AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వితంతువుల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన వితంతువులకు ఇంతవరకు పింఛన్లు కొత్తగా ఇవ్వలేదు. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం వారికి ఇవ్వాలని నిర్ణయించడం శుభపరిణామం. వాస్తవానికి వృద్ధాప్యంతో పాటు వితంతువులకు పింఛన్ అందించాలని ప్రభుత్వం భావించింది. ముందుగా వితంతువులకు ఇచ్చి తర్వాత వృద్ధులకు అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వితంతువుల కేటగిరి కింద 1.50 లక్షల మంది అర్హులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సెప్టెంబరు లో వీరందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అక్టోబరు ఒకటి నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త పింఛన్లకు సంబంధించి సెర్ఫ్ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు.
* భర్త చనిపోయిన వెంటనే..
ఏపీలో కూటమి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పోజ్ కోట కింద అంటే భర్త పింఛన్ తీసుకుని మరణిస్తే వెంటనే భార్యకు పింఛన్ అందేలా చేశారు భర్త చనిపోయిన వెంటనే అదే నెల నుంచి భార్యకు వితంతువుల కోటా కింద పింఛన్ అందజేశారు. అలా ఈ కోటా కింద ఎప్పటి వరకు 2.30 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. 2024 డిసెంబర్ నుంచి పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే.. ఆ తరువాత నెల నుంచి భార్యకు పింఛన్ అందిస్తున్నారు.స్పాజ్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తుండడం విశేషం.
* గత ప్రభుత్వంలో మొండి చేయి..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన భార్యలకు కూడా పింఛన్లు అందించలేకపోయారు. అలాగే వితంతువుల పింఛన్ సైతం కొత్తగా అందించలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా వితంతు పింఛన్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ నెలలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్తగా మూడు లక్షల పింఛన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. అందులో ముందుగా వితంతు పింఛన్లు 1.50 లక్షల మందికి అందించాలని కసరత్తు మొదలుపెట్టింది. సెప్టెంబర్ నెలలో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి.. అక్టోబర్ నుంచి పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాలని చూస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.