Tomato Farmers: సాధారణంగా టమాటాలు లేని వంట ఉండదు. అన్ని గంటలకు ఇప్పుడు టమాటా కీలకంగా నిలుస్తూ వస్తోంది. అందుకే దాని ధర ఎంత ఉన్నా కొనాల్సిన అనివార్య పరిస్థితి జనాలకు ఏర్పడింది. అటువంటి టమాటాను ఉచితంగా అందిస్తున్నారు కర్నూలు జిల్లాలో. రైతులే నేరుగా మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి ఉచితంగా అందిస్తుండడం విశేషం. అయితే అదేదో సేవలో భాగం కాదు. కేవలం మద్దతు ధర లేకపోవడంతో చేసేదేమీ లేక ఉచితంగా అందిస్తున్నారు. తిరిగి తీసుకెళ్లలేక పంటను రైతులు తక్కువ ధరకు వదిలించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
* రాయలసీమలో పంట అధికం..
రాయలసీమలో ఎక్కువగా టమాట పండిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో అక్కడ విరివిగా పండుతుంది. అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో పంట పర్వాలేదు. వర్షాలు ఎక్కువగా ఉంటే టమాటా పండదు. అయితే ఇప్పుడు టమాట విపరీతంగా పండడం.. దానికి పెద్దగా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఉచితంగా అందిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో గత రెండు రోజులుగా రైతులు తెచ్చిన టమాట అమ్ముడు కావడం లేదు. అందుకే ఉచితంగా అందిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతులు టమోటాలను కిలో 15 రూపాయల ప్రకారం విక్రయించాలని అధికారులు ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలించారు. అయితే బహిరంగ మార్కెట్లో ధర కిలో సుమారు పది రూపాయలు మాత్రమే ఉండడంతో.. మార్కెట్ యార్డుకు తెచ్చిన టమాట 15 రూపాయలకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు ఆ టమోటాలను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.
* తరలివచ్చిన ప్రజలు..
మార్కెట్ యార్డులో ఉచితంగా టమోటాలను అందిస్తున్నారని ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో పట్టణవాసులు అక్కడకు చేరుకున్నారు. తమకు అందినంతమేరా టమోటాలను తీసుకెళ్లారు. తమ అవసరానికి మించి సంచుల్లో ఎక్కువగా మోసుకెళ్లారు. టమోటాల ధరకు సంబంధించి స్థిరీకరణ లేదు. ఎప్పుడు ఏ ధర ఉంటుందో కూడా చెప్పలేము. ముఖ్యంగా రాయలసీమలో పండే టమాటాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. కానీ ప్రస్తుతం విపరీతమైన వర్షాలు లేకపోవడంతో టమోటాలు పడ్డాయి. ఈ క్రమంలో డిమాండ్ తగ్గి ఇలా పంట చౌకగా మారిపోయింది. కొనుగోలుదారులకు ఉపశమనం అయినా రైతులకు మాత్రం ఇబ్బందికరంగా మారింది.