GVMC Mayor : ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అతిపెద్దది. 125 డివిజన్లను పునర్వ్యవస్థీకరిస్తూ విస్తరణకు సిద్ధపడుతోంది విశాఖ నగరపాలక సంస్థ. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో విస్తరించి ఉంది. అందుకే ఇక్కడ మేయర్ పీఠం అంటే దాదాపు క్యాబినెట్ మంత్రితో సమానం అన్నమాట. ఏడాదికి ఐదు ఆరు వేలు బడ్జెట్ ఉండే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం అంటే చాలా పెద్ద పదవి అని చెప్పవచ్చు. అందుకే ఈ మేయర్ పీఠంపై ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీలు పూర్తిగా దృష్టిపెట్టాయి. 1979 తర్వాత ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని మూడు పార్టీలు ఆశిస్తున్నాయి. దీంతో కూటమిలోని మూడు పార్టీల మధ్య మేయర్ పదవి కోసం గట్టి పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. కానీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఒక సమన్వయానికి రానున్నారు.
* బిజెపి ఆరాటం..
ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ మేయర్ పీఠాన్ని తమకు విడిచి పెట్టాలన్న విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 1979లో కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరి… ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పదవిని పొందింది భారతీయ జనతా పార్టీ. అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించలేదు. ఆ సమయంలో జనసంఘ్ రూపంలో ఉన్న బిజెపికి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉండేవారు. ఆ సమయంలోనే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బిజెపి అభ్యర్థి గెలిచారు. ఇప్పటికీ బీజేపీకి విశాఖ నగరంలో మంచి పట్టు ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ సీటు బిజెపికి ఇస్తారని ప్రచారం నడిచింది. అందుకే ఈసారి మేయర్ పీఠం తమకు విడిచి పెట్టాలన్న డిమాండ్ బిజెపి నుంచి వచ్చే అవకాశం ఉంది.
* జనసేన సైతం..
గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు అంతగా బలం ఉండే జిల్లా ఏదైనా ఉంటే అది విశాఖ. మొన్నటి ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది జనసేన విశాఖ జిల్లా నుంచి. అందులోనూ గ్రేటర్ పరిధిలో ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే మేయర్ పీఠాన్ని జనసేన ఆశించే అవకాశం ఉంది. జనసేనకు బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. గ్రేటర్ లో ఆ సామాజిక వర్గానికి పట్టు ఎక్కువ. అందుకే మేయర్ పీఠంపై జనసేన ఇప్పటినుంచి గురిపెట్టినట్లు తెలుస్తోంది.
* గంటా కుమారుడి కోసం..
మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పట్టు సాధిస్తున్నా.. గ్రేటర్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పట్టు చిక్కడం లేదు. మేయర్ పదవి అందని ద్రాక్షగా ఉంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజను మేయర్ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అర్థ బలంతో పాటు అంగ బలం, ఆపై పోల్ మేనేజ్మెంట్ తెలిసిన గంటా శ్రీనివాసరావు అయితే తన కుమారుడ్ని మేయర్ గా అవలీలగా గెలిపించుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.