PM Modi: ప్రపంచ రాజకీయాలను, సైనిక వ్యూహాలను మార్చేసిన రెండు ఘటనలు ఇటీవల కాలంలో స్పష్టంగా కనిపించాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఘర్షణ. ఈ రెండూ సంప్రదాయ యుద్ధ భావనలను తలకిందులు చేశాయి. గతంలో యుద్ధాలు వారాలు లేదా నెలల్లో ముగుస్తాయని అనుకున్నప్పటికీ, ఇప్పుడు అవి సంవత్సరాలపాటు కొనసాగవచ్చని నిరూపితమైంది. ఇరాన్ ఏకకాలంలో అనేక ముందువరుసల్లో పోరాడుతూ నాలుగు నెలలకు పైగా నిలబడటం ఇంకో ఉదాహరణ. ఈ పరిణామాలు భారత సైన్యానికి, పాలకులకు గొప్ప పాఠాలు నేర్పుతున్నాయి.
ఆయుధ సరఫరా కీలకం..
దీర్ఘకాల యుద్ధంలో విజయం కేవలం ధైర్యం లేదా వ్యూహాలపైనే ఆధారపడదు. నిరంతరం ఆయుధాలు అందుబాటులో ఉండటమే కీలకం. రోజువారీ దాడులకు ఎంత పరిమాణంలో మందుగుండు, క్షిపణులు, డ్రోన్లు అవసరమో లెక్కించుకోవాలి. స్టాక్‌లు తగ్గితే యుద్ధం కొనసాగడం కష్టం. 1965 యుద్ధంలో లాహోర్ వైపు ముందుకు సాగలేకపోవడానికి ప్రధాన కారణం ఆయుధాల కొరతే. ఆ పరిస్థితి తాష్కెంట్ ఒప్పందానికి దారితీసింది. ఇలాంటి చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలంటే, ఆయుధ ఉత్పత్తి, నిల్వలు, సరఫరా గొలుసు బలంగా ఉండాలి.
ఆత్మనిర్భర్ వైపు…
భారత్ ఈ పాఠాలను గ్రహించి విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. వేగవంతమైన ఉత్పత్తికి ప్రైవేట్ పాల్గొనడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దీని ఫలితంగా డ్రోన్ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వందలాది స్టార్టప్‌లు దాడి డ్రోన్లు, నిఘా డ్రోన్లు తయారు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో బెంగళూరు సంస్థలు తయారు చేసిన డ్రోన్లు ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాయి. ఇది స్వదేశీ సామర్థ్యం పెరుగుతున్నదని సూచిస్తోంది.
బలమైన వ్యవస్థ..
కొన్ని కీలక ఆయుధాలు అగ్ని సిరీస్, బ్రహ్మోస్, సముద్ర ఆధారిత క్షిపణులు ప్రభుత్వ సంస్థల పరిధిలోనే ఉన్నాయి. అయితే ఆకాశ్ న్యూ జనరేషన్, అస్త్ర, నాగ్, ప్రళయ్ వంటి వ్యవస్థల్లో ప్రైవేట్ సంస్థల పాత్ర పెరుగుతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, భుజాలపై మోసే క్షిపణులు కూడా ఈ భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతున్నాయి. దీని వల్ల డిఫెన్స్ ఉత్పత్తి వేగం పెరిగింది. అనేక కొత్త కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఈ మార్పు మరింత బలపడుతోంది.
రాబోయే కాలంలో యుద్ధాలు సుదీర్ఘంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆయుధ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణలు నిరంతరం పెరగాలి. కేవలం ఆయుధాల సంఖ్య మాత్రమే కాదు, వాటిని నిరంతరం సరఫరా చేసే వ్యవస్థ, నాణ్యత నియంత్రణ, రక్షణ పరిశోధన కూడా అవసరం. భారత్ ఇప్పటికే సరైన దిశలో అడుగులు వేస్తోంది. ప్రైవేట్–పబ్లిక్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తే, దీర్ఘకాల యుద్ధాల సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుంది.