Kinetic DX EV : భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కైనెటిక్ ఈవీ తన DX సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. DX+ టాప్-స్పెక్ వేరియంట్‌కు ఇప్పుడు 3.1 kWh బ్యాటరీతో కూడిన కొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.19 లక్షలుగా నిర్ణయించారు. ఎక్కువ రేంజ్ కావాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.
132 కిమీ వరకు రేంజ్
కొత్త కైనెటిక్ DX+లో 3.1 kWh LFP బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీతో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 132 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటివరకు DX+లో అందుబాటులో ఉన్న 2.6 kWh బ్యాటరీ వేరియంట్ గరిష్ఠంగా 105 కిలోమీటర్ల రేంజ్‌ను అందించేది. అంటే కొత్త వేరియంట్‌లో రేంజ్ సుమారు 27 కిలోమీటర్లు పెరిగింది.
అయితే ఈ అదనపు రేంజ్ కేవలం పెద్ద బ్యాటరీ కారణంగా మాత్రమే రాలేదు. కొత్త DX+ 3.1 kWh వేరియంట్‌లో మోటార్‌ను కొంత డీ-ట్యూన్ చేశారు. ఇది గరిష్ఠంగా 3.8 kW పీక్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు DX+ 2.6 kWh వేరియంట్‌లోని మోటార్ 4.78 kW పీక్ పవర్‌ను అందిస్తుంది. అంటే కొత్త వేరియంట్‌లో పవర్ తగ్గినా, రేంజ్ మాత్రం గణనీయంగా పెరిగింది.
రెండు రైడింగ్ మోడ్స్ మాత్రమే
DX+ 3.1 kWh వేరియంట్‌లో రేంజ్, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టర్బో మోడ్‌ను అందించలేదు. ఆసక్తికరంగా, చిన్న 2.6 kWh బ్యాటరీతో వచ్చే బేస్ DX వేరియంట్‌లో కూడా టర్బో మోడ్ అందుబాటులో ఉంది.
కొత్త వేరియంట్‌ను రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే, వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగా కైనెటిక్ DX+లోని రెట్రో టచ్‌ను కొనసాగించారు.
ఫీచర్లకు కొదవ లేదు
కైనెటిక్ DX+ 3.1 kWhలో మెటల్ బాడీ, LED లైటింగ్, 8.8 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 37 లీటర్ల బూట్ స్పేస్, కీ-లెస్ గో, పాస్‌వర్డ్ ఆధారిత ఇగ్నిషన్, Easy Flip ఫుట్‌రెస్ట్స్, క్రూయిజ్ కంట్రోల్, టెలిమాటిక్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కైనెటిక్ ఈవీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ అజింక్య ఫిరోడియా మాట్లాడుతూ, కొత్త 3.1 kWh LFP బ్యాటరీ ద్వారా అధిక రేంజ్, మెరుగైన పనితీరు, రోజువారీ ప్రయాణాల్లో మరింత నమ్మకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ వేరియంట్‌ను తీసుకొచ్చామని తెలిపారు.
ఇదిలా ఉంటే, కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకెళ్లేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. భారతదేశంలో తయారు చేసిన DX స్కూటర్‌ను ఏడు దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక రేంజ్ కలిగిన కొత్త DX+ వేరియంట్ కైనెటిక్‌కు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ మరింత ఆకర్షణీయమైన ఉత్పత్తిగా మారే అవకాశం ఉంది.