Sushmita konidela: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి. క్షేత్రస్థాయిలో జరిగింది ఒకటి. చివరికి ఆయన కోరుకున్నది జరగలేదు. అనుకున్నది నెరవేరలేదు. అనేక రకాల ఒత్తిళ్ల వల్ల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది. చివరికి కేంద్రమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చిరంజీవి మాదిరిగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రారంభించిన తొలి రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన టిడిపికి, బిజెపికి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. మొత్తంగా ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఏపీ రాష్ట్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
పవన్ కళ్యాణ్ మంత్రిగా.. నాగబాబు కేబినెట్ హోదా ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో ముచ్చటగా మూడవ పదవి వచ్చి చేరింది. చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమితులయ్యారు. ఇటీవల తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖ నియమితులయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సుస్మితకు ఈ పదవి లభించడం విశేషం. సుస్మిత తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటారు.
రాజకీయంగా కూడా ఆమెకు ఎదగాలని కోరిక ఉందని.. ప్రచారం జరుగుతుంది. దుర్గగుడి అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన తర్వాత.. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. కాకపోతే ఇది ఇప్పటికీ ప్రచారం గానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో వాస్తవరూపం దాల్చే అవకాశం ఉందని.. చిరంజీవి సాధించలేని కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చారని.. దానిని సుస్మిత మరింత పరిపుష్టం చేస్తారని మెగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈపదవిలో ఉన్నందుకు సుస్మితకు ఎటువంటి ప్రయోజనాలు లభించవు. దుర్గ గుడిని మరింత డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రతువులో పాలుపంచుకునే అవకాశం ఈ పదవి ద్వారా సుస్మితకు లభించబోతోంది. సాక్షి ఆరోపిస్తున్నట్టు.. వైసీపీ చెబుతున్నట్టు ఈ పదవి ద్వారా సుస్మితకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లభించదు.