కష్టపడకుండా సొమ్ము సంపాదించాలి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు గా మారిపోవాలి.. నేటి కాలంలో చాలామంది వ్యవహార శైలి ఇలానే ఉంది. డబ్బులు సంపాదించడానికి ఎటువంటి దుర్మార్గాల కైనా.. ఎటువంటి అన్యాయాలకైనా పాల్పడేందుకు వెనుకంజ వేయడం లేదు. అందువల్లే నేటి కాలంలో దుర్మార్గాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.
అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఏరియాలో ఒక బహుళ అంతస్థుల భవనం ఉంది. ఈ భవనంలో ఒక కుటుంబం నివసిస్తోంది. గత నెలలో ఈ కుటుంబం నివసిస్తున్న ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. దాదాపు 25 లక్షల నగదు.. 317 గ్రాముల బంగారం చోరీ చేశారు.
ఈ చోరీ జరిగిన తర్వాత బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే తెలిసినవాళ్లే ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కాకపోతే వాళ్లు బయటికి రాలేదు.” చోరీకి గురైన డబ్బు.. బంగారాన్ని తిరిగి రాబట్టడానికి బాధిత కుటుంబ సభ్యులు మంత్రాలు చేయడం ప్రారంభించారు. చేతబడి కి దిగారు. ఎలాగైనా సరే ఆ డబ్బు.. బంగారం వారికి తిరిగి వస్తుందని” చుట్టుపక్కల వారు అనడం మొదలుపెట్టారు. దీంతో ఆ దొంగలో భయం మొదలైంది.
చేతబడి వల్ల తన ప్రాణాలకు ముప్పు తప్పదని ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి భావించాడు. అతనికి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణాలు పోతాయని భయం మొదలైంది. దీంతో అతడు 19 నగదు ఒక బ్యాగులో ప్యాక్ చేసి.. దొంగతనం చేసిన ఇంటి ఎదుట పెట్టాడు. అందులో ఒక లెటర్ రాశాడు..”మేము దొంగతనం చేసాం. దాదాపు 25 లక్షల నగదు.. 317 గ్రాముల బంగారాన్ని దొంగిలించాం. నా వాటాగా 19 లక్షలు తీసుకున్నాను. అందువల్లే ఆ నగదు బ్యాగులో పెట్టి మీకు ఇచ్చేస్తున్నాను. మిగతా సొమ్ము గురించి నాకు తెలియదు. నన్ను అడగవద్దు..” అని అతడు ఆ లేేఖలో పెద్ద అక్షరాలతో రాశాడు. అయితే దొంగల కోసం ఆ ఇంటి యజమాని అంజనం వేయించాడని.. చేతబడి చేస్తున్నాడని చుట్టుపక్కల వారు ప్రచారం చేశారు. దీంతో ఆ దొంగ భయపడి డబ్బు తిరిగి ఇచ్చేసాడని తెలుస్తోంది. మరో దొంగ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధ పడినట్టు ప్రచారం జరుగుతోంది.