Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి. అయితే రాబోయే మూడు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కనిపించే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయంటే..
నేటి వాతావరణాన్ని పరిశీలిస్తే, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గాలివానలు కూడా వీచే అవకాశం ఉండటంతో రైతులు, బయట పనులు చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలు భారీగా కాకపోయినా, తాత్కాలిక ఉపశమనం కలిగించేలా ఉండవచ్చని భావిస్తున్నారు. వేసవి తీవ్రత కొంత తగ్గే సూచనలు ఉన్నప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ప్రాంతానికోలా మారుతూ ఉండబోతుంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండ ఇలా భిన్న పరిస్థితులు కొనసాగనున్నాయి. కాబట్టి ప్రజలు స్థానిక వాతావరణ సూచనలను గమనిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసర సమస్యలను నివారించవచ్చు. అంతేకాకుండా ఎండ ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిది. అలాగే వర్షాలు కురుస్తున్న ప్రాంతంలో సైతం బయటకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి. ఈ సమయంలో గాలి ఎక్కువగా వీచే అవకాశం ఉంది. గాలి దుమారంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ప్రమాదం ఉంది. అంతేకాకుండా భారీ చెట్లు కూలే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి వాతావరణం ఏర్పడిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అంటున్నారు.