Balakrishna: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. జగనేమో వైసీపీ ఎమ్మెల్యేల స్థానాలు మార్చేస్తున్నాడు. కొంతమందికైతే టికెట్ ఇవ్వనని స్పష్టం చేస్తున్నాడు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చి చంద్రబాబు అండ్ కో కు సరైన బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఇక ఇటు చూస్తే చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అధికారానికి ఐదు సంవత్సరాలుగా దూరంగా ఉన్నాడు. గతంలో జరిగిన ఎన్నికల్లో అత్యంత దారుణమైన ఓటమిని మూట కట్టుకున్నాడు. టిడిపిని ప్రారంభించిన నాటి నుంచి ఆ స్థాయిలో ఆ పార్టీ ఎప్పుడూ ఓడిపోలేదు. సరే ఇప్పుడు ఎలాగూ అధికారంలోకి రావాలని కలలుగంటున్నాడు. బహుశా వచ్చే టర్మ్ వరకు అతడి వయసు సహకరించకపోవచ్చు.. అందువల్లే ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని బలమైన అడుగులు వేస్తున్నాడు. ముందుగానే మనం చెప్పుకున్నట్టు మీడియాను మేనేజ్ చేయడంలో దిట్టైన చంద్రబాబు.. ఎన్నికల ముందు బలమైన మైలేజ్ కావాలని కోరుకుంటున్నాడు. ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన ఉదంతం అందులో ఒకటైతే.. మరొకటి డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకం.. ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే..
పెద్ది రామారావు అనే ఒక విశ్లేషకుడు ఎమ్మెస్కో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకాన్ని తెరపైకి తీసుకు వచ్చాడు. సాధారణంగా చంద్రబాబు కు సంబంధించిన పాజిటివ్ ప్రచారంలో మీడియా ఎలాంటి లైన్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి వెలమ+ రెడ్డి ఏలుబడిలో ఉండే టీవీ9 కూడా చంద్రబాబు సేవలో తరిస్తూ ఉంటుంది. అయితే ఈ పుస్తకం ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. దీని ఆవిష్కరణను భారీ ఎత్తున చేయకపోయినప్పటికీ మార్కెట్లో విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఇక దీనికి ప్రమోషన్ కల్పించే కార్యక్రమంలో భాగంగా టిడిపి బ్యాచ్, కొంతమంది కమ్మ సామాజిక వర్గం నాయకులు ఈ పుస్తకాన్ని చదువుతున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు. అందులో ఆ బ్లడ్ బ్రీడ్ బాలయ్య కూడా ఉన్నాడు. ఆయన తన బావ పుస్తకాన్ని చదువుతూ ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో వదిలాడు. సహజంగానే దీనిని టిడిపి అభిమానులు తెగ షేర్ చేశారు. ఇక బాలయ్య బాబు ఎప్పుడైతే ఫోటో పోస్ట్ చేశాడో మిగతా టిడిపి అభిమానులు కూడా అనుసరించడం మొదలుపెట్టారు. పైగా దీనికి ట్యాగ్ లైన్స్ కూడా జత చేయడం ప్రారంభించారు.
అయితే బాలయ్య బాబు తన బావ బాబు పుస్తకం చదువుతున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో వైసీపీ అభిమానులు కూడా రంగంలోకి దిగారు. పైగా జగన్ అధికారంలో ఉండడంతో సోషల్ మీడియా వినియోగంలో వైసీపీ అభిమానులు ముందే ఉన్నారు. ఈ క్రమంలో బాలయ్య బాబు ఫోటోను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. డీ కోడింగ్ ద లీడర్ అని కాకుండా.. వెన్నుపోటు లీడర్ అని పుస్తకం రాస్తే బాగుండేది.. బావ తన తండ్రికి ఎలా వెన్నుపోటు పొడిచాడో బాలయ్య బాబుకు తెలిసేది.. తన తండ్రి స్థాపించిన పార్టీని ఎలా హైజాక్ చేసాడో అర్థమయ్యేది అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.. అంత తదేకంగా చదువుతున్నావు.. ఇంతకీ ఏం అర్థమైంది రాజా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు చంద్రబాబు పుస్తకాన్ని చదువుతున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే సమయంలో తెగ ట్రోల్ కు గురవుతోంది. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో అని ఏపీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.