Jana Sena Party: జనసేన పార్టీని క్రమశిక్షణగా నడపాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. జనసైనికులు సైతం అధినేత ఆదేశాలని తప్పకుండా పాటిస్తారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతోంది అదే. టిడిపి తో పొత్తు అనేసరికి అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి పార్టీ శ్రేణుల నుంచి. అయినా వారిని ఒప్పించి నప్పించగలిగారు పవన్. అయితే ఇప్పటివరకు పవన్ మాటలు విన్న జనసైనికులు.. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి పదవులపై మమకారం పెంచుకున్నారు. అందుకే ఎక్కడికి అక్కడే భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం,, బిజెపితో విభేదిస్తున్నారు. కొన్నిచోట్ల జనసేనలో సైతం విభేదాలు ఉన్నాయి. తాజాగా మచిలీపట్నంలో అయితే వీధి పోరాటానికి దిగారు. పూలు చల్లిన కొద్దిసేపటికే.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నంత పని చేశారు. మచిలీపట్నం మేయర్ పదవి విషయంపై పార్టీలోనే రెండు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. తాజాగా వారి మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
* మచిలీపట్నం మేయర్ పదవి జనసేనకు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మచిలీపట్నం మేయర్ పదవి జనసేనకు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే మేయర్ సీటు దక్కిందో లేదో కానీ.. ఇప్పుడు ఆ పదవి పై ఆకాంక్ష పెంచుకున్న నాయకులు, వారి అనుచరులు వీధికి ఎక్కారు. రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపై, ప్రైవేటు వేడుకల్లో పరస్పరం దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ఇలా కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో సైతం వెలుగులోకి వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాటిని వైరల్ చేస్తున్నారు.
* ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం..
మచిలీపట్నం మేయర్ స్థానంపై చాలామంది జనసేన నేతలు కన్నేసారు. మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ ఉండగా అతని అనుచరుడు గడ్డం రాజు మేయర్ పదవి ఆశిస్తున్నారు. జనసేన మరో నేత కుట్టే వెంకట్రావు సైతం ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్కు హాజరైన సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో ఇరు వర్గాల నాయకులు విచక్షణ మరిచి పరస్పరం తోపులాటకు దిగారు. భౌతిక దాడులు చేసుకున్నంత పని చేశారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో జనసేన నేతలు ఇలా తన్నులాటకు దిగడంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు వచ్చి సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ ఘటనపై జనసేన నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. చూడాలి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయో..
View this post on Instagram