AP New Pensions: ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, వృద్ధులకు పింఛన్లు అందజేయనున్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వీటిని పరిశీలించి.. అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు గత వారం రోజులుగా కొత్త పింఛన్లపై కసరత్తు చేస్తున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సెప్టెంబరు మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
* సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపదికతో..
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పింఛన్ కు అర్హులను గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా 1.70 లక్షల మంది వితంతువులు ఉన్నట్లు గుర్తించారు. పింఛన్లకు సంబంధించిన అర్హుల వివరాలను ఆరు అంచెల నిబంధనలతో తనిఖీ చేయించింది. చివరిగా 1.50 లక్షల మంది అర్హులు ఉన్నట్లు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మరోసారి పరిశీలిస్తారు. గత ప్రభుత్వ హయాంలో మరో లక్ష మందికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. మరోవైపు చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వృత్తిపరమైన పింఛను కేటగిరి వారి వివరాలు కూడా సహకరిస్తున్నారు. ఈ క్యాటగిరిలో 60 వేల నుంచి 70 వేల వరకు ఉంటారని ఒక అంచనా.
* స్థానిక ఎన్నికల దృష్ట్యా..
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కదలిక వచ్చింది. అర్హులైన వృద్ధులతో పాటు వితంతువులకు ముందుగా పింఛన్లు అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఎన్నికలకు ముందు దరఖాస్తుల స్వీకరణ చేపట్టి.. ఎన్నికలు ముగిశాక కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త పింఛన్లు అనేవి కూటమికి సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్లో కొత్త పింఛన్లకు సంబంధించి అర్హుల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.