Operation Blue Star: భారత దేశంలోని పంజాబ్‌లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్లార్.. చివరకు ఆమె ప్రాణాలే తీసింది. కాంగ్రెస్‌ను దశాబ్దాలపాటు పంజాబ్‌లో అధికారానికి దూరం చేసింది. ఇక 2017లో అధికారంలోకి వచ్చినా.. మళ్లీ అదే పొరపాటు, నిర్లక్ష్యంతో మళ్లీ అధికారానికి దూరమైంది. ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత భారత రాజకీయ, భద్రతా చరిత్రలో ముఖ్యమైన మలుపులు వచ్చాయి. సిక్కు సమాజంలో కోపం పెరిగిన నేపథ్యంలో ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత పంజాబ్‌లో మతపరమైన సున్నితత్వాలను రాజకీయ అస్త్రంగా మార్చుకున్న సంఘటనలు ఒక నిరంతర కథనాన్ని చెబుతున్నాయి.
ఇంటలిజెన్స్ హెచ్చరికలు..
ఆపరేషన్ బ్లూస్టార్ (జూన్ 1984) తర్వాత సిక్కు సమాజంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి స్పష్టమైన రిపోర్టు ఇచ్చాయి. బాడీగార్డ్‌లుగా ఉన్న సిక్కులను తొలగించాలని, వారు రాడికలైజేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఇచ్చిన ఈ హెచ్చరికలను నాయకత్వం పట్టించుకోలేదు. ఇందిరా గాంధీ తన సిక్కు బాడీగార్డ్‌లపై గుడ్డి విశ్వాసం ఉంచారు. ఫలితంగా అక్టోబర్ 31, 1984న ఆమెను వారే హత్య చేశారు.
బ్లూస్టార్ లక్ష్యం నెరవేరలే..
ఇక్కడ ప్రధాన పాఠం ఏమిటంటే.. ఇంటలిజెన్స్ రిపోర్టులు క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. నాయకులు వాటిని విస్మరిస్తే భద్రతా వ్యవస్థలోనే పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి. బ్లూస్టార్ లక్ష్యం కూడా పూర్తిగా నెరవేరలేదు. ఆపరేషన్ తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇది రాజకీయ స్థిరత్వంపైనా ప్రభావం చూపింది. 2017 వరకు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి రాలేకపోయింది.
2015లో బర్గారీ ఘటన..
2015లో పంజాబ్‌లో బర్గారీ సంఘటన జరిగింది. పవిత్ర గ్రంథం ముక్కలు రోడ్డుపై కనిపించడం సిక్కు సమాజంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. అప్పటి అకాలీదళ్ ప్రభుత్వం దీన్ని సమర్థంగా గుర్తించి పరిష్కరించడంలో విఫలమైంది. ఈ వైఫల్యాన్ని కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. ‘‘బాధ్యులను పట్టుకుంటాం’’ అని హామీ ఇచ్చి సిక్కు ఓటర్ల మద్దతు సంపాదించింది. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఐదేళ్ల పాలనలోనూ బర్గారీ బాధ్యులను పట్టుకోలేకపోయింది. 2022 ఎన్నికల్లో ఆప్ పార్టీ కూడా ఇదే నినాదాన్ని ఉపయోగించింది. అయినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదు. ఇక్కడ కనిపించేది స్పష్టమైన నమూనా, మతపరమైన భావోద్వేగాలను ఎన్నికల్లో ఉపయోగించడం, అధికారం సాధించిన తర్వాత మాత్రం న్యాయం చేయకపోవడం. ప్రజల నమ్మకం మళ్లీ మళ్లీ ఉపయోగించబడుతోంది, కానీ సమస్య పరిష్కారం కావడం లేదు.
సామూహిక గుర్తింపు..
ఈ రెండు దశలు (1984, 2015–2022) ఒకే థ్రెడ్‌ను చూపుతున్నాయి. మతపరమైన గాయాలు, భద్రతా వైఫల్యాలు, రాజకీయ లాభాలు ఒకదానిని మరొకటి తాకుతున్నాయి. ఇంటలిజెన్స్ హెచ్చరికలను విస్మరించడం వల్ల వ్యక్తిగత భద్రతా వైఫల్యం జరిగింది. అదే విధంగా బర్గారీ విషయంలో వివిధ ప్రభుత్వాలు న్యాయం చేయకపోవడం వల్ల సామూహిక నమ్మకం క్షీణించింది. సిక్కు సమాజం తమ గాయాలను రాజకీయ పార్టీలు పదే పదే ఉపయోగించుకోవడాన్ని గమనిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యపరమైన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నాయకత్వం ఇంటలిజెన్స్ సలహాలను తీవ్రంగా పరిగణించాలి. అదే విధంగా ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అమలు చేయాలి. లేకపోతే గత చరిత్ర మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంది.