యాపిటల్ గెయిన్స్, హై–వాల్యూ లావాదేవీలు ఇలాంటి ఉన్నత ఆదాయాలకు దోహదం చేస్తున్నాయి. అదే సమయంలో టాక్స్ కంప్లయన్స్ మెరుగుపడడం, డిజిటల్ ట్రాకింగ్, ఐటీ విభాగం పర్యవేక్షణ కూడా ఈ సంఖ్యలు పెరగడానికి కారణం కావచ్చు. అయితే కేంద్రం తీసుకున్న చర్యలతో గతంలో నివేదించని ఆదాయం ఇప్పుడు రికార్డుల్లోకి వస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోటీశ్వరుల సంఖ్యపై అనిశ్చితి..
ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. ఈ 576 మంది కోటీశ్వరులు కాదు. వారు సంవత్సరానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం నమోదు చేసిన వ్యక్తులు. నిజమైన కోటీశ్వరులు (సంపద విలువ రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ) సంఖ్య దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో సంపదపై అధికారిక, వ్యవస్థీకృత డేటా లేదు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆదాయాన్ని మాత్రమే చూపిస్తాయి. ఆస్తులు, లయబిలిటీలు, నికర సంపదపై సమగ్ర సమాచారం అందుబాటులో లేదు. అందుకే దేశంలో నిజంగా ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారన్నది ఇప్పటికీ అనిశ్చితమే.
ఆర్థిక వృద్ధా.. అసమానతా..
ఈ పెరుగుదలను రెండు కోణాల నుంచి చూడవచ్చు. ఒకవైపు ఇది ఆర్థిక వృద్ధి, వ్యవసాయేతర రంగాల విస్తరణ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పెట్టుబడులు పెరగడానికి సంకేతం. టాప్ ఎండ్‌లో ఆదాయం పెరగడం అంటే పన్ను రాబడి కూడా పెరగవచ్చు, ప్రభుత్వ వనరులు పెరగవచ్చు. మరోవైపు, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో కేవలం కొన్ని వందల మంది మాత్రమే ఇంత భారీ ఆదాయం సాధించడం ఆదాయ అసమానతన ఎత్తి చూపుతుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆదాయాలు ఎలా మారుతున్నాయన్నది కూడా తెలుసుకోవాలి. కేంద్రం వెల్లడించాలి.
రాబోయే సంవత్సరాల్లో టాక్స్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారితే, సంపదపై కూడా కొంత సమాచారం అందుబాటులోకి రావచ్చు. అప్పుడు కోటీశ్వరులు అనే పదం ఆదాయం ఆధారంగా కాకుండా నికర సంపద ఆధారంగా మరింత కచ్చితంగా అర్థం చేసుకోవచ్చు.