Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నం అయ్యింది. మరికొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా వేడుకగా జరపాలని భావిస్తోంది. ఏకంగా 13 వేల మంది గిరిజన కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. మరోవైపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కోసం ప్రధాని మోదీ షెడ్యూల్ అధికారికంగా ఖరారు చేశారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. అధికార యంత్రాంగమంతా విజయనగరంలో ఉండి ఈ ఏర్పాట్లలో తల మునకలైవుంది. ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 4700కు పైగా వాహనాలను సైతం జనాన్ని తరలించేందుకు ఏర్పాటు చేయడం విశేషం.
* మంత్రుల నిత్య పర్యవేక్షణ..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి.. 11 మందితో కూడిన మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో మంత్రుల బృందం ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉంది. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 13వేల మంది గిరిజన కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ప్రదర్శన ఉండనుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదు కానుంది.
* స్వాగతం తో పాటు రోడ్డు షో..
ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టనున్న ప్రధాని నరేంద్ర మోదీని.. వేడుక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు స్వాగతం రోడ్ షో ఉంటాయి. మరో 22 నిమిషాలు ఎయిర్పోర్టులో సందర్శన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఐదు నిమిషాల్లో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం 15 నిమిషాల పాటు విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అక్కడ నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభ వేదిక కు చేరుకుంటారు. దాదాపు గంటన్నర పాటు ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు. ప్రధాని పర్యటన షెడ్యూల్ రెండు గంటల 25 నిమిషాల పాటు కొనసాగనుంది.