Hanuman Temple : హైదరాబాద్‌లోని వినోబా నగర్‌లో ఉన్న హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి వరకు భారీ శబ్దంతో సంగీతం వినిపిస్తోందంటూ ప్రముఖ సినీ నటుడు అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. శబ్ద కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అల్లు శిరీష్ తన సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. తాను షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌లో నివసిస్తున్నానని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా వినోబా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో అనుమతించిన డెసిబుల్స్‌కు మించి భారీ శబ్దంతో సంగీతాన్ని రాత్రి 2, 3 గంటల వరకు ప్లే చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై ఇప్పటికే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ తెలిపారు. అయితే గణేశ్ నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నందున సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు సూచించినట్లు పేర్కొన్నారు. అయితే గణేశ్ నిమజ్జనం పూర్తయినప్పటికీ ఆలయంలో భారీ శబ్దంతో సంగీతం ఆగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సొసైటీలో నివసించే పలువురు వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు ఈ శబ్దం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అల్లు శిరీష్ తెలిపారు. ఈ సమస్యపై గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
“దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులను అల్లు శిరీష్ కోరారు. ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చ మొదలైంది. మతపరమైన కార్యక్రమాలు, పండుగల సందర్భంగా భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూనే.. శబ్ద కాలుష్య నిబంధనలు, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అల్లు శిరీష్ చేసిన ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆలయంలో లౌడ్ మ్యూజిక్‌కు సంబంధించి అనుమతులు, నిర్ణీత సమయాలు, శబ్ద పరిమితులు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలపై అధికారులు పరిశీలన చేసే అవకాశం ఉంది.
Respected @hydcitypolice . I'm a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
— Allu Sirish (@AlluSirish) September 27, 2026