AP Ration Steam Rice: ఏపీలో రేషన్ కార్డుదారులకు సరికొత్త సౌకర్యం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకొచ్చింది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రేషన్ సరఫరా లో స్టీమ్ రైస్ అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అందించి మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే స్టీమ్ రైస్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి… వసతి గృహాల్లో ఆహారానికి అందిస్తోంది. ఇప్పుడు రేషన్ సరఫరా లో భాగంగా ప్రజలందరికీ అందించేందుకు నిర్ణయించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చింది కూటమి ప్రభుత్వం.
* పక్కదారి పడుతుండడంతో..
రేషన్ లో భాగంగా బియ్యం అందిస్తున్నారు. కానీ వాటి వినియోగం చాలా తక్కువ. ముఖ్యంగా బియ్యం నాణ్యత బాగుండకపోవడంతో చాలామంది వినియోగించడం లేదు. అదే బియ్యం బ్లాక్ మార్కెట్కు వెళ్లి సన్న బియ్యంతో కలుస్తుంది. అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అనేక రకాల విమర్శలు ఉన్నాయి. అందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడే స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరగడంతో పాటు బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకే స్టీమ్ రైస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 42 వేల పాఠశాలలు, నాలుగువేల వసతి గృహాల్లో మధ్యాహ్నం భోజనం కింద స్టీమ్ రైస్ ను విజయవంతంగా అందిస్తున్నారు. అందుకే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషికి ప్రతిపాదించారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో పథకం ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో స్టీమ్ రైస్ పంపిణీకి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించనున్నారు. 200 రకాల నిత్యవసర వస్తువులు అందించేందుకుగాను రేషన్ డిపోల్లో మీ మార్ట్ లు ప్రారంభించనున్నారు.
* ఎన్నో ప్రత్యేకతలు..
ఈ స్టీమ్ రైస్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ధాన్యాన్ని ముందుగా ఆవిరిపై ఉడికించి తయారు చేసే బియ్యం ఇది. వండిన తర్వాత పొడిపొడిగా అంటుకోకుండా ఉండడం, పోషకాలు తగ్గిపోకుండా గింజలు ఇంకిపోవడం దీని ప్రధాన లాభాలు. ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా ముందు నీటిలో నానబెట్టి ఆవిరి ద్వారా ఉడికిస్తారు. ఆవిరి పట్టే పద్ధతి వల్ల పొట్టులోని విటమిన్లు, ఖనిజాలు బియ్యం గింజలు కి వెళ్తాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అన్నం ముద్దగా మారదు. బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్ చేసేందుకు ఈ ఈ బియ్యం ఎంతగానో ఉత్తమం. పైగా సులభంగా జీర్ణం అవుతుంది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఈ బియ్యంతో అన్నం పెడుతున్నారు. సానుకూలత రావడంతోనే ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది.