YSRCP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సోషల్ మీడియాలో బలమైన గ్రూపులు ఉన్నాయి. బలమైన వ్యక్తులు కూడా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. గతంలో జైలుకు వెళ్ళినప్పుడు.. ఇలా అనేక సందర్భాలలో సోషల్ మీడియా వారియర్స్ ఆయనకు అండగా ఉన్నారు. అనేక మాధ్యమాలలో ఆయన వాయిస్ వినిపించేవారు. ఇప్పుడు వారంతా జగన్ కు దూరం జరిగారు. వైసిపికి దండం పెడుతూ వద్దనుకుంటున్నారు.
గతంలో జగన్ కు బలమైన వాయిస్ ఇస్తూ.. టిడిపి.. ఇతర పార్టీలను కేఎస్ ప్రసాద్ అనే విశ్లేషకుడు ఎండగట్టేవారు. అంతేకాదు పాషా వంటి వారు కూడా జగన్ కు అనుకూలంగా ఉండేవారు. వైసిపి వాయిస్ వినిపించేవారు. కొంతకాలం వారికి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. గుర్తింపు కూడా లభించడం లేదు. దీంతో వారు వైసిపికి దూరంగా జరిగిపోయారు. ఇప్పుడు వైసీపీ తీరును వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. సంవత్సరాలుగా వైసిపికి పనిచేస్తూ.. జగన్ వాయిస్ వినిపిస్తూ పనిచేసిన వారికి గుర్తింపు లేదని ప్రసాద్.. పాషా వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో ఇంతలా పనిచేస్తున్న వారి గురించి జగన్ కు తెలియదు. వాస్తవానికి జగన్ సోషల్ మీడియాను చూడరట. కనీసం ప్రధాన మీడియాని కూడా అంతగా పట్టించుకోరట. కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇటువంటి వారిని గుర్తించకపోవడంతో.. వారి త్యాగాలకు అర్థం లేకుండా పోయింది.
ప్రసాద్.. పాషా విషయం మాత్రమే కాదు.. శ్రవణ్ వ్యవహారాలను కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. మొన్నటిదాకా ఆయన వైసిపి వ్యవహారాలకు అనుకూలంగా నడుచుకునేవారు. ఇప్పుడు శ్రవణ్ కూడా వైసిపికి దూరమయ్యారు. ఆయనకు పబ్లిసిటీ ఎక్కువైందని సాక్షిలో కవరేజ్ ఇవ్వడం తగ్గించారు. రేపటి నాడు ఆయన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితే ఇబ్బంది ఎదురవుతుందని వైసిపి ఆయనకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. శ్రావణ్ వ్యవహార శైలి జగన్ కు నచ్చకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.
ఏ పార్టీ అయినా సరే అధికారానికి దూరంగా ఉన్నప్పుడు.. లోపాలను సవరించుకోవాలి. ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. తమ వాయిస్ వినిపించే వారిని గౌరవించాలి. వారికి తోడ్పాటు కూడా అందించాలి. 2019 నుంచి 2024 వరకు టిడిపి చేసింది ఇదే. అందువల్లే ఆ పార్టీ సోషల్ మీడియాలో మరింత బలోపేతం అయింది. కానీ ఈ విషయాన్ని గుర్తించడంలో వైసిపి విఫలమైంది. అందువల్లే ఆ పార్టీకి.. దానికి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియాకు ఇప్పటిదాకా పనిచేస్తున్న వారంతా దండం పెట్టి వెళ్లిపోతున్నారు. ఇప్పటికీ కూడా జగన్ గుర్తించకపోవడం.. కనీసం వారిని దగ్గర తీయకపోవడం అత్యంత బాధాకరం.